KGBV Jobs: రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో చిన్న చిన్న పొరపాట్లు, కారణాల వల్ల గతంలో ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు విద్యాశాఖ అడుగులు వేస్తోంది. వివిధ కారణాలతో సర్వీస్ నుంచి తొలగించిన కొంతమంది ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు(ఎస్ వో), ఇతర సిబ్బందిని ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల్లో తిరిగి నియమించేందుకు అనుమతి ఇవ్వాలని సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
కేజీబీవీల్లో పనిచేసే వారంతా కాంట్రాక్ట్ సిబ్బందేనని, గత కొన్నేళ్లుగా పాఠశాలల నిర్వహణలో దొర్లిన కొన్ని చిన్నపాటి లోపాల ఆధారంగా వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ఎస్పీడీ తన లేఖలో పేర్కొన్నారు. అయితే, తొలగించిన వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలని వివరించారు. చిన్నపాటి తప్పులకు తమకు చాలా కఠినమైన శిక్ష విధించారని, ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు నిరంతరం వారి నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా ఉద్యోగాలు కోల్పోయిన మొత్తం 24 మంది సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలను సమగ్ర శిక్షా విభాగం నివేదికలో పొందుపరిచింది.
ఆహారం వికటించిన సంఘటనలు, రికార్డుల నిర్వహణ లోపాలు, విద్యార్థినులపై పర్యవేక్షణా లోపం వంటి కారణాలతో గతంలో వీరిపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాల్లో ఖాళీగా ఉన్న స్పెషల్ ఆఫీసర్, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎం పోస్టుల్లో అర్హతలను బట్టి వీరందరినీ తిరిగి నియమించేందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు అనుమతులు మంజూరు చేయాలని నవీన్ నికోలస్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తే త్వరలోనే వీరంతా మళ్లీ విధుల్లో చేరే అవకాశం ఉంది.
Also read: వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు!