Hyundai Creta Sales Record: భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVల్లో హ్యుందాయ్ క్రెటా ఒకటి. స్టైలిష్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ మోడల్ మరో కీలక మైలురాయిని అందుకుంది. 2015లో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్.. తాజాగా 15 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటింది. సెప్టెంబర్ 2026 చివరి నాటికి మొత్తం 15,12,036 యూనిట్ల హోల్ సేల్ సేల్స్ నమోదయ్యాయి. మరోవైపు, క్రెటా ఎగుమతులు కూడా 3 లక్షల యూనిట్ల మార్కుకు చేరువలో ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా 2015 జూలైలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి SUV సెగ్మెంట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో క్రెటా వాటా సుమారు 15 శాతంగా ఉంది. కంపెనీ అమ్మిన యుటిలిటీ వెహికల్స్ లో ఈ మోడల్ వాటా 55 శాతంగా ఉండటం విశేషం. క్రెటా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కంపెనీ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తీసుకురావడం కూడా ఈ SUV సక్సెస్ కు ఓ కారణంగా చెప్పవచ్చు.
ఆర్థిక సంవత్సరం 2026లో క్రెటా అదిరిపోయే అమ్మకాలు సాధించింది. ఈ కాలంలో మొత్తం 2,01,921 యూనిట్ల హోల్‌సేల్ సేల్స్ జరిగాయి. FY2025లో నమోదైన 1,94,871 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 4 శాతం పెరిగాయి. FY2024లో 1,62,773 యూనిట్లు అమ్ముడవగా, FY2025లో ఈ సంఖ్య 1,94,871కు చేరింది. వరుసగా కొన్ని సంవత్సరాలుగా అమ్మకాల్లో వృద్ధి సాధించడం క్రెటాకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎలాంటిదో వెల్లడిస్తోంది. అయితే FY2027 మొదటి ఆరు నెలల్లో క్రెటా, క్రెటా ఎలక్ట్రిక్ కలిపి 89,727 యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న 99,345 యూనిట్లతో పోలిస్తే సుమారు 10 శాతం తక్కువ.
దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ క్రెటాకు మంచి గుర్తింపు ఉంది. ఆగస్టు 2026 నాటికి ఈ SUV మొత్తం ఎగుమతులు 2,95,994 యూనిట్లకు చేరుకున్నాయి. త్వరలోనే 3 లక్షల ఎగుమతుల మైలురాయిని దాటే అవకాశం ఉంది.
హ్యుందాయ్ క్రెటా పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 115hp పవర్ ఇచ్చే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 160hp 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 116hp 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. మొత్తం 27 వేరియంట్లు, నాలుగు గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ARAI సర్టిఫైడ్ మైలేజ్ లీటరుకు 17.4 నుంచి 21.8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని ధరలు రూ.10.91 లక్షల నుంచి రూ.20.14 లక్షల వరకు ఉన్నాయి.
Read Also: మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?