Tesla vs Ferrari: ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టెస్లా రోడ్ స్టర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కారు గాల్లోకి ఎగిరేలా చూపించిన ప్రదర్శన ఆటోమొబైల్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ టెక్నాలజీ ఆలోచన కొత్తదేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే, సుమారు ఎనిమిదేళ్ల క్రితమే ఫెరారీ ఇలాంటి వ్యవస్థకు సంబంధించిన పేటెంట్ ఫెరారీ పొందినట్లు సమాచారం. దీంతో టెస్లా రోడ్‌స్టర్ టెక్నాలజీ, ఫెరారీ పేటెంట్ మధ్య పోలికలపై ఆసక్తి పెరిగింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించిన కొత్త రోడ్‌స్టర్‌లో రాకెట్ తరహా థ్రస్టర్లను ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, ఇటీవల చూపించిన గాల్లోకి ఎగిరే దృశ్యాలు ప్రత్యేకంగా సిద్ధం చేసిన కారుతో, డ్రైవర్ లేకుండా ప్రదర్శించారు. ఈ విధమైన ప్రదర్శన రోడ్లపై చట్టబద్ధమా? కాదా? అనే విషయంలో మస్క్ కూడా సందేహం వ్యక్తం చేశారు. టెస్లా రోడ్ స్టర్ లో సాధారణ పెర్ఫార్మెన్స్ వెర్షన్ తో పాటు, ఎయిర్ థ్రస్టర్లను ఉపయోగించే ప్రత్యేక వెర్షన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, మెరుగైన రోడ్ గ్రిప్ కోసం ఫ్యాన్ ఆధారిత వ్యవస్థను ఉపయోగించే ఆలోచన కూడా ఉంది. థ్రస్ట్ వెర్షన్ సున్నా నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని సెకనులోపే అందుకుంటుందని టెస్లా వెల్లడించింది.
ఇలాంటి ఆలోచన హాలీవుడ్ నైట్ రైడర్ సినిమా లోని టర్బో బూస్ట్ సన్నివేశాలను గుర్తు చేస్తోంది. అయితే, నిజ జీవితంలోనూ ఫెరారీ ఈ తరహా టెక్నాలజీపై ప్రయోగాలు చేసినట్లు తెలుస్తోంది. 2018లో ఈ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ గ్యాస్ థ్రస్ట్ బూస్టర్లకు సంబంధించిన పేటెంట్‌ను పొందింది. ఫెరారీ వివరించిన వ్యవస్థలో ప్రెషర్ తో నింపిన గాలిని నిల్వ చేసే ట్యాంక్ తో పాటు, అడ్డంగా, నిలువుగా అమర్చిన స్పెషల్ నాజిల్స్ ఉంటాయి. వీటి నుంచి వేగంగా గాలిని బయటకు పంపించడం ద్వారా కారుకు అడిషనల్ పవర్ అందించాలనేది ప్రధాన ఉద్దేశం.
ఈ వ్యవస్థ కేవలం వేగాన్ని పెంచడానికే పరిమితం కాదు. నిలువుగా పనిచేసే థ్రస్టర్లు కారును రోడ్డుపై మరింత గట్టిగా అదిమి ఉంచేందుకు సాయపడుతుంది. దీనివల్ల టైర్లకు రోడ్డుతో ఉండే పట్టు మెరుగుపడే అవకాశం ఉంది. అడ్డంగా పనిచేసే థ్రస్టర్లను మలుపుల్లో కారును కంట్రోల్ చేయడానికి ఉపయోగించవచ్చు. కారు అదుపు తప్పే పరిస్థితుల్లో దాని కదలికను సరిచేయడానికి, వేగాన్ని తగ్గించడానికి కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేటెంట్ వివరాల్లో వెల్లడించారు. బైక్ లలోనూ ఇలాంటి వ్యవస్థను ఉపయోగించే అవకాశాన్ని కూడా అందులో ప్రస్తావించారు.
ప్రస్తుతం ఫెరారీ ఈ టెక్నాలజీని ఉత్పత్తి కార్లలో ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైన సమాచారం లేదు. అలాగే, టెస్లా రోడ్స్టర్లోని వ్యవస్థ ఫెరారీ పేటెంట్ ను ఉల్లంఘిస్తోందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. రెండు కంపెనీల ఆలోచనల్లో పోలికలు ఉన్నప్పటికీ, వాటి సాంకేతిక విధానం, పేటెంట్ పరిధి వేర్వేరుగా ఉండవచ్చు. టెస్లా రోడ్‌స్టర్ వాస్తవంగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ థ్రస్టర్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఫెరారీ పేటెంట్‌తో ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలియనుంది.
Read Also: రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?