Hero Xtreme 160R 4V: హీరో మోటోకార్ప్ స్పోర్టీ బైక్ ఎక్స్ ట్రీమ్ 160R 4Vని అదిరిపోయే అప్డేట్స్ తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త డిజైన్, మెరుగైన ఇంజిన్ పవర్, క్రూయిజ్ కంట్రోల్, TFT డిస్ ప్లే లాంటి ఫీచర్లతో ఈ బైక్ ను అప్డేట్ చేసింది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ ప్రారంభ ధర రూ.1.27 లక్షలుగా ఉంది. బజాజ్ పల్సర్ NS160, టీవీఎస్ అపాచీ RTR 160లకు పోటీగా హీరో ఈ బైక్‌ను మరింత అట్రాక్టివ్ గా మార్చింది.
కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 160R 4Vని స్టాండర్డ్, ప్రో, కార్బన్ అనే మూడు వేరియంట్లలో అందిస్తున్నారు. స్టాండర్డ్ ధర రూ.1.27 లక్షలు కాగా, ప్రో ధర రూ.1.37 లక్షలు. కార్బన్ ధర రూ.1.41 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. స్టాండర్డ్ వేరియంట్ లో ఫైర్ స్టార్మ్ రెడ్, పెర్ల్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి. ప్రో వేరియంట్లో ప్రో రెడ్, ప్రో బ్లాక్ కలర్ ఆప్షన్లు లభిస్తాయి. టాప్ కార్బన్ వేరియంట్లో కార్బన్ రెడ్, కార్బన్ బ్లాక్, కార్బన్ గ్రే, అబ్రాక్స్ ఆరెంజ్ రంగులను అందిస్తున్నారు.
పాత మోడల్ తో పోలిస్తే కొత్త ఎక్స్ ట్రీమ్ 160R 4V డిజైన్ ను మరింత షార్ప్ గా తీర్చిదిద్దారు. ఫ్యూయల్ ట్యాంక్, వెనుక సీట్ కౌల్ లో కీలక అప్ డేట్స్ తీసుకొచ్చారు. కొత్త కలర్ ఆప్షన్లు బైక్ కు స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. టాప్ కార్బన్ వేరియంట్ లో కొత్త TFT డిస్ ప్లే ఆకట్టుకుంటుంది. ఇది హీరో ఎక్స్‌పల్స్ 210లోని డిస్ప్లే ఆధారంగా రూపొందించినప్పటికీ, ఈ బైక్‌కు సరిపోయేలా లే అవుట్ ను మార్చారు.
ఈ బైక్‌లో 164.32cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించారు. అయితే, గరిష్ట పవర్ గతంలో 16.9hp ఉండగా, ఇప్పుడు 17.1hpకు పెరిగింది. 8,750rpm వద్ద ఈ పవర్ అందుబాటులో ఉంటుంది. టార్క్ మాత్రం 6,500rpm వద్ద 14.6Nmగా ఉంది.
ప్రో, కార్బన్ వేరియంట్లలో రైడ్ బై వైర్ టెక్నాలజీ, రైన్, రోడ్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. ప్రో వేరియంట్లో 37mm KYB USD ఫ్రంట్ ఫోర్క్స్, అడ్జస్టబుల్ ప్రీలోడ్‌తో కూడిన వెనుక మోనోషాక్ అందిస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. స్టాండర్డ్ వేరియంట్లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, మెకానికల్ థ్రాటిల్, సింగిల్ ఛానల్ ABS, LCD డిస్ ప్లే ఉన్నాయి. మూడు వేరియంట్లలోనూ 276mm ఫ్రంట్ డిస్క్, 220mm రియర్ డిస్క్ బ్రేకులు అలాగే ఉంచారు.
హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ బుకింగ్స్ ను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నవంబర్ నుంచి డెలివరీలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!