E-Paper
Advertisement

Artemis 2 Mission: చూసేందుకు కాదు.. పాగా వేసేందుకు.. ‘ఆర్టెమిస్ 2’ ప్లాన్ ఇదే!

Artemis 2 Mission: చూసేందుకు కాదు.. పాగా వేసేందుకు.. ‘ఆర్టెమిస్ 2’ ప్లాన్ ఇదే!
Advertisement

Artemis 2 Mission: అంతరిక్ష పరిశోధనల్లో.. గోల్డెన్ చాప్టర్ మొదలైంది. సరిగ్గా.. అర్ధ శతాబ్దం కింద అపోలో మిషన్ ద్వారా చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టిన జ్ఞాపకాలను మోసుకుంటూనే.. అంతకంటే శక్తిమంతమైన, అత్యాధునికమైన ఆర్టెమిస్-2 ప్రయోగంతో.. నాసా మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. చంద్రుడిపైకి మానవులను పంపేందుకు ఉద్దేశించిన ఈ ప్రయోగం.. ఇప్పుడు స్పేస్ రీసెర్చ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పది రోజుల పాటు సాగే ఉత్కంఠభరిత ప్రయాణం.. భవిష్యత్తులో మార్స్ వైపు మనిషి వేయబోయే అడుగులకు బలమైన పునాదిగా కనిపిస్తోంది.

చంద్రయాత్రలో ఓరియన్ అద్భుతం

ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్ క్యాప్సూల్ జాబిల్లి వైపు దూసుకెళ్తోంది. చంద్రుడి దిశగా సాగుతున్న ప్రయాణంలో తీసిన అద్భుత దృశ్యాలను నాసా షేర్ చేసింది. ఆర్టెమిస్-2 ప్రయోగంలో భాగంగా.. ఓరియన్ క్యాప్సూల్ చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి, దానిని చుట్టి రానుంది. ప్రయోగం జరిగిన కొద్ది గంటలకే.. ఓరియన్‌లోని సోలార్ అరే కెమెరా.. అంతరిక్షం నుంచి భూమి చిత్రాలను తీసింది. ఈ ఫోటోల్లో భూమి.. నెలవంకలా కనిపిస్తోంది.

చంద్రుడి చుట్టూ ప్రత్యేక యాత్ర!

Advertisement

ఆర్టెమిస్‌-2 మిషన్‌లో.. ముగ్గురు అమెరికన్లు, ఓ కెనడావాసి భాగస్వాములయ్యారు. వీరిలో చంద్రుడి యాత్రకు వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్, తొలి నల్లజాతీయుడిగా విక్టర్ గ్లోవర్, నాసా మూన్ మిషన్‌లో పాల్గొన్న తొలి అమెరికాయేతర పౌరుడిగా జెరెమీ హాన్సెన్ చరిత్ర సృష్టించారు. వీళ్లంతా చందమామపై కాలు మోపకుండా.. దూరం నుంచే జాబిల్లిని చుట్టి వేస్తారు. జాబిల్లి యాత్రకు నిర్దేశించిన రాకెట్, స్పేస్ షిప్‌లోని కీలక వ్యవస్థల పనితీరుని మదించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. ఓరియన్ క్యాప్సూల్‌‌‌‌‌‌‌‌లోని వాటర్ డిస్పెన్సర్, టాయిలెట్ లాంటి కొత్త వ్యవస్థలను కూడా పరీక్షిస్తున్నారు. ప్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే టాయిలెట్‌‌‌‌‌‌‌‌లో చిన్న సమస్య తలెత్తడంతో, ప్రత్యామ్నాయ పద్ధతులను వాడాలని నాసా సూచించింది. పది రోజుల పాటు సాగే ఈ యాత్రతో.. అంతరిక్ష నౌక పనితీరును, భూమి నుంచి పంపే సంకేతాల సమన్వయాన్ని, మానవ మనుగడకు అవసరమైన వ్యవస్థల సామర్థ్యాన్ని నాసా టెస్ట్ చేస్తుంది.

అంతరిక్షంలోనే జీవన విధానం పరీక్ష

ఓరియాన్ క్రూ మాడ్యూల్‌కు 50 ఏళ్ల కిందటి అపోలో మిషన్లలో ఉపయోగించిన మాడ్యూల్‌లతో పోలిక ఉన్నా, లోపలి నిర్మాణం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ కాస్త స్థలంలోనే నలుగురు ఆస్ట్రోనాట్స్ పనిచేయాలి. భారరహిత వాతావరణంలో స్పేస్‌క్రాఫ్ట్‌ మొత్తాన్ని వాడుకునే వీలుంటుంది కాబట్టి, కంట్రోల్ ప్యానెల్ సీలింగ్‌ మీద అమర్చి ఉండొచ్చు. తాగడానికి, ఆహారంలో వాడుకోవడానికి నీటి సప్లై మిషన్ ఉంది. హ్యాచ్ కింద ఉన్న చిన్న మెట్టుని ఎక్సర్‌సైజ్ మిషన్‌లాగా వాడుకునే వీలుంది. వ్యోమగాములు రోజుకు 30 నిమిషాల పాటు కార్డియో, రెసిస్టెన్స్ ట్రైనింగ్‌‌ లాంటి ఎక్సర్‌సైజులు చేయాల్సి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన మరో పరికరం కింద ఉంటుంది. అదే, టాయిలెట్. 50 ఏళ్ల కిందట అపోలో వ్యోమగాములకు ఇది అందుబాటులో లేదు. అంతరిక్షంలో శరీర అవసరాలను తీర్చడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. స్పేస్‌క్రాఫ్ట్‌లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో మానిటర్ చేస్తూ ఉండటంతో పాటు తమ పరిస్థితిని కూడా పరిశీలించుకుంటూ ఉంటారు.

చంద్రుడి అవతలి వైపు మానవ యాత్ర

Advertisement

ఆర్టెమిస్-2 ప్రయోగంలో.. మనం భూమి నుంచి చూడలేని చంద్రుడి అవతలి వైపు చుట్టూ ప్రయాణిస్తారు. చంద్రుడిని మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీలుగా ఓరియాన్ చంద్రుని వైపు ఉంటుంది. వ్యోమగాములకు చంద్రుడిని చూసేందుకు, ఫోటోలు తీసేందుకు, జియాలజీ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు 3 గంటల సమయం ఉంటుంది. ఇది భవిష్యత్తులో చంద్రుడిపై దిగేందుకు ప్రణాళికలు, సన్నాహాలకు సాయపడుతుంది. ఓరియాన్ కిటికీల ద్వారా ముందుభాగంలో చంద్రుడిని దగ్గరగా, వెనుకనుంచి భూమిని ఒకేసారి చూడగలుగుతారు. భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులను దించడానికి చేపట్టే ఆర్టెమిస్-3 మిషన్‌‌కి.. ఈ ప్రయోగం కీలకమైన పునాదిగా నిలవనుంది. ఇప్పుడు వెళ్లిన వ్యోమగాములు చంద్రుడిపై దిగకుండా.. జాబిల్లికి అవతలి వైపు సుమారు 6,400 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లి వస్తారు. ఇంత దూరం వెళ్లిన మానవులుగా.. వీళ్లంతా రికార్డు సృష్టించనున్నారు.

చంద్రుడి రహస్యాలు వెలికితీసే ప్రయత్నం

1972లో జరిగిన అపోలో 17 తర్వాత మానవులు చంద్రుడి వైపు పయనమయ్యారు. ఏళ్ల తరబడి జాప్యం, భారీ వ్యయ ప్రయాసల తర్వాత ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నలుగురు వ్యోమగాములు 8 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, చంద్రుడి చుట్టూ తిరిగి భూమికి చేరుకుంటారు. ఈ యాత్ర ఓ అద్భుతమే కాదు, ప్రమాదకరమైనది కూడా. అన్నీ అనుకూలంగా ఉంటే, ఈ మిషన్ చంద్రుడి అద్భుత దృశ్యాలను చూపిస్తుంది. జాబిల్లి చుట్టూ ఉన్న వాతావరణంపై కొత్త సమాచారాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో చంద్రుడిపై దిగడం, అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం లాంటి వాటికి రూట్ క్లియర్ చేసే మిషన్ ఇది. మరో గ్రహంపై ఎలా జీవించాలో మనిషి నేర్చుకునే తొలి అడుగు ఈ ఆర్టెమిస్ 2 మిషన్.

చంద్రుడి చుట్టూ స్పేస్ స్టేషన్ లక్ష్యం

మానవరహిత ఆర్టెమిస్-1 మిషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆర్టెమిస్-2 ద్వారా తొలిసారి నలుగురు వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలోకి వెళ్తారు. 1972 అపోలో-17 తర్వాత మనుషులు చంద్రుడి దరిదాపుల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం కేవలం ఓ స్పేస్ టూర్ కాదు. ఇది ఓ సంక్లిష్టమైన సాంకేతిక పరీక్ష. ఓరియన్ క్యాప్సూల్‌లోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కమ్యూనికేషన్, కంట్రోలింగ్ సిస్టమ్.. అంతరిక్షంలో ఎలా పనిచేస్తాయో ఈ మిషన్ తేల్చనుంది. భూమికి వేల మైళ్ల దూరంలో, రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట మానవ శరీరం ఎలా స్పందిస్తుందనేది అధ్యయనం చేయడానికి ఇది కీలకం. చంద్రుడి చుట్టూ ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే ప్రణాళికలో ఇది మొదటి అడుగు అని చెప్పాలి. ఈ మిషన్ కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్.. స్పేస్ లాంఛ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది దాదాపు 9 మిలియన్ పౌండ్ల థ్రస్ట్‌ని ఉత్పత్తి చేస్తుంది.

భూమిపైకి రీఎంట్రీలోనే అసలు పరీక్ష!

చంద్రుడి చుట్టూ తిరిగి.. భూమిపైకి చేరుకునేందుకు నాలుగు రోజులు పడుతుంది. ఈ మిషన్ చివరి దశ అత్యంత ప్రమాదకరమైనది. ఈ చివరి దశలో స్పేస్‌క్రాఫ్ట్‌లోని మిగిలిన భాగం నుంచి సిబ్బంది ఉండే మాడ్యూల్ వేరు పడుతుంది. క్యాప్సూల్ తిరగడం మొదలవుతుంది, అది భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఉత్పన్నమయ్యే తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకుని, వ్యోమగాములను లోపల సురక్షితంగా ఉంచుతుంది. ఈ స్పేస్ షిప్ గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి దూసుకొస్తుంది. సుమారు 2,700 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. తొలి మానవ రహిత ఆర్టెమిస్ మిషన్‌లో హీట్ షీల్డ్ తీవ్రంగా దెబ్బతినడంతో.. దానిపై ఫోకస్ పెట్టారు. భూవాతావరణంలోకి ప్రవేశించే కోణాన్ని సర్దుబాటు చేసి సమస్యని పరిష్కరించారు. వ్యోమగాములు పసిఫిక్ సముద్రంలో, కాలిఫోర్నియా తీరానికి సమీపంలో నెమ్మదిగా ల్యాండ్ అవుతారు. తిరిగి సేఫ్‌గా భూమిపైకి చేరడమే.. ఈ మిషన్‌లో అత్యంత కీలక ఘట్టం.

అంతరిక్ష యాత్రలో క్లైమాక్స్

ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, మానవ చరిత్రలో మరో అద్భుత ఘట్టానికి ఆర్టెమిస్ 3 వేదిక కానుంది. అపోలో 17 తర్వాత మళ్లీ మనుషులు చంద్రుడిపై అడుగుపెట్టే తొలి మిషన్ ఇదే. గతంలో నాసా చేపట్టిన అపోలో మిషన్లు చంద్రుడి మధ్య భాగంలో దిగగా, ఆర్టెమిస్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతుంది. అక్కడ శాశ్వతంగా చీకటిగా ఉండే క్రేటర్లలో నీటి మంచు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో చంద్రుడిపై స్థావరాలు ఏర్పరచుకోవడానికి ఈ నీరే చాలా కీలకం.

అందువల్ల.. ఇప్పుడు గనక ఆర్టెమిస్-2 సక్సెస్ అయితే, అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. స్పేస్ టూరిజం, మూన్ మైనింగ్ లాంటి అంశాలకు ఓ గేట్‌వేగా మారుతుంది. చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, అక్కడ లభించే వనరులను ఉపయోగించుకుని.. మార్స్‌పైకి వెళ్లడం సైంటిస్టుల అంతిమ లక్ష్యం. అపోలో మిషన్లు కేవలం చంద్రుడిపై వెళ్లి రావడం మీదే దృష్టి పెట్టాయి. కానీ ఆర్టెమిస్ మానవులు అక్కడ నివసించడం కోసం సిద్ధమవుతోంది. ఆర్టెమిస్-2 విజయవంతమైతే, మానవ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం మొదలవుతుంది. ఇది కేవలం ఓ దేశానికో, సంస్థకో సంబంధించిన విజయం కాదు.. అనంత విశ్వాన్ని జయించాలనుకునే మానవుడి ఆకాంక్షకు ప్రతిరూపం.

Also Read:  స్నానం చేయాలన్నా భయం.. కునుకు తీయాలంటే వణుకు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఇరాన్ ప్రజల దుస్థితి

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×