Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి ఇంట్లో ఉంటే ఆయుఃఆరోగ్య ఐశ్వర్యాలు కలిసి వస్తాయట. ఒక ఇల్లు కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టింది మాత్రమే కాదు.. ఆ ఇంట్లో నివసించే వ్యక్తులకు సానుకూల శక్తిని (Positive Energy) ప్రసరింపజేసే ఒక నిలయం. ఒక మంచి వాస్తు పద్ధతిలో కట్టిన ఇంట్లో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదట.
ప్రధాన ద్వారం (Main Entrance): ఇంటి సింహద్వారం ఎప్పుడూ శుభప్రదమైన దిశలోనే ఉండాలట. తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలలో సింహద్వారం ఉండటం అత్యంత శ్రేయస్కరమట. సింహ ద్వారం వద్ద ఎప్పుడూ వెలుతురు ఉండాలి. చెప్పుల స్టాండ్‌లు లేదా చెత్త కుండీలు ప్రధాన ద్వారం ఎదురుగా ఉండకూడదట.
ఈశాన్య మూల (North-East) – దైవ మూల: ఇది ఇంటికి అత్యంత పవిత్రమైన భాగం. పూజ గదిని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలట. పూజ చేసేటప్పుడు ముఖం తూర్పు వైపు ఉండటం మంచిదట. ఈ మూల ఎప్పుడూ తేలికగా, శుభ్రంగా ఉండాలట. ఇక్కడ భారీ వస్తువులను లేదా మెట్లను నిర్మించకూడదట.
ఆగ్నేయ మూల (South-East) – అగ్ని మూల: ఇది వంటగదికి కేటాయించిన దిశ. ఆగ్నేయంలో వంటగది ఉండటం వల్ల ఆరోగ్యానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందట. వంట చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి వండటం ఉత్తమమని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
నైరుతి మూల (South-West) – భూమి మూల: ఇది స్థిరత్వానికి చిహ్నం. ఇంటి యజమాని నిద్రించే గది నైరుతి మూలలో ఉండాలట. దీనివల్ల కుటుంబంలో ఆధిపత్యం, గౌరవం మరియు స్థిరత్వం లభిస్తాయట. ఈ దిశలో బీరువాలు, భారీ సామాగ్రి లేదా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండటం వాస్తు ప్రకారం మంచిదట.
వాయువ్య మూల (North-West) – వాయు మూల: అతిథి గది లేదా పిల్లల గదిని ఈ దిక్కులో ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా టాయిలెట్లు ఈ దిశలో లేదా పడమర వైపు ఉండటం మంచిదట.
బ్రహ్మ స్థానం (Center of the House): ఇంటి మధ్య భాగం ఎప్పుడూ ఖాళీగా ఉండాలి. అక్కడ ఎలాంటి గోడలు, పిల్లర్లు లేదా బరువైన సామాన్లు ఉండకూడదట. దీనివల్ల ఇంటి అంతటా ప్రాణశక్తి స్వేచ్ఛగా ప్రసరిస్తుందట.
ఇతర ముఖ్యమైన అంశాలు: ఇంటికి ఉత్తరం మరియు తూర్పు దిశల్లో పెద్ద కిటికీలు ఉండాలట.. తద్వారా ఉదయపు సూర్యకాంతి ఇంట్లోకి ప్రసరిస్తుందట. అలాగే సంపు (Sump) లేదా భూగర్భ నీటి తొట్టి ఈశాన్యంలో ఉండాలట. ఓవర్ హెడ్ ట్యాంక్ మాత్రం నైరుతి లేదా పడమరలో ఉండాలట. ఇంకా గాలి ధారాళంగా ఆడే ఇల్లు సహజంగానే సానుకూలతను కలిగి ఉంటుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.