Elinati Shani: ఏలినాటి శని ప్రభావం వల్ల కలిగే మానసిక ఆందోళనలు, పనుల్లో జాప్యం మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని అద్భుతమైన పరిహారాలను సూచిస్తోంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ పరిహారాలు పాటిస్తే మీరు అనుభవిస్తున్న శని కష్టాలు అన్ని దూరం అవుతాయని పండితులు సూచిస్తున్నారు. ఆ రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శనివార నియమాలు (Saturdays): ప్రతి శనివారం శని దేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం అత్యంత శ్రేష్టమని పండితులు సూచిస్తున్నారు. దీని వల్ల మీకున్న శని దోషాలు అన్ని తీరిపోతాయట. ఇక శనివారం సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేయాలట. అలాగే శనివారం నాడు నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందట.
హనుమాన్ ఆరాధన (శని దోషానికి విరుగుడు): శని దేవుడు హనుమంతుడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, ఆంజనేయ స్వామిని పూజించే వారిని శని బాధించడట. అందుకే ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఏలినాటి శని వల్ల కలిగే భయం, ఆందోళన తొలగిపోతాయట. అలాగే శనివారం నాడు హనుమంతుడికి సింధూర పూజ చేయించడం వల్ల మానసిక స్థిరత్వం లభిస్తుందట.
పేదలకు, బీదలకు దాన ధర్మాలు చేయడం(Charity): శని దేవుడు న్యాయాధికారి, కష్టపడే వారిని మరియు పేదలను ఆదుకునే వారిని ఆయన కరుణిస్తాడట. నల్ల నువ్వులను లేదా నల్లటి వస్త్రాన్ని పేదలకు దానం చేయాలట.అలాగే శనివారం నాడు వికలాంగులకు లేదా నిరుపేదలకు భోజనం పెట్టడం అన్నిటికంటే పెద్ద పరిహారమట. ఇక వీధిలో ఉండే నల్ల కుక్కకు రొట్టె లేదా బిస్కెట్లు వేయడం వల్ల శని దోషం తగ్గుతుందట.
మంత్ర పఠనం చేయడం: ఏలినాటి శనితో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 108 సార్లు ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః లేదా.. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాలను జపిస్తుంటే.. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందట.
ఏలినాటి శని తగ్గేందుకు ధరించవలసినవి: నల్ల గుర్రపు నాడా ఉంగరం మధ్య వేలికి (Middle Finger) శనివారం నాడు ధరించాలట. దీంతో మీపై ఉన్న శని ప్రభావం కాస్త తగ్గుతుందట. అయితే ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవడానికి మరియు జీవిత పాఠాలు నేర్చుకోవడానికి వచ్చే కాలమని. పైన చెప్పిన పరిహారాలు పాటిస్తూ, నిజాయితీగా పని చేస్తే శని దేవుడు మీకు అపారమైన స్థిరాస్తిని, అనుభవాన్ని ప్రసాదిస్తాడని పండితులు చెప్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.