Aprilia RS 660 Phillip Island Edition: ప్రముఖ ఇటాలియన్ బైక్ తయారీ సంస్థ ఏప్రిలియా తన RS 660 బైక్ స్పెషల్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. దీనికి RS 660 ఫిలిప్ ఐలాండ్ ట్రిబ్యూట్ ఎడిషన్ అని పేరు పెట్టింది. ఆస్ట్రేలియాలోని ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్ తో సంస్థకు ఉన్న రేసింగ్ అనుబంధాన్ని గుర్తుచేసుకునేలా ఈ బైక్‌ను రూపొందించారు. స్పెషల్ కలర్స్, రేసింగ్ గ్రాఫిక్స్, ఆకట్టుకునే డిజైన్ తో ఈ మోడల్‌ను తీసుకొచ్చారు. ఈ బైక్‌ను ఇటలీలోని మిలన్‌లో జరిగే EICMA 2026 ప్రదర్శనలో చూపించనున్నారు.
RS 660 ట్రిబ్యూట్ ఎడిషన్ లో వైట్ కలర్ ను ఉపయోగించారు. సైడ్ ప్యానెల్స్, వెనుక భాగంలో గ్రీన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. రెడ్ కలర్ వీల్ రిమ్స్ బైక్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. ఈ కలర్ మిక్సింగ్ ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్ లోగో నుంచి ప్రేరణ పొందింది. బైక్ సైడ్ ప్యానెల్స్ పై సర్క్యూట్ లే అవుట్, ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్ పేరుతో పాటు చెకర్డ్ ఫ్లాగ్ గ్రాఫిక్స్ ను ఏర్పాటు చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ పై ఈ సర్క్యూట్‌లో ఏప్రిలియా సక్సెస్ ను గుర్తుచేసే బ్యాడ్జ్ ఉంటుంది. స్టీరింగ్ హెడ్ ప్లేట్ పై బైక్ సీరియల్ నంబర్ ను కూడా యాడ్ చేశారు. వెనుక ప్యాసింజర్ సీటు స్థానంలో ప్రత్యేకమైన సీట్ కవర్ ను అందించారు.
ఈ స్పెషల్ ఎడిషన్ లో స్టాండర్డ్ ఏప్రిలియా RS 660లోని ఇంజిన్, మెకానికల్ సెటప్ నే కొనసాగించారు. ఇందులో 660cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 10,400rpm వద్ద 105bhp పవర్, 8,400rpm వద్ద 70Nm గరిష్ఠ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు ఆరు స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. అంటే, ఈ ఎడిషన్‌లో ప్రధాన మార్పులు డిజైన్, కలర్స్, స్పెషల్ గుర్తింపునకు సంబంధించినవే. ఇంజిన్ పనితీరులో ప్రత్యేక మార్పులు చేసినట్లు సంస్థ వెల్లడించలేదు.
ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్ ఏప్రిలియా రేసింగ్ ప్రయాణంలో కీలకమైన వేదికగా నిలిచింది. వరల్డ్ సూపర్ బైక్ ఛాంపియన్ షిప్‌లో RSV4తో సాధించిన విజయాలతో పాటు, వివిధ MotoGP ఛాంపియన్ షిప్ విభాగాల్లో ఈ సర్క్యూట్‌పై ఏప్రిలియా పది విజయాలను నమోదు చేసింది. గత ఏడాది ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీలో రౌల్ ఫెర్నాండెజ్ సాధించిన MotoGP విజయం సంస్థకు ప్రపంచ మోటార్ సైకిల్ ఛాంపియన్‌షిప్‌లో 300వ విన్నింగ్ మైల్ స్టోన్ గా నిలిచింది.
2026 సీజన్ తర్వాత MotoGP క్యాలెండర్ నుంచి ఫిలిప్ ఐలాండ్ సర్క్యూట్ తప్పుకోనున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక ఎడిషన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. 2027 నుంచి అడిలైడ్ స్ట్రీట్ సర్క్యూట్ ఈ ప్లేస్ ను ఫుల్ ఫిల్ చేయనుంది. అయితే, ఏప్రిలియా RS 660 ఫిలిప్ ఐలాండ్ ట్రిబ్యూట్ ఎడిషన్ ధర ఎంత? ఎన్ని బైక్‌లను తయారు చేస్తారు? ఏయే దేశాల్లో విక్రయిస్తారు? అనే వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
Read Also: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పడిపోదు.. భారత్‌లో కొత్త BMW మోడల్ కు పేటెంట్!