ఇటీవల మీరు ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశారా? తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు మృదువైన హమ్మింగ్ సౌండ్ వినిపిస్తుందా? ఇంతకీ ఆ సౌండ్ ఎందుకు వస్తుందని ఆలోచించారా? కొంత మంది కారులో ఏదైనా సమస్య ఉందేమో అని భావించే అవకాశం ఉంది. కానీ, మీరు అలా అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే, అది కొత్త వచ్చే ఎలక్ట్రిక్ కార్లలో ఏర్పాటు చేసిన ఓ భద్రతా వ్యవస్థ. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అది EV అకౌస్టిక్ వెహికల్స్ అలర్ట్ సిస్టమ్ (AVAS). ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటంటే..?
ఎలక్ట్రిక్ వాహనాలలో AVAS వ్యవస్థ అనేది పాదచారులకు, ఇతర వాహనదారులకు వినగల హెచ్చరికలను అందించడం ద్వారా భద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలు నిశ్శబ్దంగా వెళ్తాయి. అయితే, కొన్నిసార్లు గమనించకుండా పాదచారులు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంత మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలను కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాదచారుల సంఖ్య ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఆడియో వార్నింగ్ అనేది కాస్త ముఖ్యమూనదిగా మారింది.
కారు తక్కువ వేగంతో కదులుతున్నప్పుడు, అంటే, సాధారణంగా గంటకు 20 కి.మీ కంటే తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు AVAS వ్యవస్థ చిన్న సౌండ్ చేస్తుంది. ఈ ధ్వని సమీపంలోని వ్యక్తులను అప్రమత్తం చేయడానికి, వాహనం వస్తుందనే విషయాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. అకస్మాత్తుగా చూసి భయపడకుండా శబ్దంతో హెచ్చరికలు చేసేలా దీనిని రూపొందించారు. ఇటువంటి చర్యలు భద్రత, అవగాహనను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ వాహనాలలో AVASను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రతి EV తయారీదారు తమ మోడళ్లకు ప్రత్యేకమైన ఆడియోను యాడ్ చేస్తారు. టాటా మోటార్స్ కూడా తమ కొత్త మోడల్స్ లో ఈ విధానాన్ని అమలు చేస్తుంది.
AVAS వ్యవస్థను పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాదు, మారుతి సుజుకి గ్రాండ్ విటారా లాంటి బలమైన హైబ్రిడ్ కార్లు కూడా తక్కువ వేగంతో ఎలక్ట్రిక్ మోడ్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాదచారులను అప్రమత్తం చేయడానికి తక్కువ సౌండ్ ను విడుదల చేసేలా AVAS హెచ్చరికను కలిగి ఉంటాయి. అదేవిధంగా, EV తయారీదారులు క్యాబిన్ లోపల ఆడియో సిగ్నేచర్స్ ను కూడా చేర్చుతున్నాయి. ఈ వ్యవస్థలు సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని నిర్ధారించడానికి అనుకూలంగా ఉంటాయి. BMW లాంటి హై ఎండ్ బ్రాండ్లు తమ ఎలక్ట్రిక్ కార్ల కస్టమర్ల కోసం ప్రత్యేకమైన సౌండ్ సిగ్నేచర్ ను డెవలప్ చేసేందుకు హాన్స్ జిమ్మెర్ లాంటి ప్రముఖ స్వరకర్తలతో కలిసి పని చేస్తున్నాయి.
AVAS వ్యవస్థలు ఎలక్ట్రిక్ వాహనాలు రహదారి వినియోగదారులకు సురక్షితంగా ఉండేలా చూసుకోవడంలో ఒక ముఖ్యమైన అడుగు ఆటో కంపెనీలు భావిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో AVAS లాంటి భద్రతా వ్యవస్థలు ప్రమాదాల తగ్గింపులో కీలక పాత్ర పోషించనున్నాయి.
Read Also: ఎండాకాలం ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి, లేదంటే కారు ఏసీ పని చేయదు!