AI Weather: సాధారణంగా మనం వాడే వాతావరణ అంచనా మోడల్స్ అన్నీ సముద్రంలో ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, గాలి వేగం లాంటి వందల సంఖ్యలో ఉన్న డేటాను విశ్లేషించి ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఇస్తాయి. ఇక్కడొచ్చే అసలు సమస్య ఏంటంటే.. మొదట్లో జరిగే ఒక చిన్న అంచనా పొరపాటు, రోజులు గడిచేకొద్దీ రాకెట్ లాగా పెద్దదైపోతుంది. అందుకే ఒకే వారం దాటితే ఈ వెదర్ రిపోర్ట్స్ ఏవీ నమ్మదగినవిగా ఉండవు. అయితే మైక్రోసాఫ్ట్ రీసెర్చర్లు ఇక్కడ ఒక తెలివైన ఆలోచన చేశారు. కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా పూర్తి వెదర్ సిస్టమ్‌ను తయారు చేయడం కన్నా.. ప్రస్తుతం ఉన్న పాత సిస్టమ్స్ ప్రతిసారీ ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాయో గమనించి, ఆ తప్పులను సరిదిద్దే కొత్త ఏఐ మోడల్‌ను రూపొందించారు. దీనికే ‘ప్రొబబిలిస్టిక్ బయస్ కరెక్షన్’ అని పేరు పెట్టారు.
సాధారణంగా మనుషులమైన మనం ఒక తప్పు చేస్తే, మళ్లీ ఆ తప్పు చేయకుండా అనుభవంతో నేర్చుకుంటాం కదా? ఈ ఏఐ మోడల్ కూడా సరిగ్గా అదే పనిచేస్తుంది. గతంలో వాతావరణ శాఖలు ఇచ్చిన రిపోర్టులను, ఆ తర్వాత నిజంగా నమోదైన వర్షపాతం, ఉష్ణోగ్రతలతో పోల్చి చూస్తుంది. పాత మోడల్స్ ఎక్కడెక్కడ నిలకడగా తప్పులొచ్చాయో పసిగట్టి.. భవిష్యత్తులో ఇచ్చే రిపోర్ట్స్‌లో ఆ తప్పులను ఆటోమేటిక్‌గా కరెక్ట్ చేస్తుంది. ప్రసిద్ధ ‘యూరోపియన్ సెంటర్’ వాతావరణ డేటాపై ఈ కొత్త టెక్నాలజీని టెస్ట్ చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలొచ్చాయి. వర్షపాతం అంచనాల్లో దాదాపు 98 శాతం, ఉష్ణోగ్రతల ప్రిడిక్షన్స్‌లో 92 శాతం మేర మెరుగైన ఫలితాలు లభించాయి.
Also read: నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ
మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. దీని ప్రాసెసింగ్ కాస్ట్ చాలా తక్కువ. సాధారణంగా పెద్ద పెద్ద వాతావరణ అంచనాలకు వేల కోట్ల విలువైన సూపర్ కంప్యూటర్లు కావాలి. కానీ ఈ ఏఐ మోడల్ మన ఇంట్లో ఉండే సాధారణ కంప్యూటర్ ప్రాసెసర్లపైనే హ్యాపీగా రన్ అవుతుంది. పైగా దీనిని ఓపెన్ సోర్స్‌గా, అంటే ఉచితంగా అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు. దీనివల్ల భారీగా ఖర్చు చేయలేని చిన్న చిన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తమ వాతావరణ శాఖలను చాలా ఈజీగా అప్‌గ్రేడ్ చేసుకునే ఛాన్స్ దక్కుతుంది.
ఇక మన దేశం విషయానికొస్తే.. ఈ టెక్నాలజీ మన ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త దిశను చూపించగలదు. మన దేశంలో వ్యవసాయం పూర్తిగా రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. నెల రోజుల ముందే వర్షాలు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు ఎండలు వస్తాయి అనేది ముందే తెలిస్తే.. రైతులు విత్తనాలు ఎప్పుడు వేయాలో, ఎప్పుడు నీటి తడులు ఇచ్చుకోవాలో పక్కాగా ప్లాన్ చేసుకోగలరు. అంతేకాదు, వర్షపాతం ఆధారంగా రిజర్వాయర్లలో నీటిని ఎంత నిల్వ ఉంచాలి? ఎంత విడుదల చేయాలి? అనేది వాటర్ మేనేజ్మెంట్ టీమ్స్ నిర్ణయించవచ్చు. తుఫానులు, వరదలు వచ్చే అవకాశం ఉంటే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ముందుగానే సహాయక చర్యలకు సిద్ధంగా ఉండవచ్చు.
Also read: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్లైన్ లోనే..?