Denza D9 India Launch: భారత లగ్జరీ కార్ల మార్కెట్లోకి మరో కొత్త బ్రాండ్ అడుగుపెట్టబోతోంది. చైనాకు చెందిన BYD సంస్థ తన ప్రీమియం బ్రాండ్ డెంజాను నవంబర్ 13న భారత్ లో అధికారికంగా పరిచయం చేయనుంది. ఈ సందర్భంగా దేశంలో తన ఉత్పత్తులు, అమ్మకాలు, రిటైల్ వ్యూహాన్ని కూడా వెల్లడించనుంది. డెంజా నుంచి భారత మార్కెట్లోకి తొలుత D9 లగ్జరీ MPV వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత Z9 GT ఎలక్ట్రిక్ ఫాస్ట్ బ్యాక్ ను కూడా తీసుకురావచ్చని తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లు ప్రధానంగా ప్రీమియం కార్ల కొనుగోలుదారులను, టైర్-1, టైర్-2 నగరాల్లోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకోనున్నాయి.
డెంజా D9 లగ్జరీ ఎలక్ట్రిక్ MPVగా మార్కెట్ కు పరిచయం కానుంది. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, అధికారిక ధరలను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. మార్కెట్లోకి వస్తే ఈ మోడల్ MG M9, టయోటా వెల్ ఫైర్, లెక్సస్ LM, కియా కార్నివాల్ లాంటి ప్రీమియం MPVలకు పోటీ ఇవ్వనుంది. D9 పొడవు 5,250mm, వెడల్పు 1,960mm, ఎత్తు 1,920mmగా ఉంది. దీని వీల్‌బేస్ 3,110mm. లగేజీ కోసం సాధారణంగా 410 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. వెనుక సీట్లను మడిచినప్పుడు ఈ సామర్థ్యాన్ని 2,310 లీటర్ల వరకు పెంచుకోవచ్చు.
డెంజా D9లో 103.36kWh బ్యాటరీ ప్యాక్, ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి. ఇవి గరిష్ఠంగా 308hp పవర్, 360Nm టార్క్‌ను అందిస్తాయి. ఈ MPV గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో అందుకుంటుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ తో 600 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.
D9తో పాటు Z9 GT కూడా భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఫాస్ట్ బ్యాక్ లో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు, 122.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. గరిష్ఠంగా 1,156hp పవర్, 1,210Nm టార్క్ ను అందిస్తుందని వెల్లడించారు. ఇది కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుందని తెలుస్తోంది. గరిష్ఠ వేగం ఎలక్ట్రానిక్ పరిమితితో 270kmphగా ఉంటుంది. 21 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రేమ్ లెస్ విండోలు, యాక్టివ్ రియర్ వీల్ స్టీరింగ్, సెల్ఫ్ పార్కింగ్, డ్యూయల్ ఛాంబర్ ఎయిర్ సస్పెన్షన్ లాంటి ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
డెంజాను 2010లో BYD, మెర్సిడెస్ బెంజ్ భాగస్వామ్యంతో ప్రారంభించాయి. 2024లో BYD, డెంజాలో మెర్సిడెస్ వాటాను పూర్తిగా కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనాలను విక్రయిస్తోంది. భారత్‌లో డెంజా ఎంట్రీతో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also: మారుతి విక్టోరిస్ ఆరం ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ రూ.22,990కే కొత్త యాక్సెసరీస్ కిట్!