Visakhapatnam Names: ‘పేరులో ఏముంది?’ అని షేక్ స్పియర్ (William Shakespeare) అన్న మాట విశాఖపట్నానికి అస్సలు వర్తించదు. ఎందుకంటే ఈ నగరంలోని ప్రతి పేరు వెనుక ఒక చరిత్ర, ఒక సంస్కృతి దాగి ఉన్నాయి. ఏకంగా ‘విశాఖపట్నం’ అనే పేరు వెనుకే బౌద్ధ మూలాల నుండి సముద్ర తీరాల వరకు ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే నగరానికే కాకుండా.. విశాఖలోని వివిధ ప్రాంతాల పేర్ల వెనుక కూడా అంతే ఆసక్తికరమైన నేపథ్యాలు దాగున్నాయి. నగరంలోని కొన్ని ప్రముఖ ప్రాంతాల పేర్లు ఎలా వచ్చాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
విశాఖపట్నంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో అసీల్‌మెట్ట ఒకటి. ఈ పేరు రెండు తెలుగు పదాల కలయిక నుండి పుట్టింది. ‘అసిల్’ అంటే పన్నులు అని, ‘మెట్ట’ అంటే కొండ అని అర్థం. చారిత్రక ఆధారాల ప్రకారం.. పూర్వ కాలంలో ఈ కొండ ప్రాంతాన్ని పన్నులు వసూలు చేయడానికి ఉపయోగించేవారు. కాలక్రమేణా పన్నులు వసూలు చేసే ఆ కొండ కాస్తా ‘అసీల్‌మెట్ట’గా రూపాంతరం చెందింది.
ప్రస్తుతం విశాఖలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆరిలోవ ప్రాంతానికి ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. నిజానికి ఈ ప్రాంతం అసలు పేరు ‘హరిలోవ’. ‘హరి’ అంటే శ్రీమహావిష్ణువు, ‘లోవ’ అంటే లోయ అని అర్థం. అంటే స్వామివారు కొలువుదీరిన లోయ అని దీని అర్థం. కాలక్రమేణా నోటి మాటల్లో నానుతూ ఈ హరిలోవ కాస్తా ‘ఆరిలోవ’గా మారి స్థిరపడిపోయింది.
విశాఖలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఇది తెలుగు పదమైన ‘గజ-వాగు’ (ఏనుగుల ప్రవహించే చిన్న ఏరు) నుండి వచ్చింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలోని చిన్న వాగుకు ఏనుగులు గుంపులుగా వచ్చి దాహం తీర్చుకునేవట. అలా ఏనుగులు వచ్చే వాగు కాస్తా కాలక్రమేణా రూపాంతరం చెంది ‘గాజువాక’గా స్థిరపడింది.
సముద్ర తీరానికి సమీపంలో ఉండే ఈ అప్పుఘర్ ప్రాంత పేరు ఒకప్పుడు వినోదానికి కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం ఇక్కడ మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఉన్న చోట గతంలో ఒక థీమ్ పార్క్ ఉండేదట. 1982 ఆసియా క్రీడల సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రసిద్ధ ‘అప్పుఘర్’ పార్క్ స్పూర్తితో దాని చిన్న ప్రతిరూపంగా దీనిని ఇక్కడ నిర్మించారు. (ఎమ్మెల్యే కాలనీలోని శివాజీ పార్క్ ముంబై పార్క్ స్ఫూర్తితో కట్టినట్లే ఇది కూడా కట్టారు). కాలక్రమేణా ఆ పార్క్ పోయినా ఆ ప్రాంతానికి మాత్రం ‘అప్పుఘర్’ అనే పేరే ఉండిపోయింది.
Also Read: ఏడు రంగుల కొండ.. ప్రకృతి సృష్టించిన అద్భుతం.. ఎలా ఏర్పడిందో తెలుసా?
విశాఖ నగరంలో బాగా వినిపించే ప్రాంతాల పేరుల్లో ‘వాల్తేరు’ ఒకటి. అయితే ఈ పేరు వెనుక బ్రిటిష్ వారి భాషా దోషం ఉంది. ప్రముఖ చరిత్రకారుడు విజ్జేశ్వరపు ఎడ్వర్డ్ పాల్ పరిశోధనల ప్రకారం.. ఈ ప్రాంతానికి స్థానికంగా ఉన్న ‘వాలుతేరు’ లేదా ‘వాలుతేరు గడ్డ’ (తుఫాను నీరు ప్రవహించే కాలువ) అనే పేరు నుండి వాల్తేరు వచ్చింది. ఇంగ్లీషులో దీనిని ‘Valteru’ అని రాయాల్సి ఉండగా బ్రిటిష్ పాలకులు తప్పుగా ‘Waltair’ అని రాశారు. ఆ తప్పుడు స్పెల్లింగే రెండు శతాబ్దాలుగా సాగుతూ ఇప్పటికీ వాల్తేరుగానే కొనసాగుతోంది.
Also Read: వీకెండ్ సరదా తెచ్చిన శాపం.. అమెరికాలో పారాచూట్ అదుపుతప్పి తెలుగు యువకుడు మృతి