Honda 0 Alpha EV Launch: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు హోండా సిద్ధమవుతోంది. ఈ జపనీస్ కార్ల తయారీ సంస్థ తొలి పూర్తి ఎలక్ట్రిక్ వాహనంగా హోండా 0 ఆల్ఫా SUVని తీసుకురానుంది. ప్రొడక్షన్ వెర్షన్ ను డిసెంబర్ 2న భారత్ లో ఆవిష్కరించనుంది. ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ ఎలక్ట్రిక్ SUVపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. బ్యాటరీ ఆప్షన్లు, ప్రత్యేకమైన డిజైన్, అదిరిపోయే క్యాబిన్ తో ఈ కారు మార్కెట్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.
హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్ ను తొలిసారిగా 2025 అక్టోబర్లో పరిచయం చేసింది. ఇప్పుడు దీని ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ ను ఇండియన్ మార్కెట్కు తీసుకురావడానికి కంపెనీ రెడీ అవుతోంది. ఈ SUVకి సంబంధించిన ఫైనల్ పేరును నవంబర్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల భారీ క్యామోఫ్లేజ్ తో ఉన్న టెస్ట్ వెహికల్ భారత రోడ్లపై కనిపించింది. దీంతో ప్రొడక్షన్ మోడల్ డిజైన్, ఇంటీరియర్ కు సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈ కారు దేశంలో హోండా తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనంగా నిలవనుంది.
హోండా 0 ఆల్ఫా SUVకి సంబంధించి పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండనున్నట్లు కంపెనీ కన్ఫార్మ్ చేసింది. ఇవి LFP బ్యాటరీ కెమిస్ట్రీతో వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 65kWh నుంచి 75kWh మధ్య ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో ఈ SUV సింగిల్ మోటార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) సెటప్తో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అయితే, దీని పవర్ అవుట్ పుట్, డ్రైవింగ్ రేంజ్, ఛార్జింగ్ టైమ్ వంటి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
హోండా 0 ఆల్ఫా డిజైన్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హోండా కార్లకు భిన్నంగా కనిపిస్తోంది. నిటారుగా ఉండే వెనుక భాగం, బలమైన C పిల్లర్, పెద్ద రియర్ విండ్ స్క్రీన్ దీని ప్రత్యేకతలు. వెనుక బంపర్ కింద డిఫ్యూజర్ తరహా డిజైన్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ముందు భాగంలో ఇల్యూమినేటెడ్ హోండా లోగో, ఛార్జింగ్ పోర్ట్ ఉండే అవకాశం ఉంది. కాన్సెప్ట్ మోడల్ లో చూపించిన ప్రత్యేకమైన ఆకారాన్ని ప్రొడక్షన్ వెర్షన్ లోనూ ఉంటుందని స్పై షాట్స్ సూచిస్తున్నాయి.
ఈ SUV క్యాబిన్లో పెద్ద సెంట్రల్ టచ్స్క్రీన్, దాని పక్కన చిన్న డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ప్యాడిల్ షిఫ్టర్లు, క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫంక్షన్ల కోసం ఫిజికల్ బటన్లు కూడా కనిపించాయి.
హోండా 0 ఆల్ఫా SUVని రాజస్థాన్లోని తపుకారా ప్లాంట్లో తయారు చేసే అవకాశం ఉంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా సియెర్రా EV, మారుతి ఇ-విటారా, టయోటా ఎబెల్లా వంటి ఎలక్ట్రిక్ SUVలకు పోటీ ఇవ్వనుంది. అయితే, దీని ధర, పూర్తి బ్యాటరీ స్పెసిఫికేషన్లు, డ్రైవింగ్ రేంజ్ వెల్లడైన తర్వాతే ఈ SUV పోటీపై మరింత స్పష్టత వస్తుంది.
Read Also: కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్ ఎక్స్ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!