Kawasaki Z300 Launched: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో Z300 స్పోర్ట్ నేకెడ్ బైక్ ను రూ.3.24 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఈ బైక్‌ను నింజా 300 ప్లాట్ ఫామ్ ఆధారంగా రూపొందించారు. అయితే, నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ డిజైన్‌తో పాటు పవర్ ఫుల్ ఇంజన్, ఆకట్టుకునే లుక్‌తో దీన్ని తీసుకొచ్చారు. కవాసకి Z లైనప్ లో ఇది ఎంట్రీ లెవల్ మోడల్ గా నిలువనుంది.
కవాసకి Z300 డిజైన్ లో కంపెనీకి చెందిన పెద్ద బైక్ Z900 ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. ఇందులో ‘సుగోమి’ స్టైలింగ్ ను ఉపయోగించారు. విశాలమైన సింగిల్ పీస్ హ్యాండిల్ బార్, స్పోర్టీ బాడీవర్క్, నిటారుగా కూర్చునేలా ఉండే రైడింగ్ పొజిషన్ ఈ బైక్ ప్రత్యేకతలు. స్పోర్టీ లుక్ తో పాటు రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా ఎర్గోనామిక్స్ ను రూపొందించారు. ఈ మోటార్ సైకిల్ క్యాండీ లైమ్ గ్రీన్, మెటాలిక్ కార్బన్ గ్రే అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
Z300లో 296cc లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ను అమర్చారు. ఇదే ఇంజన్ నింజా 300లోనూ ఉంది. అయితే, Z300లో ఇది 11,000rpm దగ్గర 40hp పవర్, 10,000rpm దగ్గర 26.3Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ ను జత చేశారు. ట్విన్ సిలిండర్ ఇంజన్ కావడంతో రైడింగ్ సమయంలో సున్నితమైన పనితీరును కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.
ఈ బైక్ లో రివర్స్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఛానల్ ABS లాంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ అందుబాటులో లేదు. Z300 బరువు 175 కిలోలు. నింజా 300తో పోలిస్తే ఇది 4 కిలోలు తక్కువ. నేకెడ్ బాడీవర్క్ కారణంగా బరువు తగ్గింది. ఇందులో నింజా 300లో ఉన్న ట్యూబులర్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ముందు భాగంలో 37mm టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి.
Z300లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. ముందు 110 సెక్షన్, వెనుక 140 సెక్షన్ టైర్లు ఉంటాయి. బ్రేకింగ్ కోసం ముందు 290mm పెటల్ డిస్క్, వెనుక 220mm పెటల్ డిస్క్ ను అందించారు.
భారత మార్కెట్లో కవాసకి Z300కు KTM 390 డ్యూక్, TVS అపాచీ RTR 310 వంటి బైక్‌లు పోటీగా నిలుస్తాయి. ఈ మోడళ్లలో సింగిల్ సిలిండర్ ఇంజన్లు ఉండగా, Z300లో ట్విన్ సిలిండర్ ఇంజన్ ప్రత్యేకతగా నిలుస్తుంది. ధర విషయంలో పోటీ బైక్‌ల కంటే ఖరీదైనదైనా? కవాసకి బ్రాండ్, ఇంజన్ పనితీరు, స్పోర్టీ డిజైన్ కారణంగా ఈ బైక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.
Read Also: హోండా To జావా.. 5 అదిరిపోయే పిలియన్ సీటు బైక్ లు ఇవే!