Gajakesari Yoga: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన మరియు శుభప్రదమైన యోగాలలో గజకేసరి యోగం ఒకటి. గజ అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. ఏనుగుకు ఉండే బలం, సింహానికి ఉండే పరాక్రమం కలిస్తే ఎలా ఉంటుందో.. ఈ యోగం ఉన్న వారి జీవితం కూడా అలానే ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే ఈ యోగం ఎలా ఏర్పడుతుంది, ఎవరికి పడుతుంది దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది?: జన్మ కుండలిలో (జాతకంలో) గురు గ్రహం (బృహస్పతి), చంద్రుడు కలయిక లేదా పరస్పర స్థితి వల్ల ఈ యోగం ఏర్పడుతుందట. చంద్రుడి నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో (కేంద్ర స్థానాలు) గురుడు ఉన్నప్పుడు ఈ యోగం కలుగుతుందట. అలాగే గురుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో కలిసి ఉన్నా ఈ యోగం ఏర్పడుతుందట.
ఈ యోగం ఎవరికి బాగా ఫలిస్తుంది?: ఈ యోగం ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకేలాంటి ఫలితాలు ఉండవట. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుందట.. గురుడు మరియు చంద్రులు కేంద్ర స్థానాల్లో (1, 4, 7, 10) లేదా కోణ స్థానాల్లో (1, 5, 9) ఉంటే ఫలితం ఎక్కువగా ఉంటుందట. అలాగే గురుడు తన స్వక్షేత్రం (ధనుస్సు, మీనం) లేదా ఉచ్చ క్షేత్రం (కర్కాటక రాశి) లో ఉండి ఈ యోగం ఏర్పడితే జాతకుడు తిరుగులేని శక్తివంతుడు అవుతాడట.
పాప గ్రహాల దృష్టి లేకపోవడం: ఈ రెండు గ్రహాలపై శని, రాహువు లేదా కుజుడు వంటి గ్రహాల ప్రతికూల దృష్టి లేనప్పుడు యోగం సంపూర్ణంగా పడుతుందట.
ఈ యోగం ఉంటే జీవితం ఎలా ఉంటుంది?: గజకేసరి యోగం ఉన్నవారు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వారి జీవితంలో ప్రధానంగా కనిపించే మార్పులు గౌరవం మరియు కీర్తి. వీరు ఎక్కడికి వెళ్లినా గౌరవం లభిస్తుందట. ఉన్నత పదవులు, రాజకీయ యోగం లేదా సమాజంలో పెద్దరికం వహిస్తారట. అలాగే వీరికి ధనానికి లోటుండదట. సంపద దానంతట అదే వస్తుందట. వ్యాపారాలు, పెట్టుబడులలో భారీ లాభాలు గడిస్తారట. వీరు మాట్లాడే తీరు ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటుందట. గొప్ప వక్తలుగా సలహాదారులుగా రాణిస్తారట. సింహం ముందు ఏనుగు నిలబడలేనట్లే.. ఈ యోగం ఉన్నవారి ముందు శత్రువులు నిలబడలేరట. వీరికి అపజయం అనేది చాలా తక్కువగా ఎదురవుతుందట. మంచి ఇల్లు, వాహనాలు, సౌకర్యవంతమైన కుటుంబ జీవితం వీరికి దక్కుతాయట.
చాలా మంది జాతకాల్లో గజకేసరి యోగం ఉంటుంది, కానీ అందరూ కోటీశ్వరులు అవ్వరు. దీనికి కారణం ఆ గ్రహాల డిగ్రీల బలం (Shakti) వారు నడిపే దశ (Period). గురు దశ లేదా చంద్ర దశ వచ్చినప్పుడు మాత్రమే ఈ యోగ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.