Hosur Crime: తమిళనాడులోని హోసూరు సమీపంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మాట్లాడుకుందామని పిలిచి ఓ యువకుడు తన ప్రియురాలిని కంటైనర్ గదిలోకి తీసుకెళ్లి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ వెంటనే తాను కూడా లారీ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలు ఏం జరిగిందంటే..?
కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరి మధ్య ఇటీవల కొన్ని తీవ్రమైన మనస్పర్థలు తలెత్తాయి. వాటి గురించి ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకుందామని చెప్పి, ధవిజా శ్రీ (20)ని ప్రదీప్ ( 25) ఒక కంటైనర్ గదకి పిలిపించాడు. అయితే, మాటల మధ్యలో ఇద్దరి మధ్యా మళ్లీ ఘర్షణ తీవ్రం కావడంతో ప్రదీప్ ఆవేశంతో ఊగిపోయాడు. వెంటనే ఆమెపై దాడి చేసి దారుణంగా గొంతు కోసి ప్రాణాలు తీశాడు.
లారీ కింద పడిన ప్రియుడు..
ప్రియురాలు రక్తం మడుగులో పడివుండటం చూసి తీవ్ర భయాందోళనకు గురైన ప్రదీప్, అక్కడి నుంచి బయటకు పరుగులు తీశాడు. ఏం చేయాలో తెలియక వేగంగా వస్తున్న ఒక లారీ కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
కేసు నమోదు..
సమాచారం అందుకున్న బాగలూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణం వెనుక ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కేటీఆర్.. ఆ సుద్దపూస మాటలు బంద్ చేయ్! మీ తప్పులు ప్రజలకు తెలుసు: ఎంపీ చామల