Solar Eclipse 2026: సాధారణంగా ప్రతి ఆరు నెలలకోసారి గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ప్రజలు వీటిని అశుభ సూచనలుగా భావించి జాగ్రత్తలు పాటిస్తుంటారు. ముఖ్యంగా గ్రహణం జరిగే రోజున చాలామంది ఆహారం కూడా ముట్టరు. కొంతమంది గ్రహణ సమయంలో ఇంటి తలుపులు కూడా మూసేస్తారు. ఈ నేపథ్యంలో 2026లో సూర్య గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? భారతదేశంలో కనిపిస్తుందా? ఎలాంటి నియమాలు పాటించాలి.. అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ప్రతి ఏటా దాదాపు రెండు లేదా అప్పుడప్పుడు మూడు గ్రహణ కాలాలు సంభవిస్తాయి. ఈ సందర్భంగా పండితులు.. ప్రతి గ్రహణ కాలము ఆరు నెలల( 173 రోజులు) కంటే.. తక్కువ సమయంలో పునరావృతమవుతుందని చెబుతారు. కాగా.. కొత్త ఏడాది(2026)లో ఫిబ్రవరి 17న పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం ప్రధానంగా దక్షిణార్థ గోళంలోని కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించనుంది. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనబడకపోవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అంటే.. భారతదేశ ప్రజలు ఈ గ్రహణాన్ని చూడలేరన్నమాట.
కొత్త ఏడాది ఫిబ్రవరి 17న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం.. చిలీ, అంటార్కిటికా, అర్జెంటీనా, మారిషస్, నమీబియా, టాంజానియా, గ్రీన్‌ల్యాండ్, ఐర్లాండ్, జాంబియా, జింబావ్వే, దక్షిణ జార్జియా, దక్షిణాఫ్రికా, మడగాస్కర్, బ్రిటిష్ హిందూ మహాసముద్ర ప్రాంతం తదితర దేశాల్లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే.. గ్రహణం ఎప్పుడూ ఒంటరిగా రాదు. సూర్యగ్రహణం ఎప్పుడూ చంద్ర గ్రహణానికి రెండు వారాల ముందు లేదా తర్వాత సంభవిస్తుంది.
సూర్య గ్రహణం.. చంద్రుడు, భూమి అమావాస్య సమయంలో ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. ఆ నీడ పడిన ప్రాంతాల్లో సూర్య గ్రహణం కనిపిస్తుంది. అలాగే, ఈ గ్రహణం సమయంలో సూర్యుడి కాంతిని భూమిపై కొంత భాగం లేదా పూర్తిగా అడ్డుకుంటుంది. ఈ ప్రక్రియ అమావాస్య రోజున జరుగుతుంది. చంద్రుని కక్ష్య అనేది భూమి కక్ష్య కంటే కొద్దిగా వంగి ఉండటం వల్ల ప్రతి అమావాస్యకు కాకుండా ఏడాదికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సూర్య గ్రహణం సంభవిస్తుంది.
2026లో జరిగే ఈ సూర్యగ్రహణం తర్వాత.. అదే ఏడాది మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. దాని తర్వాత ఆగస్టు 12న మరోసారి సంపూర్ణ సూర్యగ్రహణం, ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం జరగనున్నాయి. అంటే.. 2026 ఏడాది మొత్తం 4 ప్రధాన గ్రహణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. వీటిలో కొన్ని భారతదేశంలో కనిపించవచ్చు, కొన్ని మాత్రం విదేశీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి.
సూర్యగ్రహణం వీక్షించడాన్ని చాలామంది మరపురాని అనుభూతిగా భావిస్తుంటారు. కానీ, గ్రహహ సమయాల్లో భద్రతా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి రక్షణ లేకుండా గ్రహణం రోజున సూర్యుడిని నేరుగా చూస్తే కంటి రెటీనా దెబ్బతింటుంది. దీనినే ‘ఎక్లిప్స్ బ్లైండ్నెస్’ అంటారు. ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించాలంటే.. ఎక్లిప్స్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలని నిపుణులు చెబుతున్నారు.