Triumph Bonneville T40: పాతకాలపు మోటార్ సైకిళ్ల రూపం ఇష్టపడే వారికి ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. భారత మార్కెట్లో ట్రయంఫ్ బోన్నెవిల్ T40ను రూ.2.80 లక్షల ధరతో విడుదల చేసింది. క్లాసిక్ లుక్కు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ రూపొందించిన ఈ బైక్‌లో 350cc ఇంజిన్, TFT డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఐదు కీలక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బోన్నెవిల్ T40ను చూడగానే క్లాసిక్ బైక్ స్టైలింగ్ గుర్తుకొస్తుంది. టియర్ డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్, గుండ్రని LED హెడ్ ల్యాంప్, వంపులతో కూడిన ఫెండర్లు, సింగిల్ పీస్ సీటు దీని ప్రత్యేకతలు. పీషూటర్ స్టైల్ ఎగ్జాస్ట్, వైర్ స్పోక్ వీల్స్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లు కూడా బైక్ కు మంచి లుక్ తీసుకొస్తున్నాయి. ఈ బైక్ ఏజియన్ బ్లూ విత్ ఫ్యూజన్ వైట్, మెరిడెన్ బ్లూ విత్ టాంజరిన్ ఆరెంజ్, న్యూ ఇంగ్లాండ్ వైట్ విత్ జెట్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.
ఈ బైక్ లో 350cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 28.3 bhp పవర్, 31 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు స్పీడ్ గేర్ బాక్స్ ను జత చేశారు. ముఖ్యంగా లో, మిడ్ స్పీడ్ లో మెరుగైన పనితీరును అందించేలా ఇంజిన్‌ను ట్యూన్ చేశారు. రోజువారీ ప్రయాణాలతో పాటు సుదూర రైడింగ్‌ను ఇష్టపడేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ సెటప్‌ను రూపొందించారు.
బోన్నెవిల్ T40లో 4 అంగుళాల రౌండ్ TFT ఇన్స్ట్రుమెంట్ డిస్ ప్లే ఉంది. ఇందులో సంప్రదాయ అనలాగ్ మీటర్లను గుర్తుచేసే హెరిటేజ్ మోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్, నావిగేషన్ సదుపాయాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, రోడ్, రెయిన్, ఎకో రైడింగ్ మోడ్లతో పాటు రెండు కస్టమ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్లను అందించారు.
ఈ బైక్‌లో కొత్త స్టీల్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్ లు, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ముందు 18 అంగుళాలు, వెనుక 17 అంగుళాల వైర్ స్పోక్ వీల్స్ ను అమర్చారు. దీని సీటు ఎత్తు 790 మి.మీ. కాగా, కెర్బ్ బరువు 195 కిలోలు.
బోన్నెవిల్ T40తో పాటు T40 బ్లాక్ వెర్షన్‌ను కూడా అదే రూ.2.80 లక్షల ధరకు అందిస్తున్నారు. ఇందులో బ్లాక్ పెయింట్ ఫినిష్, బ్లాక్ ఇంజిన్ భాగాలు, గ్లాస్ బ్లాక్ అల్యూమినియం వీల్ రిమ్స్ ఉంటాయి. డెలివరీలు నవంబర్ 2026లో ప్రారంభం కానున్నాయి.
Read Also: డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!