YS Sharmila: ఏపీలో నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పులివెందుల, కడప, రాయచోటి సహా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై జరిగిన దాడులు, నామినేషన్ పత్రాల చించివేత ఘటనలు రాజకీయంగా కలకలం రేపాయి. ఈ పరిణామాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల సారాంశం ఇదీ…
రాష్ట్రంలో హింసాత్మక పాలన.. షర్మిల ధ్వజం
రాష్ట్రంలో సుపరిపాలన లేదు కదా, పారదర్శకత అంతకన్నా లేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో హింసాత్మక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సంఘాన్ని తమ తొత్తుగా మార్చుకుని, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా కాంగ్రెస్ అభ్యర్థులను భౌతిక దాడులతో అడ్డుకోవడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ఆమె నిలదీశారు.
కిరాయి గూండాలతో బెదిరింపులు
మంత్రులే స్వయంగా నామినేషన్ కేంద్రాల వద్ద నిలబడి వార్నింగ్లు ఇస్తుంటే ఎన్నికల్లో పారదర్శకత ఎక్కడ ఉంటుందని షర్మిల ప్రశ్నించారు. కిరాయి గూండాలు, రౌడీలను రంగంలోకి దించి బెదిరింపులకు పాల్పడుతుంటే ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాయచోటి, పుంగనూరు కేంద్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి
అధికారం శాశ్వతం కాదని, ప్రతిపక్షాలను అణచివేయడం చంద్రబాబు భయానికి నిదర్శనమని షర్మిల పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఏకగ్రీవాలు చేయాలని చూసిన చోట ఎన్నికలను నిలిపివేసి, మళ్లీ రీ-నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ నిరంకుశత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
Also Read:మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!