Sajjala Ramakrishna: అమరావతిలో వైయస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నవి అసలైన ఎన్నికలు కావని, ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న వ్యవస్థీకృత దౌర్జన్యాలని ఆరోపించారు. ఎన్నికల్లో కనీసం నామినేషన్ వేయడమే నేరంగా కూటమి ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు.
నామినేషన్లపై అరాచకాలు
రాష్ట్రంలో టీడీపీ మూకలు విచక్షణారహితంగా దాడులు చేస్తుంటే పోలీసులు రక్షణ కవచంగా నిలవడం దారుణమని సజ్జల విమర్శించారు. ప్రొద్దుటూరు, కనిగిరి, నగరి, రాజంపేట వంటి పలు ప్రాంతాల్లో నామినేషన్లను అడ్డుకోవడం, స్క్రూటినీలో అభ్యర్థులపై దాడులు చేసి పత్రాలు చించివేయడం ఆందోళనకరమన్నారు. చివరికి డిపాజిట్ రసీదులు ఉన్నా, చిన్న చిన్న కారణాలు చూపి నామినేషన్లను రద్దు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా తన స్వతంత్రతను కోల్పోయి, సీఎంవో అనుబంధ విభాగంలా మారిందని వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితా లొసుగులు, పారామిలటరీ డిమాండ్
రాష్ట్రంలో 15 లక్షలకు పైగా మృతుల పేర్లు, 44 లక్షలకు పైగా అనుమానాస్పద ఓట్లు ఉన్న పాత జాబితాలతోనే ఎన్నికలు నిర్వహించడం వెనుక దొంగ ఓట్లను ప్రోత్సహించే కుట్ర ఉందన్నారు. భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటే హైర్డ్ కిల్లర్స్ అని అనడం సీఎం స్థాయికి తగదని హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలను కేంద్ర పారామిలటరీ బలగాల పర్యవేక్షణలోనే నిర్వహించాలని సజ్జల డిమాండ్ చేశారు.
ప్రజలు చంద్రబాబును నిలదీయాలి
కూటమి ప్రభుత్వానికి గెలుస్తామనే ధైర్యం లేకనే ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటోందని, ఏకగ్రీవాల పేరుతో గెలిచామని చెప్పుకోవడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని అన్నారు. గత రెండేళ్లలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, పౌరులంతా ప్రచారానికి వచ్చే టీడీపీ నేతలను హామీలపై నిలదీయాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ప్రజలు ఇచ్చే సరైన తీర్పు కోసమే వైయస్సార్‌సీపీ పోరాడుతోందని తేల్చి చెప్పారు.
Also Read: పశ్చాత్తాపపడినా వదిలిపెట్టం.. అధికారులకు చెవిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!