6 Tirumalagiri Villages in Nalgonda: ఒకే పేరుతో రెండు, మూడు గ్రామాలు ఉండటం మన రాష్ట్రంలో కొత్త విషయం కాదు. కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం ఒకే పేరుతో ఏకంగా ఆరు ప్రాంతాలు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ పేరు మరేదో కాదు ‘తిరుమలగిరి’. ఈ పేరుతో మండల కొన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాలు ఉన్నాయి. భౌగోళికంగా వేర్వేరు చోట్ల ఉన్నప్పటికీ, ఈ ప్రాంతాలన్నింటినీ కలిపేది వాటి పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన. ఇంతకీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి పేరుతో ఒక మండలం ఉంది. ఈ మండలం చాలా కాలంగా పరిపాలనా కేంద్రంగా కొనసాగుతోంది. ఇదే జిల్లాలోని చివ్వెంల మండలంలో కూడా తిరుమలగిరి అనే గ్రామం ఉంది. ఒకే జిల్లాలోనే మండలం, గ్రామం రెండూ ఒకే పేరుతో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.
అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో కూడా తిరుమలగిరి అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి కూడా స్థానికంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. పేరు ఒకటే అయినా, ప్రాంతం, సంప్రదాయాలు, స్థానిక జీవనశైలి పరంగా ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది.
ఇక నల్లగొండ జిల్లాలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ తిరుమలగిరి (సాగర్) అనే మండల కేంద్రం ఉంది. అంతేకాదు, నార్కట్‌పల్లి మండలంలో ఒక తిరుమలగిరి గ్రామం, పీఏపల్లి మండలంలో మరో తిరుమలగిరి గ్రామం ఉన్నాయి. ఇలా నల్లగొండ జిల్లాలోనే మూడు ప్రాంతాలు తిరుమలగిరి పేరుతో ఉండటం ప్రత్యేకతగా నిలుస్తోంది. మొత్తం చూస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేటలో రెండు, యాదాద్రి భువనగిరిలో ఒకటి, నల్లగొండలో మూడు… కలిపి మొత్తం ఆరు ప్రాంతాలు ‘తిరుమలగిరి’ పేరుతో ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఒకే పేరు కొనసాగడం తెలంగాణలోనే అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.
Read Also: అందమైన నీలగిరి.. నల్లగొండగా ఎలా మారింది? చరిత్ర చెప్పే అసలు నిజం ఇదే!
‘తిరుమలగిరి’ అనే పేరుకు కూడా ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. ‘తిరుమల’ అంటే శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన పవిత్ర క్షేత్రం. ‘గిరి’ అంటే కొండ. ఈ రెండు పదాలు కలిసినప్పుడు పవిత్రమైన కొండ అనే భావన వస్తుంది. తిరుపతిలోని శ్రీవారి ఏడు కొండలను కూడా తిరుమలగిరులు అని పిలుస్తారు. అందుకే ఈ పేరు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారు. స్థానిక పెద్దలు చెప్పే కథనాల ప్రకారం, ఈ గ్రామాల్లో చాలా కాలం క్రితమే శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఆ స్వామివారి చుట్టూ గ్రామాలు అభివృద్ధి చెందడంతో వాటికి ‘తిరుమలగిరి’ అనే పేరు స్థిరపడిందని చెబుతుంటారు. కాలక్రమేణా పరిపాలనా విభజనలు జరిగినా, గ్రామాల పేర్లు మాత్రం అలాగే కొనసాగాయి.
Read Also: హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చి నీళ్ల కోసం క్యూ.. ఏంటీ.. ఈ నల్లగొండ బావి ప్రత్యేకత?
ఒకే పేరు వెనుక ఇంత చరిత్ర, ఇంత ఆధ్యాత్మిక నేపథ్యం ఉండటం నిజంగా విశేషం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు ప్రాంతాలు ఒకే ‘తిరుమలగిరి’ పేరుతో ఉండటం తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవడం సహజమే.
Read Also: నల్లగొండలో ఆర్జాలబావి.. ఈ పేరు వెనుక ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉందా?