Ponguleti Srinivasa Reddy: సింగరేణిలో 18 గనులను మూసివేసి, 40 వేల మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేసిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సింగరేణి విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, పదేళ్ల అధికారంలో ఒక్క గనినైనా కాపాడలేకపోయారని మండిపడ్డారు. అప్పట్లో గనుల వేలంపాటలో పాల్గొనకుండా సింగరేణికి అన్యాయం చేసిన బీఆర్ఎస్కు ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడు గనుల వేలంపాటలో పాల్గొని సింగరేణిని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుందని పొంగులేటి అన్నారు.
గురువారం వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐతో కలిపి 32 స్థానాల్లో కాంగ్రెస్ పక్షం బలంగా ఉందని మంత్రి తెలిపారు. మిగిలిన రెండు నియోజకవర్గాల్లోనూ గతంలో కాంగ్రెస్కు గట్టి పట్టు ఉందని గుర్తుచేశారు. ఈ రాజకీయ బలాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంగా మలచుకోవాలని, కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Also Read: సీఎంఓ నుంచి బెదిరింపులు.. ప్రతి పనికి 15 శాతం కమీషన్.. కవిత సంచలన ఆరోపణలు!
గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి, పట్టభద్రుల ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు సర్వోత్తమ రెడ్డికి వేయించేలా కృషి చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఓటు నమోదు, రెన్యువల్కు అవకాశం ఉన్న నేపథ్యంలో దసరా సహా పండుగలకు స్వగ్రామాలకు వచ్చే పట్టభద్రులను గుర్తించి, అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా చూడాలన్నారు.
Also Read: ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో స్కాములు దాస్తున్నారా.. ప్రభుత్వంపై ఎలేటి ఫైర్!