New Renault Duster Hybrid: రెనాల్ట్ ఇండియా న్యూ జెనరేషన్ డస్టర్ ఎస్‌యూవీలో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 16.99 లక్షలుగా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ఎమోషన్ ధర రూ. 19.49 లక్షలు. ఇప్పటికే 1.0 లీటర్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న డస్టర్‌కు ఇప్పుడు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ యాడ్ అయ్యింది. ఈ కొత్త మోడల్ బుకింగ్స్ ను రూ. 21,000తో ప్రారంభించారు. మంచి మైలేజీతో పాటు అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.
కొత్త డస్టర్ హైబ్రిడ్‌ను ఎవల్యూషన్, ఎమోషన్ ట్రిమ్‌లలో తీసుకొచ్చారు. బేస్ ఎవల్యూషన్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు కాగా, టాప్ ఎండ్ ఎమోషన్ వేరియంట్ ధర రూ. 19.49 లక్షలుగా ఉంది. కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. 2026 మార్చిలో న్యూ జెనరేషన్ డస్టర్‌ను పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో పరిచయం చేసిన రెనాల్ట్, ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
డస్టర్ హైబ్రిడ్‌లో 1.8 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఈ మూడు కలిసి 160 హెచ్‌పీ పవర్, 172 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో 1.4kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. మల్టీ మోడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ద్వారా ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ల మధ్య కోఆర్డినేషన్ జరుగుతుంది. ఈ హైబ్రిడ్ వ్యవస్థ లీటరుకు 29 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే, వాస్తవ ప్రయాణ పరిస్థితుల్లో మైలేజీ అనేది డ్రైవింగ్ స్టైల్, ట్రాఫిక్ మీద ఆధారపడి మారే అవకాశం ఉంటుంది.
కొత్త డస్టర్ హైబ్రిడ్ లో సౌకర్యం, భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) లాంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకించి, ADAS వ్యవస్థ డ్రైవింగ్ సమయంలో కొన్ని ప్రమాదాలను గుర్తించడంలో, డ్రైవర్‌కు సహాయపడటంలో ఉపయోగపడతాయి. హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు ఈ ఫీచర్లు కొత్త డస్టర్‌ను మరింత ఆకట్టుకునేలా మార్చనున్నాయి.
పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్‌ను అందించడం ద్వారా రెనాల్ట్ డస్టర్ కొనుగోలుదారులకు మరిన్ని ఆప్షన్స్ కల్పించింది. ఎక్కువ మైలేజీ, ఆటోమేటిక్ డ్రైవింగ్ సౌకర్యం, అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ ఉపయోగపడుతుంది. ధర, ఫీచర్లు, హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ కలయికతో ఇండియన్ మిడ్ సైజ్ ఎస్యూవీ మార్కెట్లో డస్టర్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
Read Also: ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!