Yamaha Aerox 155 Updated Price: యమహా మాక్సీ స్కూటర్ ఏరాక్స్ 155 ధరలను మరోసారి పెంచింది. కంపెనీ ప్రకటించిన తాజా ధరల ప్రకారం, ఈ స్కూటర్‌పై రూ.2,800 వరకు పెంపు అమల్లోకి వచ్చింది. కొత్త ధరలతో స్టాండర్డ్ యమహా ఏరాక్స్ 155 ధర ఇప్పుడు రూ.1.43 లక్షలకు చేరుకుంది. అలాగే, ఎక్కువ ఫీచర్లతో వచ్చే వెర్షన్ S మోడల్ ధర రూ.1.46 లక్షలకు చేరింది.
రవాణా ఖర్చులు పెరగడం, అలాగే ముడిసరుకుల ధరలు అధికం కావడం వల్ల ధరలను పెంచాల్సి వచ్చిందని యమహా కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను సవరించుతున్నాయి. యమహా కూడా అదే కారణాలతో ఏరాక్స్ 155 ధరలను పెంచింది. అయితే, ఈ స్కూటర్ ధరలను కంపెనీ ఏప్రిల్ 2026లో కూడా ఒకసారి పెంచింది. ఈ ఏడాది రెండోసారి ధరలను సవరించింది.
యమహా ఏరాక్స్ 155ను పనితీరు, స్పోర్టీ రైడింగ్ ను ఇష్టపడే వినియోగదారుల కోసం రూపొందించారు. సాధారణ స్కూటర్లతో పోలిస్తే దీని డిజైన్ మరింత స్టైలిష్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. పెద్ద వీల్స్, షార్ప్ బాడీ డిజైన్, స్పోర్టీ సీటింగ్ పొజిషన్ స్కూటర్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇందులో 155cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 15bhp పవర్, 13.9Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సిటీతో పాటు హైవే ప్రయాణాల్లో కూడా ఇది మంచి పనితీరును అందిస్తుంది. యమహా R15 బైక్ లో ఉపయోగించే ఇంజన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. ఏరాక్స్ 155ను స్కూటర్ కంటే ఎక్కువగా స్పోర్టీ మెషీన్ గా భావిస్తారు.
ఫీచర్ల పరంగా కూడా ఈ స్కూటర్ ముందుంటుంది. ఇందులో LED హెడ్ లైట్, LED టెయిల్ లైట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. మొబైల్ కనెక్ట్ చేసుకుని కాల్ అలర్ట్స్, మెసేజ్ నోటిఫికేషన్స్ లాంటి వివరాలు స్క్రీన్ లోనే చూసే అవకాశం ఉంది. అలాగే ఆటో స్టార్ట్- స్టాప్ ఫీచర్ కూడా ఉంది. దీని వల్ల ట్రాఫిక్ లో ఫ్యూయెల్ వినియోగం కొంతమేర తగ్గుతుంది. టాప్ వేరియంట్ వెర్షన్ Sలో కీలెస్ స్టార్ట్- స్టాప్ సిస్టమ్ తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ సాధారణంగా ఖరీదైన టూవీలర్స్ లో మాత్రమే కనిపిస్తుంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో యమహా ఏరాక్స్ 155కు హీరో జూమ్ 160కు గట్టిపోటీ ఇస్తుంది. హీరో జూమ్ 160 ధర తక్కువగా ఉన్నప్పటికీ, పనితీరు, స్పోర్టీ ఫీలింగ్ విషయంలో ఏరాక్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ధర పెరిగినా కూడా స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజన్, ఆధునిక ఫీచర్ల కారణంగా యమహా ఏరాక్స్ 155కు మార్కెట్లో మంచి డిమాండ్ కొనసాగుతోంది.
Read Also: కళ్లు చెదిరే రేంజ్, క్రేజీ కలర్స్.. నయా ఐక్యూబ్ అదిరింది భయ్యా!