Mallela Theertham Waterfalls: హైదరాబాద్ నగర సందడికి కొంచెం దూరంగా వెళ్లి ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో గడపాలని అనుకునే వారికి మల్లేల తీర్థం జలపాతం ఒక అద్భుతమైన ఎంపిక. నగరం నుంచి దాదాపు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం వారాంతాల్లో సరదాగా గడపడానికి ఎంతో బాగుంటుంది. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన చెట్ల మధ్య కొలువైన ఈ జలపాతం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
ఈ జలపాతం నల్లమల అడవుల మధ్యలో ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. నగరంలో ఉండే కాలుష్యం, శబ్దాల నుంచి దూరంగా వచ్చి ఇక్కడ కాసేపు గడిపితే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. పక్షుల కూతలు, గాలుల చప్పుడు మధ్యలో నీటి సప్పుడు వినడం చాలా ఆనందాన్ని ఇస్తుంది.
సుమారు నూరు అడుగుల ఎత్తు నుంచి రాళ్లపై పడే నీటి ధారలు చూడటానికి రెండు కళ్లు చాలవు. తెల్లటి పాలధారలా కిందకు దుముకుతున్న నీటి దృశ్యం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ జలపాతం దగ్గరకు వెళ్లడానికి కొంతదూరం మెట్లు దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టూ ఉండే ప్రకృతి సౌందర్యం మన ప్రయాణ అలసటను పూర్తిగా మర్చిపోయేలా చేస్తుంది.
Also Read: నకిలీ QR కోడ్లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!
వర్షాకాలం, శీతాకాలం ఈ జలపాతాన్ని సందర్శించడానికి చాలా అనుకూలమైన సమయాలు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్యలో ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో చుట్టూ ఉన్న అడవి కూడా చాలా పచ్చగా, నిండుగా కనిపిస్తుంది. వేసవిలో నీటి ప్రవాహం కొద్దిగా తగ్గుతుంది కాబట్టి.. వర్షాలు పడిన తర్వాత వెళ్లడమే మంచిది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో ఈ జలపాతం చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో లేదా క్యాబ్లలో వెళ్లడం చాలా సులభం. జలపాతం దగ్గర మెట్లు దిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నీటిలో రాళ్లు జారే అవకాశం ఉంటుంది కాబట్టి.. చిన్న పిల్లలు, పెద్దవారితో వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కుటుంబంతో కలిసి ఒక రోజు ప్రయాణానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పాలి.
Also Read: స్మార్ట్ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్డేట్!