Tuesday: మంగళవారం నాడు కొన్ని పనులు అసలు చేయకూడదట. తెలిసో తెలియకో ఆ పనులు చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందట. మరి మంగళవారం ఎలాంటి పనులు చేయాలో కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.
మంగళవారం నాడు సాధారణంగా ఆంజనేయ స్వామికి మరియు అంగారకుడికి (కుజుడికి) ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారట. జ్యోతిష్య శాస్త్రం మరియు పురాణాల ప్రకారం, మంగళవారం రోజున కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారట. అలాగే మంగళారం నాడు చేయాల్సిన పనులు కూడా పండితులు వివరిస్తున్నారు. ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళవారం చేయకూడని పనులు: మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం లేదా గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదని శాస్త్రం చెబుతోందట. ఇది ఆయుష్షుకు మరియు సంపదకు మంచిది కాదని నమ్ముతారట. మంగళవారం హనుమంతుని రోజు కాబట్టి, ఆ రోజు సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మంచిదట. మాంసాహారం మరియు మద్యం వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే మంగళవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదట, అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదట. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని, ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టమని పండితులు చెప్తున్నారు.
మంగళవారం నాడు కొత్త వ్యాపారాలు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం వంటివి చేయకూడదట. చేయాల్సిన పరిస్థితి వచ్చినా సరే వాయిదా వేసుకోవడం మంచిదట. ముఖ్యంగా భూమికి సంబంధించిన క్రయవిక్రయాలు లేదా గృహప్రవేశం వంటి పనులకు మంగళవారం కంటే ఇతర శుభ దినాలు ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు. కుజుడు క్రోధానికి (కోపం) కారకుడు. కాబట్టి ఈ రోజు అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండాలని అప్పుడే మనసును ప్రశాంతంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజున గోధుమ రంగుకు సంబంధించిన వస్తువులను ఇతరులకు దానం చేయడం మంచిది కాదని కొంత మంది జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మంగళవారం చేయవలసిన శుభకార్యాలు: మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయట. వీలైతే మంగళవారం రోజు ఉపవాసం ఉండటం, సాత్విక భోజనం చేయడం వల్ల శరీరంలో శక్తి ప్రవాహం మెరుగుపడుతుందని నమ్ముతారట. అలాగే పేదలకు అన్నదానం చేయడం లేదా గుడిలో స్వామివారికి సింధూరం సమర్పించడం చాలా శ్రేష్ఠమట.
అయితే ఇవి ప్రాచీన సంప్రదాయాలు మరియు నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయట. మీ వ్యక్తిగత జీవనశైలిని బట్టి, శ్రద్ధా భక్తులతో ఈ నియమాలను పాటించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.