MG Astor discontinued in India: భారత మార్కెట్లో మిడ్‌సైజ్ SUV విభాగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో MG మోటార్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన ఆస్టర్ SUV ఉత్పత్తిని నిలిపివేసినట్లు డీలర్లు వెల్లడించారు. అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే, ఈ సెగ్మెంట్ ను పూర్తిగా వదిలేయకుండా ఆస్టర్ స్థానంలో మరో కొత్త SUVని తీసుకొచ్చేందుకు MG సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
MG ఆస్టర్ 2021లో భారత మార్కెట్లోకి వచ్చింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్ వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ లాంటి ప్రముఖ SUVలకు పోటీగా కంపెనీ ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. ఆకట్టుకునే డిజైన్, ఆధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ, ఆస్టర్ కస్టమర్లను పెద్ద సంఖ్యలో ఆకట్టుకోలేకపోయింది. అమ్మకాల లెక్కలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఈ SUV నెలకు సగటున 112 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మార్కెట్లో ఇతర మోడళ్లకు ఉన్న డిమాండ్‌తో పోలిస్తే చాలా తక్కువ. దీంతో ఆస్టర్ ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆస్టర్ అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు తక్కువగా ఉండటం. ఈ SUV మొదట రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండేది. ఇందులో 110hp పవర్ ఇచ్చే 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 140hp పవర్ అందించే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండేవి. అయితే, టర్బో ఇంజన్‌ను ఫిబ్రవరి 2025లో నిలిపివేశారు. దీంతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో మిగిలింది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక పోటీ మోడళ్లు వివిధ ఇంజన్, పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో రావడం కూడా ఆస్టర్ కు ప్రతికూలంగా మారింది. మరోవైపు, ఆస్టర్ కు ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయంగా MG ZS EV ఉన్నప్పటికీ, దాని ధర ఎక్కువగా ఉండటం కొంతమంది కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా మారింది.
MG ఆస్టర్ ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ, మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్ నుంచి కంపెనీ పూర్తిగా తప్పుకోవడం లేదు. ఆస్టర్ స్థానంలో మరో కొత్త SUVని తీసుకొచ్చేందుకు MG ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త మోడల్ SAIC సంస్థకు చెందిన సిగ్మా ప్లాట్‌ఫామ్‌పై రూపొందే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లను అభివృద్ధి చేయవచ్చు. దీంతో కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లు అందించే అవకాశం ఉంటుంది.
Read Also: హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!