Tata Punch EVLifetime Battery Warranty: 2026లో విడుదలైన కొత్త టాటా పంచ్ EV వినియోగదారులకు టాటా మోటార్స్ అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. ఈ మోడల్ మీద మరింత నమ్మకాన్ని కలిగించేలా ప్రత్యేకమైన వారంటీని అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే సెలెక్టెడ్ మెంబర్స్ కు హై వోల్టేజ్ బ్యాటరీ, మోటార్ పై లైఫ్ టైమ్ వారంటీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ వారంటీ అసలు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ సమయంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించినా ఎలాంటి పరిమితి ఉండదు.
ఈ ఆఫర్ 40 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ కు మాత్రమే వర్తిస్తుంది. దీని వల్ల వినియోగదారులు ఎక్కువ కాలం పాటు బ్యాటరీ పనితీరు గురించి ఆందోళన లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల్లో సాధారణంగా బ్యాటరీ లైఫ్ మీద ఉండే అపోహలను, సందేహాలను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వారంటీ అందరికీ వర్తించదు. కేవలం మొదటి యజమానికి మాత్రమే వర్తిస్తుంది. అంటే, వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పేరుతోనే ఈ పూర్తి ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ ఆ కారును తరువాత అమ్మితే, తదుపరి యజమానికి ఈ వారంటీ పూర్తిగా వర్తించదు. అప్పుడు అది గరిష్టంగా 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు మాత్రమే చెల్లుతుంది. ఈ మార్పు అసలు రిజిస్ట్రేషన్ తేదీ నుంచే లెక్కించబడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వారంటీ వ్యక్తిగత వినియోగానికి మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య అవసరాలకు ఎక్కువగా ఉపయోగించినట్లయితే, వాహనాన్ని కఠిన పరిస్థితుల్లో నిరంతరం నడిపితే, వారంటీ కవరేజ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే, సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపొందించింది.
కొత్త పంచ్ EV ఫీచర్ల విషయానికి వస్తే, ఇది రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. 40 kWh బ్యాటరీ ఉన్న మోడల్ ఒకే ఛార్జ్‌తో సుమారు 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. మరోవైపు, 30 kWh బ్యాటరీతో కూడిన వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది తక్కువ దూర ప్రయాణాలకు సరిపోతుంది. ఫాస్ట్ DC ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, కేవలం 26 నిమిషాల్లో బ్యాటరీని 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది రోజువారీ వినియోగంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ కారులు సేఫ్టీ ఫీచర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టాబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి ఫీచర్లు స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటాయి. అదనంగా, పంచ్ EVను స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ లాంటి వేరియంట్లలో అందిస్తున్నారు. వినియోగదారులు తమ అవసరాలు, బడ్జెట్ ను బట్టి సరైన మోడల్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
Read Also: హ్యుందాయ్ సమ్మర్ క్యాంప్.. ఫ్రీగా ఏసీ చెకప్ చేయించుకోండి!