Jubilee Hills Bypoll: గాంధీ భవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కెప్టెన్‌గా రాష్ట్రాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాను ఒక నాయకుడిగా పార్టీని నడిపించానని, ఈ గెలుపు పూర్తిగా బూత్ స్థాయి సభ్యులదేనని అభినందించారు. జూబ్లీహిల్స్‌లో యువకుడైన నవీన్ యాదవ్‌ను ప్రజలు ఆశీర్వదించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. ముఖ్యంగా, తనపై ఉన్న ‘రౌడీ’ అనే ముద్రను ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవడం ద్వారా చెరిపివేయాలని నవీన్ యాదవ్ కు హితవు పలికారు.
జూబ్లీహిల్స్‌లో గెలిచిన విధానంలోనే రాబోయే జీహెచ్‌ఎంసీ, సర్పంచ్, జెడ్‌పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి గెలవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ గెలుపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సులువుగా గెలవడానికి మార్గం సుగమం చేస్తుందన్నారు.
Read Also: Kavitha: జూబ్లీహిల్స్ ఓటమిపై కవిత ట్వీట్.. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ అన్నకు కౌంటర్!
అనంతరం ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడటం లేదని, కేటీఆర్ కేవలం ‘కిరాయి సోషల్ మీడియా’తో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్‌లో కిషన్ రెడ్డికి వ్యక్తిగతంగా 60 వేల ఓట్లు పడితే, ఆ ఓట్లు బీజేపీకి ఎందుకు పడలేదని ఆయన ప్రశ్నించారు. బీహార్‌లో 69 లక్షల మైనారిటీ, అట్టడుగు వర్గాల ఓట్లను కుట్రపూరితంగా తొలగించారని, అవన్నీ కాంగ్రెస్ కూటమికి పడే ఓట్లేనని సంచలన ఆరోపణ చేశారు.
దేశంలో టెర్రరిస్ట్ దాడులు ఎప్పుడూ ఎన్నికల ముందే ఎందుకు జరుగుతున్నాయని, వాటిని ఎందుకు ఆపలేకపోతున్నారని కేంద్రాన్ని నిలదీశారు. రష్యాలో పుతిన్ మాదిరిగా, నరేంద్ర మోదీ కూడా శాశ్వత ప్రధానిగా ఉండాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పోల్ మేనేజ్‌మెంట్‌ను దేశం మొత్తం అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.