2026 Nissan Elgrand Revealed: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ తన పాపులర్ లగ్జరీ మినీవ్యాన్ ఎల్గ్రాండ్‌ను సరికొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ మోడల్ ను పూర్తిగా అప్ డేట్ చేసి విడుదల చేసింది. కొత్త డిజైన్‌తో పాటు ఆధునిక సాంకేతికత, మెరుగైన హైబ్రిడ్ సిస్టమ్, విశాలమైన క్యాబిన్ తో ఈ మినీ వ్యాన్ ను రూపొందించింది. ప్రస్తుతం ఈ వాహనాలు జపాన్ లో అమ్మకానికి రెడీ అయ్యాయి.
ఈ కొత్త ఎల్గ్రాండ్ లో నిస్సాన్ థర్డ్ జెనరేషన్ ఈ-పవర్ హైబ్రిడ్ టెక్నాలజీను ఉపయోగించారు. ఈ వ్యవస్థతో ఫ్యూయల్ ఎఫీషియెన్స్ పెరగడంతో పాటు, డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ కూడా మరింత సాఫీగా కొనసాగనుంది. కారు నడుస్తున్న సమయంలో సౌండ్ చాలా తక్కువగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించారు. దీని వల్ల నగరాల్లోనే కాకుండా, దూర ప్రయాణాల్లో కూడా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
ఎల్గ్రాండ్‌కు జపాన్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మోడల్ ను మొదటిసారి 1997లో నిస్సాన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. అప్పట్లో లగ్జరీ ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్, ముఖ్యంగా వెనుక సీటు ప్రయాణికులకు కల్పించిన సౌకర్యం అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ ప్రయాణాలు, వ్యాపార అవసరాలు, వీఐపీ ట్రావెల్ కోసం చాలామంది దీనిని ఉపయోగించారు. 2010 తర్వాత ఎల్గ్రాండ్ కు ఎలాంటి పూర్తిస్థాయి కొత్త వెర్షన్‌ను నిస్సాన్ విడుదల చేయలేదు. ఫలితంగా ఈ మోడల్ మార్కెట్లో వెనుకబడింది. టయోటా విడుదల చేసిన ఆల్ఫార్డ్ లాంటి లగ్జరీ మినీ వ్యాన్లు మంచి అమ్మకాలు సాధించడంతో ఎల్గ్రాండ్ డిమాండ్ తగ్గింది. ఈ పరిస్థితిని మార్చేందుకు నిస్సాన్ ఇప్పుడు పూర్తిగా కొత్త ఎల్గ్రాండ్‌ను పరిచయం చేసింది.
ఈ కారులో డిజైన్ పరంగా పలు కీలక మార్పులు చేశారు. గత మోడల్ తో పోలిస్తే వాహనం ఎత్తు, వెడల్పును పెంచారు. దీంతో క్యాబిన్ లో ప్రయాణికులకు మరింత విశాలమైన స్థలం లభిస్తుంది. ముఖ్యంగా రెండో, మూడో వరుస సీట్లలో కూర్చునే వారికి ఎక్కువ లెగ్ రూమ్, హెడ్ రూమ్ అందేలా డిజైన్ చేశారు. సుదూర ప్రయాణాల్లో కూడా అలసట లేకుండా ప్రయాణించేందుకు అనుకూలంగా ఇంటీరియర్ ను అందించారు. కొత్త ఎల్గ్రాండ్‌లో పలు ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్‌తో పాటు మెరుగైన డ్రైవింగ్ పనితీరు, తక్కువ ఇంధన వినియోగం, మంచి ప్రయాణ సౌకర్యంపై నిస్సాన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రీమియం సెగ్మెంట్ కొనుగోలుదారులను ఆకర్షించేలా నాణ్యమైన మెటీరియల్స్ తో ఇంటీరియర్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ధర విషయానికి వస్తే, జపాన్‌లో ఈ కొత్త ఎల్గ్రాండ్ ప్రారంభ ధర 68,97,000 యెన్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.40 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మోడల్‌ను జపాన్ మార్కెట్‌లో మాత్రమే విడుదల చేశారు. ఇతర దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
Read Also: భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?