3D Printing: సాధారణంగా ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఎక్కువ సమయం, డబ్బు, ఓపిక అవసరం. పైగా మెదడులో పుట్టిన అనూహ్య ఐడియాకు కస్టమర్లు దొరుకుతారనే గ్యారెంటీ ఉండదు. కానీ నాణ్యమైన ఉత్పత్తి, సోషల్ మీడియా క్రేజ్ ను ఉపయోగించుకుంటే.. ఊహకందని ఫలితాలను సాధించవచ్చని ఓ టీనేజర్ నిరూపించాడు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల మైక్ సట్టర్లీ (Mike Satterlee) అనే కుర్రాడు ఈ విషయాన్ని నిజం చేసి చూపించాడు. తన 3D-ప్రింటింగ్ వ్యాపారంతో ఏకంగా రూ. కోట్లల్లో ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
మైక్ సట్టర్లీ నిర్వహిస్తున్న ‘క్రూయిజ్కప్’ (CruiseCup) సంస్థ.. 3D ప్రింటర్ల ద్వారా తయారు చేసిన ‘హార్డ్-షెల్ ఇన్సులేటెడ్ కెన్ కూలర్లు’ (Hard-shell insulated can coolers)ను విక్రయిస్తోంది. ఒక డ్రై పెప్పర్ క్యాన్‌తో కూడిన డ్రింక్ తాగుతూ.. ఆ కూలర్ లోకి మరో కొత్త క్యాన్‌ను ఆటోమేటిక్‌గా మార్చే వీడియోను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఏకంగా 5 కోట్ల మందికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.
Tactical cruise cup.
The airports gonna love him. https://t.co/Y4MYGzDwyq
— aka (@akafaceUS) May 1, 2026
సట్టర్లీకి వ్యాపారంపై ఆసక్తి ఈనాటిది కాదు. అతను కేవలం 13 ఏళ్ల వయసులోనే ఇసుక అంటుకోకుండా ఉండే లోషన్‌ను తయారు చేసి విక్రయించేవాడు. అలా చిన్నప్పుడే వ్యాపార మెళకువలను ఒడిసిపట్టాడు. ఆ తర్వాత కాలంలో షూ యాక్సెస్సరీస్, కార్ కప్ హోల్డర్స్ వంటి విభిన్న ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. ఈ ప్రయాణంలో భాగంగానే కస్టమర్లను ఆకట్టుకునే సరికొత్త ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే సాధారణ డ్రింక్ హోల్డర్లకు భిన్నంగా ఒక సరికొత్త ఆలోచన చేశాడు. ఖాళీ అయిన క్యాన్ స్థానంలో మరో కొత్త క్యాన్ సులభంగా వచ్చి కూర్చునేలా ఒక ప్రత్యేకమైన మెకానిజంతో కూడిన హార్డ్-షెల్ డిజైన్‌ను రూపొందించాడు. ఈ వినూత్న ఫీచరే ఆయన బిజినెస్‌ను అమాంతం పైకి లేపింది.
ఈ ప్రొడక్ట్‌ను షార్ట్ వీడియో రూపంలో చూపించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మందికి ఇది పరిచయమైంది. దీంతో ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగిపోయాయి. క్రూయిజ్కప్ సంస్థ 2025లో సుమారు రూ.7.14 కోట్ల (8,08,000 డాలర్లు) రెవెన్యూను సాధించింది. అలాగే 2026 సెప్టెంబర్ నాటికి దాదాపు రూ.5.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించిన అమ్మకాలు ఎక్కువగా వెబ్సైట్, టిక్‌టాక్ షాప్ ద్వారానే జరుగుతున్నాయి. అమెజాన్ కూడా కొంతమేర సహకరిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాపారానికి రోజువారీగా ఏకంగా 400 నుంచి 700 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. ఇంత భారీ డిమాండ్‌ను తట్టుకుంటూనే ప్రొడక్షన్, ప్రమోషన్స్ అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు మైక్.
ఈ బిజినెస్‌ను విజయవంతంగా నడిపించడానికి మైక్ వారానికి ఏకంగా 80 నుంచి 85 గంటలు కష్టపడుతున్నాడు. ఇంత కష్టపడుతున్నప్పటికీ తనకు మాత్రం పని మీద ఏమాత్రం విసుగులేదని ప్రతిరోజూ ఉదయం ఎంతో ఉత్సాహంగా పనికి వెళ్తానని చెబుతున్నాడు. ‘ఇది నాకు ఎప్పుడూ పనిలా అనిపించదు. నేను చేసే పనిని ఎంతగానో ప్రేమిస్తున్నాను’ అని సంతోషంగా చెబుతున్నాడు. కాగా, ఒక చిన్న బేస్మెంట్లో మొదలైన ఈ వ్యాపారంయ.. నేడు ఏకంగా 160కి పైగా 3D ప్రింటర్లతో కూడిన పెద్ద యూనిట్‌గా ఎదిగింది. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు వచ్చే లాభాలన్నింటినీ కొత్త ప్రింటర్ల కొనుగోలుకు, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ల కోసం మైక్ ఉపయోగిస్తున్నాడు.
Also Read: ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!
కంపెనీకి కోట్లల్లో టర్నోవర్ వస్తున్నప్పటికీ.. మైక్ సట్టర్లీ తన స్వంత ఖర్చుల కోసం నెలకు కేవలం రూ.47,000 నుంచి రూ.1.4 లక్షల వరకు మాత్రమే తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతను తన తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. అద్దె వంటి పెద్ద ఖర్చులు లేకపోవడంతో తన వ్యక్తిగత ఖర్చులను చాలా వరకు తగ్గించుకుని, మిగిలిన డబ్బునంతా వ్యాపార అభివృద్ధికే రీ-ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మైక్ సట్టర్లీ పేర్కొన్నారు.