Top 5 Cars Sold in India in August 2026: భారత కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి నెలా కొత్త మోడళ్లు వస్తున్నా.. కొన్ని కార్లకు మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆగస్టు 2026లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వెల్లడయ్యింది. ఈ లిస్ట్ లో మారుతి సుజుకి కార్లు ఎక్కువగా కనిపించినప్పటికీ.. మొదటి స్థానాన్ని మాత్రం టాటా దక్కించుకుంది.
ఆగస్టు నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ నిలిచింది. ఈ నెలలో ఏకంగా 21,320 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలైలో 21,313 యూనిట్లు అమ్ముడవగా.. నెలవారీ అమ్మకాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. అయితే, గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే పంచ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. 2025 ఆగస్టులో 10,704 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలో అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. రూ.6.73 లక్షల నుంచి రూ.12.58 లక్షల ధరలో లభించే పంచ్.. మంచి డిజైన్, ఫీచర్లు, బలమైన నిర్మాణంతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
ఆగస్టు అమ్మకాల జాబితాలో రెండో స్థానాన్ని మారుతి వాగన్ఆర్ దక్కించుకుంది. గత నెలలో 20,180 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలైలో 23,398 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు తగ్గాయి. అయితే, 2025 ఆగస్టులో 14,552 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. తక్కువ ధర, మంచి మైలేజ్ కారణంగా ఈ కారు ఇప్పటికీ భారతీయ కుటుంబాల్లో మంచి ఆదరణ పొందుతోంది.
మూడో స్థానంలో ఎప్పటి నుంచో పాపులర్ గా ఉన్న మారుతి స్విఫ్ట్ నిలిచింది. ఆగస్టులో 19,832 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలైలో 21,538 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు కొంత తగ్గాయి. అయితే, గత ఏడాది ఆగస్టులో 12,385 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో ఏడాది ప్రాతిపదికన స్విఫ్ట్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. రూ.6.83 లక్షల నుంచి రూ.10.33 లక్షల ధరలో లభించే ఈ హ్యాచ్ బ్యాక్ కు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది.
నాలుగో స్థానంలో మారుతి ఫ్రాంక్స్ ఉంది. ఆగస్టులో 18,730 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలైలో 19,473 యూనిట్లతో పోలిస్తే స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. కానీ, గత ఏడాది ఆగస్టులో 12,422 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏడాది వ్యవధిలో దాదాపు 6,000 యూనిట్ల వృద్ధిని సాధించింది. రూ.7.98 లక్షల నుంచి రూ.13.89 లక్షల ధరలో లభించే ఫ్రాంక్స్.. సరసమైన ధరలో SUV తరహా డిజైన్ కోరుకునేవారికి మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.
టాప్-5లో చివరి స్థానాన్ని మారుతి ఎర్టిగా దక్కించుకుంది. ఆగస్టులో 18,516 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలైలో 21,606 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు తగ్గాయి. అయినప్పటికీ గత ఏడాది ఆగస్టులో 18,445 యూనిట్లు అమ్ముడయ్యాయి. రూ.10.34 లక్షల నుంచి రూ.15.38 లక్షల ధరలో లభించే ఎర్టిగా.. సరసమైన ధరలో ఏడు సీట్ల కారు కోరుకునేవారికి ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్ గా కొనసాగుతోంది.
Read Also: టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!