Manual vs Automatic Cars: కారు కొనేటప్పుడు చాలామందికి మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఏది తీసుకోవడం మంచిది? అని ఆలోచిస్తుంటారు. డ్రైవింగ్ మీద కంప్లీట్ కంట్రోల్ కావాలనుకునే వారు మాన్యువల్ కార్లను ఇష్టపడతారు. అయితే వేగం, ఈజీ డ్రైవింగ్ విషయంలో మాత్రం ఆటోమేటిక్ కార్లకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది.
మాన్యువల్ కారులో డ్రైవర్ స్వయంగా గేర్ మార్చాలి. గేర్ మార్చే సమయంలో క్లచ్, యాక్సిలరేటర్ ను సరిగ్గా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఏ చిన్న పొరపాటు జరిగినా కారు వేగం తగ్గే అవకాశం ఉంది. ఆటోమేటిక్ కార్లలో ఈ పని మొత్తం గేర్ బాక్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ చూసుకుంటాయి. డ్రైవర్ గ్యాస్ పెడల్ పై ఫోకస్ పెట్టి కారు వేగాన్ని పెంచుకోవచ్చు. గేర్లు మారే సమయంలో పవర్ డెలివరీలో ఇబ్బంది తక్కువగా ఉండటంతో స్పీడ్ యాక్సిలరేషన్ ఉంటుంది.
అయితే, మాన్యువల్ కారు ఎప్పుడూ ఆటోమేటిక్ కంటే నెమ్మదిగా ఉంటుందని చెప్పలేం. ఎక్స్ పీరియెన్స్ ఉన్న డ్రైవర్ సరైన సమయంలో గేర్ మార్చితే మంచి పనితీరు చూపిస్తుంది. కానీ, ఆధునిక ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లు చాలా వేగంగా గేర్లు మార్చగలగడంతో వాటికి కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది.
మాన్యువల్ కార్లు వేగంగా ఉండవనే అభిప్రాయానికి హెన్నెస్సీ వెనమ్ F5-M మంచి ఎగ్జాంపుల్. ఇది సాధారణ స్పోర్ట్స్ కారు కాదు.. ఏకంగా మాన్యువల్ హైపర్ కార్. ఈ కారులో 2,031 హార్స్ పవర్ ఉత్పత్తి చేసే Fury V8 ఇంజిన్ ఉంటుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 285.6 మైళ్లు. హెన్నెస్సీ ఈ కారును కేవలం వేగం కోసం కాకుండా డ్రైవర్‌కు ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో రూపొందించింది. అయితే, ఈ హైపర్‌కార్ చాలా పరిమిత సంఖ్యలోనే అందుబాటులోకి వచ్చింది. మొత్తం 12 Venom F5-M Roadster కార్లను మాత్రమే తయారు చేశారు. ఒక్కో కారు ధర సుమారు 2.65 మిలియన్ డాలర్లు, ఇండియన్ కరెన్సీలో ఏకంగా రూ. 25 కోట్లకు పైమాటే.
రేసింగ్ లో మాన్యువల్, ఆటోమేటిక్ లో ఏది బెస్ట్ అని చెప్పడం అంత సులభం కాదు. రేసింగ్ రకాన్ని బట్టి గేర్ బాక్స్ మారుతుంది. డ్రాగ్ రేసింగ్‌లో వేగంగా యాక్సిలరేట్ చేయడం ప్రధాన లక్ష్యం కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌కు ప్రాధాన్యత ఉంటుంది. మరోవైపు ఆటోక్రాస్ లాంటి రేసుల్లో డ్రైవర్‌కు కారు నియంత్రణపై ఎక్కువ పట్టు అవసరం కాబట్టి మాన్యువల్‌కు ఇంపార్టెన్స్ ఇస్తారు.
ఫార్ములా 1లో మాత్రం సెమీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ లను ఉపయోగిస్తారు. డ్రైవర్ స్టీరింగ్ వీల్ పై ఉన్న ప్యాడిల్స్ ద్వారా గేర్లు మారుస్తాడు. ఈ వ్యవస్థ కారణంగా గేర్ మార్పు అత్యంత వేగంగా జరుగుతుంది. అందుకే సాధారణ డ్రైవింగ్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ ఎంపిక వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉన్నా.. గరిష్ట వేగం, వేగవంతమైన యాక్సిలరేషన్ విషయంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ముందున్నాయి.
Read Also: ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!