Worldwide Wrong Route Driving Rules: వాహనదారులు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలంటే, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ ప్రయాణించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రూట్స్ వాయిలేట్ చేయకూడదు. నిబంధనల ఉల్లంఘన ప్రమాదాలకు కారణం అవుతుంది. తమతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది ఎక్కువ ప్రమాదాలకు కారణం అవుతుంది. త్వరగా వెళ్లాలనే ఆలోచనతో చాలా మంది రాంగ్ రూట్ లో వెళ్తుంటారు. కానీ, ఇలా చేయడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ట్రాఫిక్ వాయెలేషన్స్ లో ఒకటిగా పరిగణిస్తారు. సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఇంతకీ ఈ ఉల్లంఘనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శిక్షలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తప్పు మార్గంలో ప్రయాణించడాన్ని రాంగ్ సైడ్ డ్రైవింగ్ అంటారు రహదారి మీద ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా డ్రైవింగ్ చేయడం, రాంగ్ ఎండ్ నుంచి వన్ వేలోకి ఎంట్రీ ఇవ్వడం, నో ఎంట్రీ, వన్ వే సైన్ బోర్డులను పట్టించుకోకుండా డ్రైవింగ్ చేయడం అనేది రాంగ్ సైడ్ డ్రైవింగ్ కిందికి వస్తుంది. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. రాంగ్ రూట్ లో డ్రైవ్ చేసేటప్పుడు ఇతర డ్రైవర్లు సరిగా గమనించరు. అందుకే, ఆకస్మిక ప్రమాదాలకు కారణం అవుతుంది. రద్దీగా ఉండే నగరాల్లో, హైవేలపై ఈ డ్రైవింగ్ మరింత ప్రమాదకరమైనది. ప్రయాణీకులకు తీవ్రగాయాలు కావడంతో పాటు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే, ప్రతి దేశంలో కఠినమైన నియమాలు అమల్లో ఉన్నాయి.
భారత్ లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది, మోటారు వాహనాల చట్టం 1988 కిందికి వస్తుంది. సెక్షన్ 119/177 ప్రకారం రోడ్డు సంకేతాలు, డైరెక్షన్స్ దిశలను పాటించకపోవడాన్ని నేరంగా పరిగణిస్తుంది. సెక్షన్ 184 ప్రమాదకరమైన డ్రైవింగ్ ను నేరంగా పరిగణిస్తారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు సాధారణంగా రూ.500 నుంచి రూ. 1,100 వరకు జరిమానా విధిస్తారు. మళ్లీ ఇదే తప్పు చేసే రూ.1,500 నుంచి రూ. 2,000 అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తారు. చాలా ప్రమాదకరంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే, కోర్టు రూ. 5,000 వరకు చలాన్ వేస్తుంది. లేదంటే, 3 నెలల వరకు జైలు శిక్ష విధిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో లైసెన్స్ సస్పెన్షన్, వాహన జప్తు, రికార్డులో బ్లాక్ పాయింట్లు వేస్తారు.
⦿ అమెరికా: హైవేలపై రాంగ్ రూట్ డ్రైవింగ్ పెద్ద నేరం. $200(రూ.18 వేలు) నుంచి $2,500(2.27 లక్షలు) జరిమానా విధిస్తారు. ప్రమాదానికి కారణం అయితే, లైసెన్స్ సస్పెన్షన్, జైలు శిక్ష విధిస్తారు.
⦿ జర్మనీ: జర్మనీలోనూ రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు భారీ జరిమానా విధిస్తారు. వందల యూరోల ఫైన్ వేస్తారు. లైసెన్స్ పాయింట్లను తగ్గించడంత పాటు తీవ్రమైన ప్రమాదాల సమయంలో 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.
⦿ ఇటలీ: €573(రూ. 61 వేల) వరకు జరిమానా విధిస్తారు. తీవ్రమైన కేసులకు లైసెన్స్ పాయింట్లు తగ్గిస్తారు. మరికొన్నిసార్లు లైసెన్స్ సస్పెన్షన్ విధిస్తారు.
యూకే, న్యూజీలాండ్, వియత్నాం, దుబాయ్ లాంటి దేశాల్లో కూడా పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జైలు శిక్ష విధిస్తారు.
Read Also: వాహనదారులకు అలర్ట్, మార్చి 1 నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్.. ఎందుకంటే?