Ramchander Rao: తెలంగాణ లో రాజకీయ వేడి మరోసారి హీటెక్కింది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు తాండవిస్తుంటే వాటిని పరిష్కరించడం వదిలేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టడం రాజకీయ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రధాని కుటుంబంపై వ్యక్తిగత దూషణలు
దేశ రాజకీయాల్లో అబద్ధాలతో ప్రజలను నమ్మించలేక, ప్రధాని నరేంద్ర మోదీ తల్లిదండ్రులపై కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దౌర్భాగ్యకరమని రామచందర్ రావు మండిపడ్డారు. సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే పాట్నాలో ప్రధాని కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక చాయ్‌వాలా ప్రధాని కావడాన్ని సహించలేకనే కాంగ్రెస్ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు ప్రకటించారు.
రేవంత్ రెడ్డికి సవాల్
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని రామచందర్ రావు ఆరోపించారు. దేశంలో గుర్తించిన 13 కోట్ల ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాల్లో మరణించినవారు, వేరే ప్రాంతాలకు మారినవారు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. ‘రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా.. మీ సొంతూరు కొండారెడ్డిపల్లికి వస్తా.. సమయం చెప్పండి. అక్కడ ఎన్ని ఓట్లు తొలగించారో నిరూపించండి’ అని సవాలు విసిరారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటూ తొలగించబడదని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో నీటి సంక్షోభం… ఢిల్లీలో నిరసనలా?
తెలంగాణలో వర్షాభావం వల్ల 330 మండలాలు కరువును ఎదుర్కొంటున్నాయని, 6 వేల చెరువుల్లో కేవలం 500 చెరువుల్లోనే నీరు ఉందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని పేర్కొన్నారు. ‘రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లుగా, రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఉంటే సీఎం ఢిల్లీ ర్యాలీలకు వెళ్తున్నారు’ అని ఎద్దేవా చేశారు.
నవంబర్ 2న అమిత్ షాతో పాదయాత్ర
కాంగ్రెస్ సృష్టిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా నవంబర్ 2న ‘లోక్‌తంత్ర్ బచావో – సేవ్ డెమోక్రసీ’ నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారని రామచందర్ రావు వెల్లడించారు.
Also Read: దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయండి.. జేసీ వర్గానికి పెద్దారెడ్డి సవాల్!