Evil Eye: చిన్నపిల్లలు అంటేనే ముద్దుగా, చురుగ్గా ఉంటారు. వారు నవ్వుతున్నా, ఆడుకుంటున్నా ఎవరి కళ్లయినా పడటం సహజం. పిల్లలకు ‘దిష్టి తగలడం’ అనేది ఒక బలమైన నమ్మకం. పిల్లాడు పాలు తాగకపోయినా.. కారణం లేకుండా ఏడుస్తున్నా “ఎవరి దిష్టి తగిలిందో ఏమో?” అని తల్లులు కంగారు పడుతుంటారు. ఇంతకీ దిష్టి అంటే ఏంటి? మన పూర్వీకులు దిష్టి తొలగించడానికి పిల్లల కోసం సూచించిన పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకు దిష్టి తగలకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
పిల్లలు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. మన పెద్దల మాట ప్రకారం.. ఇతరుల చూపులో ఉండే ప్రతికూల శక్తి పిల్లల మీద పడినప్పుడు వారు నీరసించిపోవడం లేదా చికాకు పడటం జరుగుతుంది. దీనినే మనం ‘దిష్టి’ లేదా ‘నజర్’ అంటాం. దీన్ని వదిలించడానికి మన ఇళ్లలో కొన్ని సంప్రదాయ పద్ధతులు పాటిస్తుంటాం.
1. నల్లని దిష్టి చుక్క :
పిల్లలకు కాటుకతో చెంప మీదో.. లేదా చెవి వెనకో లేదా అరికాళ్ళలో దిష్టి చుక్క పెట్టడం అందరికీ తెలిసిందే. ఇది కేవలం అందం కోసం కాదు.. పిల్లాడిని చూసిన వెంటనే ఎదుటి వారి దృష్టి ఆ నల్లని చుక్క మీద పడి, నెగటివ్ ఎనర్జీ అక్కడే ఆగిపోతుందనేది ఒక నమ్మకం.
2. నల్లటి దారం లేదా మొలతాడు:
చిన్నపిల్లలకు చేతికి కానీ, కాలికి కానీ నల్లటి దారం కట్టడం మనం చూస్తుంటాం. నలుపు రంగు చెడు శక్తిని గ్రహిస్తుందని నమ్ముతారు. అలాగే మగ పిల్లలకు నల్లటి మొలతాడు కట్టడం వల్ల ఆరోగ్యంతో పాటు దిష్టి కూడా తగలదని చెప్తారు.
3. ఉప్పుతో దిష్టి తీయడం:
ఒక పిడికెడు కల్లు ఉప్పు తీసుకుని, పిల్లాడి చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజ్, మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి నీళ్లలో వేయడం లేదా మంటలో వేయడం మన ఇళ్లలో ట్రెడిషనల్ పద్ధతి. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణం ఉంటుందని సైంటిఫిక్ రీసెర్చ్‌లు కూడా చెబుతున్నాయి.
4. మిరపకాయలు & ఆవాలు:
ఎండు మిరపకాయలు, ఆవాలు, ఉప్పు కలిపి దిష్టి తీసి నిప్పుల్లో వేయడం మరో పద్ధతి. ఒకవేళ దిష్టి ఎక్కువగా ఉంటే.. ఆ మిరపకాయలు కాలినప్పుడు వాసన (ఘాటు) రాదని పెద్దలు అంటారు. ఇది వినడానికి వింతగా ఉన్నా, చాలా ఇళ్లలో ఇప్పటికీ దీన్ని పాటిస్తారు.
5. ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు:
బయటకు తీసుకెళ్లినప్పుడు: పిల్లాడిని కొత్త ప్రదేశాలకు లేదా గుంపుల్లోకి తీసుకెళ్లినప్పుడు దిష్టి చుక్క పెట్టడం మర్చిపోవద్దు.
ఆహారం విషయంలో: పిల్లలు ఆహారం తింటున్నప్పుడు ఇతరులు చూడటం అంత మంచిది కాదని అంటారు. అందుకే వారు తింటున్నప్పుడు కాస్త గోప్యత పాటించడం బెటర్.
నవ్వు చూసి మురిసిపోవడం: పిల్లాడు బాగా నవ్వుతున్నా లేదా ముద్దుగా కనిపిస్తున్నా వెంటనే దిష్టి తగిలే అవకాశం ఉంది. అలాంటి సమయంలో తల మీద ఒక్కసారి నిమరడం లేదా ‘దిష్టి తగలకూడదు’ అని మనసులో అనుకోవడం మంచిది.
6. స్నానం చేయించేటప్పుడు:
పిల్లలకు స్నానం చేయించే నీళ్లలో చిటికెడు వేపాకు పొడి లేదా కల్లు ఉప్పు వేస్తే చర్మం బాగుండటమే కాకుండా చెడు దృష్టి కూడా పోతుంది.
Also Read: అదృష్టాన్ని మార్చే రత్నాలు.. కెరీర్, బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే ఇవి ధరించాల్సిందే !
ఇది మూఢనమ్మకమా?
సైన్స్ పరంగా చూస్తే, ప్రతి వ్యక్తి చుట్టూ ఒక ‘ఆరా’ ఉంటుంది. ఇతరుల నుంచి వచ్చే బలమైన ఆలోచనలు లేదా చూపు ఆ ఆరాపై ప్రభావం చూపుతాయి. దీన్నే మనం సైకలాజికల్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అంటాం. కాబట్టి దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేం.
పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. పైన చెప్పిన పద్ధతులు మన సంప్రదాయంలో భాగంగా వస్తున్నవే. వీటితో పాటు పిల్లలకు తగినంత నిద్ర, పౌష్టికాహారం అందిస్తూ.. ఒకవేళ పిల్లాడు బాగా ఏడుస్తుంటే.. మాత్రం కేవలం దిష్టి అని ఆగిపోకుండా డాక్టర్‌ను సంప్రదించడం కూడా చాలా ముఖ్యం!.