2027 Kawasaki KLE500 SE Smart Ride: కవాసకి తన అడ్వెంచర్ బైక్స్ లైనప్ ను మరింత విస్తరించింది. 2027 KLE500 శ్రేణిలో కొత్తగా KLE500 SE స్మార్ట్ రైడ్ వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్‌లో ప్రత్యేకమైన మెకానికల్ సెంట్రిఫ్యూగల్ క్లచ్ సిస్టమ్‌ను అందించారు. దీని వల్ల రైడర్లు బైక్‌ను ముందుకు కదిలించడానికి, ఆపడానికి క్లచ్ లివర్‌ను ప్రతిసారీ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దీంతో ట్రాఫిక్‌లో, తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు బైక్‌ను కంట్రోల్ చేయడం మరింత ఈజీ కానుంది.
కొత్త SE స్మార్ట్ రైడ్ రాకతో కవాసకి KLE500 శ్రేణిలో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో బేస్ KLE500, KLE500 SE, కొత్త KLE500 SE స్మార్ట్ రైడ్ ఉన్నాయి. కొత్త వేరియంట్‌లో క్లచ్ టెక్నాలజీతో పాటు ట్యూబ్‌లెస్ టైర్లను కూడా అందించారు. సాధారణ SE వేరియంట్‌లో ట్యూబ్-టైప్ టైర్లు ఉండగా, స్మార్ట్ రైడ్ మోడల్ లో ట్యూబ్‌లెస్ సెటప్‌ను ఉపయోగించారు. టైర్ పంక్చర్ అయినప్పుడు గాలి వేగంగా బయటకు వెళ్లే ప్రమాదాన్ని తగ్గించడంలో ట్యూబ్‌లెస్ టైర్లు ఉపయోగపడతాయి. ఈ రెండు వేరియంట్లలో ఇతర మెకానికల్ మార్పులు పెద్దగా లేవు.
KLE500 SE స్మార్ట్ రైడ్ లోని కీలక అంశం సెంట్రిఫ్యూగల్ క్లచ్. ఈ వ్యవస్థ బైక్ వేగం, ఇంజిన్ పనితీరుకు అనుగుణంగా పనిచేస్తుంది. దీంతో రైడర్ క్లచ్ లివర్ ను ఆపరేట్ చేయకుండానే బైక్ ను ప్రారంభించడం, ముందుకు కదిలించడం, ఆపడం చేయవచ్చు. అయితే, ప్రయాణంలో గేర్లు మార్చేటప్పుడు మాత్రం సాధారణంగానే క్లచ్ లివర్, గేర్ పెడల్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లచ్ ఆపరేషన్‌ను ఈజీ చేస్తూనే, సంప్రదాయ గేర్ మార్పుల అనుభూతిని కొనసాగించేలా ఈ సిస్టమ్‌ను రూపొందించారు. ఇది హోండా ఈ-క్లచ్ టెక్నాలజీకి భిన్నంగా పనిచేస్తుంది. హోండా వ్యవస్థ క్లచ్‌ను నియంత్రించడానికి ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్‌ను ఉపయోగిస్తే, కవాసకి స్మార్ట్ రైడ్ పూర్తిగా మెకానికల్ సెంట్రిఫ్యూగల్ క్లచ్‌పై ఆధారపడుతుంది.
ఈ కొత్త అడ్వెంచర్ బైక్‌లో 451cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అందించారు. ఇది 9,000rpm వద్ద 45hp పవర్, 6,000rpm వద్ద 42.6Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త క్లచ్ సిస్టమ్ మినహా ఇంజిన్ పనితీరులో మార్పులు లేవు. KLE500 SE స్మార్ట్ రైడ్ పెర్ల్ బ్లిజార్డ్ వైట్ అనే ఒకే కలర్ లో అందుబాటులో ఉంటుంది.
కవాసకి ఇండియా KLE500ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నప్పటికీ, అధికారిక లాంచ్ తేదీ, ధర ఇంకా వెల్లడించలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లోని ఈ మోడల్ భారత్‌కు CBU మార్గంలో దిగుమతి అయితే ధర ఎక్కువగా ఉండవచ్చు. భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఈ బైక్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో కొత్త పోటీని ఇవ్వనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750, నార్టన్ అట్లాస్ వంటి రాబోయే మోడళ్లతోనూ పోటీ పడే అవకాశం ఉంది.
Read Also: సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన బైక్‌లు ఇవే.. నంబర్ వన్ ఏదంటే?