Kalvakuntla Kavitha: రాష్ట్రంలో కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ ముఖ్యమంత్రి గోవా, ఢిల్లీలకు తిరుగుతూ ప్రజాస్వామ్యం పై లెక్చర్లు ఇస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ ఏడాది జనవరిలోనే ఎల్ నినో ఉంటుందని ప్రపంచం మొత్తం హెచ్చరికలు చేసినా.. ఎందుకు ముందుస్తు చర్యలు చేపట్టలేదని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. ఆగస్టులో 28 శాతం వర్షాపాతం తక్కువగా నమోదైతే పక్క రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయని.. కరువు మండలాలను ప్రకటించి కేంద్రానికి నివేదికలు ఇచ్చాయని గుర్తు చేశారు. అదే సమయంలో కరవు కట్టడి చర్యలు సైతం చేపట్టాయని పేర్కొన్నారు. అందుకే తెలంగాణలో ఉన్నంత కరవు పరిస్థితులు వేరే రాష్ట్రాల్లో లేవన్నారు.
దొంగల పడ్డ ఆరునెలలకు ఇప్పుడు వచ్చి రైతులు పంట వేయకుండా త్యాగాలు చేయాలని సీఎం అనడం హాస్యాస్పదమని కవిత ఎద్దేవా చేశారు. ‘అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేయలేదు. మేడిగడ్డ బ్యారేజ్ ను కూడా రిపేర్ చేయలేదు. ఇంకా ఎన్ని రోజులు పాత ప్రభుత్వాన్ని నిందిస్తారు. మీ ప్రెస్ మీట్ మొత్తం నిస్సహాయత, ప్రతిపక్షాలను తిట్టటానికే సరిపోయింది. మీ కుటుంబానికి దోపిడీ చేసి దోచి పెట్టటం మీద పెట్టిన శ్రద్ధ.. ప్రజల సమస్యలను తీర్చటం కోసం పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ముఖ్యమంత్రికి ప్రజల మీద శ్రద్ధ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది’ అని కవిత ఆరోపించారు.
కరువు పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ రైతు కూలీలకు ఎన్నికల సమయంలో ఇస్తామన్న రూ.12 వేల పథకాన్ని వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ‘రైతు కూలీల్లో 40 శాతం మందికి భూమి ఉండదు. వారికి ఏమైనా అయితే కుటుంబాలు ఆగమావుతాయి. అందుకే రైతు కూలీలకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని కవిత పట్టుబట్టారు. ‘వచ్చే 10 నెలల పాటు వర్షాలు ఉండవని చెబుతున్న నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ ను ఇప్పటికైనా రిపేర్ చేస్తారా? లేదంటే మళ్లీ టైమ్ పాస్ చేస్తూ గోదావరి నీళ్లను వినియోగం లేకుండా చేస్తారా?’ అని కవిత నిలదీశారు.
Also Read: శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!
అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా కవిత విమర్శలు గుప్పించారు. తనను నమ్ముకున్న వాళ్లను కేటీఆర్ నట్టేట ముంచేస్తారని చెప్పడానికి బొగ్గు స్కామ్ పై ఆయన లేఖే ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. ప్రతిమ శ్రీనివాస్ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ కు ఎంతో సాయం అందించారని.. పార్టీ అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిపైనే లేఖ రాయడం.. కేటీఆర్ అజ్ఞానామా? నమ్మిన వాళ్లను మోసం చేయడమా? అని కవిత నిలదీశారు. సొంత మనుషులనే ఆయన ఉడుకు నీళ్లల్లో వేస్తున్నారని.. ఇదే అదనుగా సీఎం కూడా విచారణ జరపుతామని చెబుతున్నారని పేర్కొన్నారు.
Also Read: దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!