Hero Xtreme 250R Carbon: హీరో మోటోకార్ప్ ఎక్స్ ట్రీమ్ 250 ఆర్ బైక్‌ను కొత్త ఫీచర్లతో అప్ డేట్ చేసింది. ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వి మోడల్ లో కీలక అప్ డేట్స్ తీసుకొచ్చిన హీరో కంపెనీ.. తాజాగా ఎక్స్ ట్రీమ్ 250ఆర్‌లోనూ పలు కీలక మార్పులు చేసింది. కొత్తగా వచ్చిన ఎక్స్ ట్రీమ్ 250ఆర్ కార్బన్ లో టీఎఫ్టీ డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, క్విక్‌షిఫ్టర్ లాంటి ఫీచర్లతో అప్ డేట్ చేసింది. ఈ కొత్త మోడల్ ధరను రూ. 1.98 లక్షలుగా నిర్ణయించింది.
కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్ కార్బన్లో పాత ఎల్సీడీ డిస్ ప్లే స్థానంలో 4.2 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను అందించింది. ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, ల్యాప్ టైమర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. రైడ్ బై వైర్ థ్రాటిల్ సిస్టమ్‌ను కూడా యాడ్ చేసింది. దీంతో రెయిన్, రోడ్, స్పోర్ట్, ట్రాక్ లాంటి నాలుగు రైడింగ్ మోడ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి మోడ్‌కు అనుగుణంగా ట్రాక్షన్ కంట్రోల్ పనిచేస్తుంది. వీటితో పాటు బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ బైక్ లో మరో కీలకమైన ఛేంజ్ బ్యాక్ సస్పెన్షన్. ఎక్స్ ట్రీమ్ 250ఆర్ కార్బన్ లో ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డాంపింగ్ (FSD) టెక్నాలజీతో కూడిన రియర్ మోనోషాక్ ను అందించారు. ఈ సెగ్మెంట్ లో ది స్పెషల్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. రోడ్డు మీద కుదుపులకు అనుగుణంగా ఈ సస్పెన్షన్ తన పనితీరును మార్చుకుంటుంది. చిన్న చిన్న కుదుపుల సమయంలో మంచి కంట్రోల్ అందించడంతో పాటు, పెద్ద గుంతల దగ్గర స్మూత్ జర్నీకి సాయపడుతుంది. ముందు భాగంలో ఉన్న 43ఎంఎం యూఎస్డీ ఫోర్క్ లో మాత్రం కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇంజిన్ విషయంలో హీరో పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో 249సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ 9,250 ఆర్పీఎం వద్ద 30 హెచ్‌పీ పవర్‌ను, 7,500 ఆర్పీఎం వద్ద 25.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
కొత్త ఎక్స్ ట్రీమ్ 250ఆర్ కార్బన్ ను కార్బన్ రెడ్, కార్బన్ బ్లాక్, కార్బన్ వైట్ అనే మూడు రంగుల్లో తీసుకొచ్చారు. దీని ధర రూ. 1.98 లక్షలు. ప్రస్తుత స్టాండర్డ్ ఎక్స్ట్రీమ్ 250ఆర్తో పోలిస్తే రూ. 25,000 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఫీచర్లతో ఈ బైక్ స్పోర్టీ రైడింగ్‌ను కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఈ మోడల్ కేటీఎం 250 డ్యూక్ కు పోటీ ఇవ్వనుంది.
Read Also: హీరో ఎక్స్ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!