Supreme Court: స్వేచ్ఛ బ్యూరో: రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం మహిళల రుతుక్రమ ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించిన తీర్పు అమలుపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రుతుక్రమ ఆరోగ్యాన్ని (బహిష్టు పరిశుభ్రత) ప్రాథమిక హక్కులో భాగంగా గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు అమలుపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్పందించకపోవడంపై సీరియస్ కామెంట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం అడిగినా ఇప్పటివరకు అవసరమైన వివరాలను ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందించక పోవడంపై ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి కూడా స్పందించకపోతే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది. జస్టిస్ జే.బీ.పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారించింది. బహిష్టు ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక హక్కు తీర్పు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని స్పష్టం చేసింది.
కోర్టు తీవ్ర అసంతృప్తి ..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుందని ధర్మాసనం గుర్తుచేసింది. రుతుక్రమ పరిశుభ్రత, ఆరోగ్యం కూడా ఈ హక్కులో భాగమని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని తెలిపింది. కేంద్రం కోరిన సమాచారం ఇవ్వకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు తీర్పులో చెప్పిన అంశాలు కేవలం కాగితాలపైనే ఉంటే, ఈ ప్రాథమిక హక్కును కేంద్రం, రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని, తీర్పు అమలు తీరుపై వివరాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్ని కోరినట్టు తెలిపారు. అయితే, ఇప్పటివరకు స్పందన రాలేదని ఆమె కోర్టుకు వివరించారు.
ధర్మాసనం ఆగ్రహం..
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం కేంద్రం కోరినా రాష్ట్రాలు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ తీర్పు ప్రాముఖ్యతను గుర్తించాయని భావిస్తున్నట్టు తెలిపిన ధర్మాసనం ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై లిఖితపూర్వక వివరాలు సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ సమయంలోనూ కొన్ని రాష్ట్రాలైనా స్పందించలేదని కేంద్రం చెబితే సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది. చివరిసారిగా అవకాశం ఇస్తూ కేసు విచారణను డిసెంబర్ 14 కు వాయిదా వేసింది. మేం తీర్పులో చెప్పిన విషయాలు కేవలం కాగితాలకే పరిమితమైతే, కేంద్రం, రాష్ట్రాలు ఈ ప్రాథమిక హక్కును చిన్నారి బాలికలకు ఎలా అందిస్తాయి? సుదూర ప్రాంతాల్లో రుతుస్రావ పరిశుభ్రత సదుపాయాలు లేక చదువుకు దూరమవుతున్న వేలాది మంది బాలికల సంక్షేమం కోసం ఈ తీర్పు ఇచ్చామని గుర్తించాలని సుప్రీంకోర్టు తెలిపింది.
పాఠశాలల్లో బాలికల సమస్యలపై దృష్టి..
రుతుక్రమ పరిశుభ్రత సమస్యల కారణంగా సరైన సదుపాయాలు లేకపోవటంతో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని బాలికలు చదువును మధ్యలోనే మానేస్తున్నారని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడటమే తీర్పు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని తెలిపింది. సెప్టెంబర్ 1న ఇచ్చిన ఆదేశాల్లో పాఠశాలల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా ఉండే మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయన్న దాంతోపాటు అవి సరిగా ఉన్నాయా? లేదా? అన్న అంశంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం సరిగ్గా ఉందా? లేదా? బాలికలకు ప్రైవసీ, సులభంగా అక్కడికి చేరుకునే సౌకర్యాలు ఉన్నాయా? లేదా? పరిశీలించాలని ఆదేశించింది.
Also Read: ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!