Power Petrol Explained: పెట్రోల్ బంక్ కు వెళ్లినప్పుడు .. అక్కడ పని చేసే ఆపరేటర్లు.. పవర్ పెట్రోల్ పోయించుకోండి.. చాలా మంచిది అని చెప్తుంటారు. చాలామంది వారు చెప్పినట్లే పోయించుకుంటారు. అంతేకాదు, తమ వాహనానికి పవర్ పెట్రోల్ మంచిదని భావిస్తారు. కానీ, అసలు నిజం ఏంటంటే.. ప్రతి కారుకు పవర్ పెట్రోల్ అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఉపయోగపడినా, ఎక్కువగా ఖర్చుకు కారణం అవుతుంది.
ముందుగా పవర్ పెట్రోల్ అంటే ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిని ప్రీమియం లేదంటే హై ఆక్టేన్ ఫ్యూయెల్ అని పిలుస్తారు. సాధారణ పెట్రోల్ తో పోలిస్తే దీని ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మన దేశంలో లభించే పెట్రోల్ 87 నుంచి 91 ఆక్టేన్ మధ్య ఉంటుంది. పవర్ పెట్రోల్ మాత్రం 91 నుంచి 95, అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఆక్టేన్ రేటింగ్ అనేది ఇంజిన్ లో ఒత్తిడిని ఎంత వరకు తట్టుకుంటుందో సూచిస్తుంది. అంటే, ఇది త్వరగా మండిపోకుండా నియంత్రణతో పని చేస్తుంది.
పవర్ పెట్రోల్ అనేది అధిక పనితీరు ఉన్న కార్లకు ఉపయోగపడుతుంది. టర్బో ఇంజిన్లు , హై పెర్ఫార్మెన్స్ వెహికల్స్ ఎక్కువ ఒత్తిడితో పని చేస్తాయి. అలాంటి సందర్భాల్లో పవర్ పెట్రోల్ వాడితే ఫ్యూయెల్ కంట్రోల్ లో ఉంటుంది. నెమ్మదిగా మండుతుంది. డ్రైవింగ్ స్మూత్ గా ఉంటుంది. యాక్సిలరేషన్ కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు మైలేజీ కూడా కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, ఇంజిన్ నాకింగ్ సమస్యను తగ్గిస్తుంది. నాకింగ్ అంటే ఫ్యూయెల్ సరిగ్గా కాకుండా ముందుగానే బర్న్ కావడం. దీని వల్ల ఇంజిన్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
పవర్ పెట్రోల్ తో మరో లాభం ఏటంటే.. ఇందులో కొన్ని ప్రత్యేక యాడిటివ్స్ ఉంటాయి. ఇవి ఇంజిన్ లోని ఫ్యూయల్ ఇంజెక్టర్లు, వాల్వ్ లను శుభ్రంగా ఉంచడంలో సాయపడుతాయి. కార్బన్ పేరుకుపోకుండా కాపాడుతాయి. దీని వల్ల ఇంజిన్ కొంతకాలం స్మూత్ గా పని చేస్తుంది. ఎక్కువగా ప్రయాణించే వారు, రోజూ ఎక్కువగా వాహనం వాడే వారికి అనుకూలంగా ఉంటుంది.
పవర్ పెట్రోల్ అనేది ప్రతి వాహనానికి అవసరం లేదు. సాధారణంగా చిన్న కార్లు, సాధారణ ఇంజిన్ తో ఉన్న వాహనాలు, రెగ్యులర్ పెట్రోల్ తోనే బాగా పని చేస్తాయి. అలాంటి కార్లలో పవర్ పెట్రోల్ నింపినా పెద్దగా మార్పు కనిపించదు. మైలేజ్ కూడా పెరగదు. పైగా జేబు ఖాళీ అవుతుంది. ఏమాత్రం ఉపయోగం లేకుండా ఖర్చు పెరుగుతుంది. పవర్ పెట్రోల్ అనేది కారు మాన్యువల్ లో హై ఆక్టేన్ ఫ్యూయెల్ ను సూచిస్తేనే తప్పకుండా వాడాలి. టర్బో ఇంజిన్ ఉన్న వాహనాలు, స్పోర్ట్స్ కార్లు, హై పెర్ఫార్మెన్స్ కార్లకు ఈ పెట్రోల్ వాడాలి. దీర్ఘ ప్రయాణాలు, కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్, ఎక్కువ వేడి పరిస్థితుల్లో కూడా పవర్ పెట్రోల్ కొంత ఉపయోగపడుతుంది. సో, అవసరం లేకుండా ప్రీమియం పెట్రోల్ వాడకపోవడం మంచిది.
Read Also: గ్రామీణ భారతంలో ఈవీ స్కూటర్ల హవా.. రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ!