Omega-3 Supplements: జ్ఞాపకశక్తి పెరగాలని, వయసు పెరిగే కొద్ది వచ్చే మతిమరుపు లేదా అల్జీమర్స్ ముప్పును తప్పుంచుకోవాలని చాలామంది రోజూ ఒమేగా-3 లేదా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ మింగేస్తుంటారు. మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఒమేగా-3 అవసరమే కావొచ్చు.. అలాగని క్యాప్సూల్స్ వేసుకుంటే జ్ఞాపకశక్తి దానంతట అదే పెరిగిపోతుందనుకోవడం పొరపాటే అని కొత్త పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు వందేళ్ల వయసు రాకముందే అల్జీమర్స్ ముప్పున్న 55 నుంచి 80 ఏళ్ల వయసున్న 365 మందిపై రెండేళ్ల పాటు ఒక ప్రయోగం జరిపారు. వీరికి రోజూ 2000 మి గ్రాముల డీహెచ్ఏ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్) లేదా ప్లేసిబో ఇచ్చారు. సప్లిమెంట్ తీసుకున్న వారి మెదడు చుట్టూ ఉన్న ద్రవాల్లో డీహెచ్ఏ స్థాయిలు పెరిగినప్పటికీ, జ్ఞాపకశక్తిలో గానీ, ఆలోచనా శక్తిలో గానీ ఎలాంటి పెద్ద మార్పు రాలేదని తేలింది. అంటే పోషకం అందినప్పటికీ మెదడు పనితీరులో ఆశించిన ప్రయోజనం కనిపించలేదు.
Also Read: పైకి ఆరోగ్యంగా ఉన్నట్లున్నా.. మీ ఎముకలను లోలోపలే తినేస్తున్న చెడు అలవాట్లు ఇవే!
మెదడు అనేది కేవలం ఒక్క కాంపోనెంట్‌తో నడిచే యంత్రం కాదు. మన జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి మెరుగుపడాలంటే రక్తనాళాల ఆరోగ్యం, జీవక్రియ, ప్రశాంతమైన నిద్ర, శారీరక శ్రమ అన్నీ సరిగ్గా ఉండాలి. ఒమేగా-3 వల్ల శరీరానికి మంచి జరుగుతుంది కదా అని దాన్ని కేవలం జ్ఞాపకశక్తిని పెంచే మ్యాజిక్ మందులా చూడకూడదు. చేపలు, వాల్‌నట్స్, అవిసె గింజలు వంటి సహజ ఆహారాల ద్వారా దీన్ని పొందడం మంచిది కానీ, కేవలం మాత్రలపై ఆధారపడటం వల్ల ప్రయోజనం ఉండదు.
ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా అని అందరూ వీటిని వాడేయకూడదు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో ఉబ్బరం, గుండెల్లో మంట, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తం పల్చబడే మందులు వాడేవారైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏ మందులు వాడాలన్నా సొంత నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ల సలహా తీసుకోవడమే ఉత్తమం.
ఎవరికైనా మతిమరుపు వస్తుందంటే దాన్ని కేవలం వయసు అయిపోతుందని లైట్ తీసుకోకూడదు. ఒత్తిడి, నిద్రలేమి, ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గవచ్చు. అందుకే ఒమేగా-3 మాత్రల చుట్టూ తిరగడం మానేసి మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి అసలు కారణం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: టమాటాలను ఉప్పునీటితో కడితే పురుగుమందులు పోతాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..