దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో టీవీఎస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యూబ్ S శ్రేణిలో కొత్త 4.7 kWh వేరియంట్ ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ధరను రూ.1.37 లక్షలుగా నిర్ణయించింది. పెద్ద బ్యాటరీ ప్యాక్ తో వచ్చిన ఈ వేరియంట్ ఇప్పుడు ఎక్కువ రేంజ్ ను అందించనుంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉండనుంది.
కొత్త ఐక్యూబ్ Sలో 4.7 kWh బ్యాటరీ ప్యాక్ ను అందించారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 175 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ ఇస్తుంది. కంపెనీ ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఐక్యూబ్ వేరియంట్లలో ఇదే ఎక్కువ రేంజ్ ను కలిగి ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే చాలా మంది ఎక్కువ రేంజ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే, టీవీఎస్ ఈ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
పనితీరు విషయానికి వస్తే, స్కూటర్‌లో పెద్ద మార్పులు చేయలేదు. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 5.90 hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 82 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 4.3 సెకన్లలో అందుకుంటుంది. పెద్ద బ్యాటరీ వల్ల తరచుగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా రోజుకు 40 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆఫీసులకు వెళ్లేవారు, డెలివరీ సేవల్లో పనిచేసేవారు, అలాగే ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండేవారికి మంచి ఆప్షన్ కానుంది.
ఫీచర్ల పరంగా కూడా ఐక్యూబ్ S చాలా ముందుంటుంది. ఇందులో TFT డిస్ ప్లే, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్, రైడ్ వివరాలు, అలర్ట్ నోటిఫికేషన్ల లాంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.
డిజైన్ విషయంలో టీవీఎస్ రెండు కొత్త కలర్ ఆప్షన్లను కూడా పరిచయం చేసింది. ఇప్పటికే ఉన్న టైటానియం గ్రే మ్యాట్ తో పాటు ఇప్పుడు మాగ్నిఫిసెన్స్ పర్పుల్ బీజ్, హార్లెకిన్ బ్లూ బీజ్ రంగులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్, మంచి అండర్ సీట్ స్టోరేజ్, సౌకర్యవంతమైన సీటింగ్ ఉంటుంది. ప్రస్తుతం ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో పోటీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ ఎక్కువ రేంజ్ అందించే మోడల్ ను తీసుకురావడం ద్వారా వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నిస్తోంది.
Read Also: రూ.1 లక్షలోపు హీరో ఎలక్ట్రిక్ స్కూటర్, ఇక ఆ మోడల్స్ కు చుక్కలే!