Road Safety: తెలంగాణలో రోడ్డు భద్రత గాల్లో దీపంగా మారింది. 2024 నుంచి 2026 ఆగస్టు వరకు సుమారు 3 కోట్ల 78 లక్షల ఉల్లంఘనలు జరిగాయంటే వాహనదారులకు ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతోంది. ఇందులో కేవలం హెల్మెట్ లేని కేసులే 2 కోట్ల 48 లక్షలు ఉన్నాయంటే షాక్ అవ్వాల్సిన విషయమే. జుట్టు పాడవుతుందనో, దగ్గరే కదా అనో సాకులు చెబుతున్నారే తప్ప.. హెల్మెట్ ప్రాణాలు కాపాడే రక్షణ కవచమని మర్చిపోతున్నారు.
చలాన్ పడితే ఎవడు కడతాడులే అనే నిర్లక్ష్యం ఎందరో ప్రాణాలను బలితీసుకుంటోంది. తెలంగాణలో 42 లక్షల రాంగ్ రూట్ కేసులు, 25 లక్షల ఓవర్ స్పీడ్ కేసులు, 8 లక్షలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఫోన్ మాట్లాడుతూనో, రాంగ్ రూట్లో వెళ్తూనో చేసే ఒక్క చిన్న పొరపాటు.. ఎదురుగా వచ్చే అమాయకుల ప్రాణాలను తీస్తోంది. డ్రైవింగ్ సమయంలో వేగం కంటే ప్రాణం ముఖ్యం అనే స్పృహ క్షణం మార్చకపోతే ఘోరం జరిగిపోతోంది.
ఈ ఉల్లంఘనలు కేవలం ఫైన్లతో ముగిసిపోవడం లేదు.. ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. తెలంగాణలో ఏటా సగటున 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతుంటే.. 32 వేల మంది వికలాంగులుగా మారుతున్నారు. ఓ వ్యక్తి చనిపోవడం అంటే.. లోకాన్ని విడిచి వెళ్లడం కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడటం అని ఎప్పుడు తెలిసొస్తుందో..! పిల్లల చేతికి బైక్లు ఇచ్చే తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు తెస్తోంది. తెలంగాణ పోలీసులు అరైవ్ అలైవ్ పేరుతో ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ప్రజల్లో మార్పు రాకపోవడం విచారకరం.
గమ్యాన్ని చేరడం ఎంత ముఖ్యమో.. క్షేమంగా చేరడం అంతకంటే ముఖ్యం. చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కాదు.. మీ ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వారి కోసం రూల్స్ పాటించండి. హెల్మెట్ ధరించండి, వేగాన్ని తగ్గించండి, మద్యం తాగి వాహనం నడపకండి. మీ నిర్లక్ష్యం మీ కుటుంబానికి శోకం మిగల్చకూడదని ‘బిగ్ టీవీ’ కూడా హెచ్చరిస్తోంది.
Also read: ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో స్కాములు దాస్తున్నారా.. ప్రభుత్వంపై ఎలేటి ఫైర్!