E-Paper
Advertisement

Iran War: స్నానం చేయాలన్నా భయం.. కునుకు తీయాలంటే వణుకు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఇరాన్ ప్రజల దుస్థితి

Iran War: స్నానం చేయాలన్నా భయం.. కునుకు తీయాలంటే వణుకు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఇరాన్ ప్రజల దుస్థితి
Advertisement

Iran War: యుద్ధం అంటే.. వరుస దాడులు, పేలే బాంబులు, కూలిపోయే భవనాలు మాత్రమే కాదు. ఆ శబ్దాల మధ్య, భయాల మధ్య నలిగిపోయే సామాన్యుల ప్రాణాలు కోట్లలో ఉంటాయ్. ఇప్పుడు.. ఇరాన్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఆధిపత్యం కోసం కొనసాగుతున్న యుద్ధం.. ఇరాన్ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. ఇజ్రాయెల్ మిసైళ్లు, అమెరికా వ్యూహాత్మక దాడుల మధ్య.. ఇరాన్ అనిశ్చితి కోరల్లో చిక్కుకుంది. దేశమంతా.. ఆందోళనల సుడిగుండంలో పడి తిరుగుతోంది. యుద్ధ మేఘాల చాటున చిక్కి విలవిలలాడుతోంది. బాంబు దాడులు, మిసైల్ ఎటాక్స్.. ఇరాన్ సైనిక స్థావరాలనే కాదు, అక్కడి సామాన్యుల స్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడా దెబ్బతీశాయ్.

యుద్ధం నీడలో జీవితం

యుద్ధంలో జనజీవనం ఎలా ఉంటుందో, ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో.. ఎక్కడో కూర్చొని టీవీల్లో చూసేవాళ్లకు తెలియదు. అనుభవించే వాళ్లకే అర్థమవుతుంది.. అనుక్షణం మృత్యు భయం ఎంతలా టెన్షన్ పెడుతుందో! చావు ఎప్పుడొస్తుందో.. ఎలా వస్తుంది తెలియదు. ప్రతి శబ్దం.. ఓ బాంబు పేలుడులానే వినిపిస్తుంది. టెహ్రాన్ వీధుల్లో ఒకప్పుడు కనిపించిన సందడి స్థానంలో ఇప్పుడు సైరన్ల మోత వినిపిస్తోంది. బతుకు మీద తీపి ఉన్నా, భవిష్యత్ మీద ఎన్నో ఆశలున్నా.. రేపటి రోజున ఉంటామో, లేదోనన్న భయం అక్కడి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఎప్పుడు ఎక్కడి నుంచి మిసైల్ వస్తుందో?

Advertisement

ఇజ్రాయెల్-అమెరికా నిరంతర దాడులు.. ఇరాన్ వ్యాప్తంగా జనజీవనాన్ని మార్చేశాయ్. వరుస దాడులతో.. లక్షలాది మంది భయంలో బతుకుతున్నారు. నిరంతర ఎయిర్ స్ట్రైక్స్ వల్ల.. జనం అనుభవిస్తున్న మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో.. ప్రతి ఒక్కరూ అభద్రతా భావంలోనే బతుకుతున్నారు. ఏ క్షణం, ఏ వైపు నుంచి మిసైల్ దూసుకొచ్చి.. తాము ఉంటున్న ప్రదేశంలో పడుతుందోనని భయంభయంగా గడుపుతున్నారు.

టెహ్రాన్ నుంచి పారిపోతున్న జనాలు

పిల్లలు, మెడికల్ కేర్ అవసరమయ్యే వాళ్లున్న కుటుంబాలు.. సురక్షిత ప్రదేశాలకు తరలిపోతున్నారు. ముఖ్యంగా.. అమెరికా-ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన టెహ్రాన్ లాంటి నగరాల నుంచి చాలా మంది జనం పారిపోయారు. పగలు, రాత్రి జరిగే దాడుల నుంచి కొంత వరకు సేఫ్‌గా ఉంటాయని భావించే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇక, ముందు నుంచీ ఉన్న చోటే ఉంటున్న వాళ్లంతా.. తమ జీవితం నిరంతరం దాడుల భయంతోనే గడుస్తోందని చెబుతున్నారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోతున్నామంటున్నారు. ఎక్కడి నుంచి బాంబులు పడతాయోనని.. మెలకువగానే ఉంటున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియని ఓ శబ్దం కోసం ఎదురుచూడటం, అది వచ్చినప్పుడు.. ఏదో ఒక చోట విధ్వంసం ఖాయమని అంటున్నారు.

శబ్దం వినిపిస్తే చాలు… గుండె దడ

Advertisement

రోజువారీ పనులు, సొంత అవసరాలు కూడా ఎంతో ఒత్తిడితో కూడినవిగా మారిపోయాయ్. చాలా మందికి స్నానం చేయడం కూడా ఆందోళన కలిగించే విషంగా మారిపోయిందంటున్నారు. దాడి మధ్యలో చిక్కుకుపోతామేమోనని, బయటకు రాలేకపోతామని జనం భయపడుతున్నారు. ఇరాన్ ప్రజల జీవితంలో.. ఇప్పుడు ప్రతి క్షణం భయం, టెన్షన్‌తో నిండిపోయింది. చాలా ఇళ్లు.. ఇప్పుడు సురక్షితమైన ప్రదేశాలుగా లేవు. యుద్ధం తాలూకూ పరిస్థితులు, బాంబు దాడుల శబ్దాల నుంచి దూరంగా వెళ్లిపోతున్నారు.

సైరన్ల మధ్య కేఫ్‌లు, జాగింగ్

ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, సాధారణ స్థితిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చాలా మంది పౌరులు చెబుతున్నారు. ఈ అనిశ్చితి మధ్య తమ రొటీన్ లైఫ్‌లో భాగంగా.. వీలైనప్పుడల్లా కేఫ్‌లకు వెళ్లడం, పార్కుల్లో జాగింగ్ చేయడం, ఆరుబయట ఎక్సర్‌సైజులు చేయడం లాంటివి చేస్తున్నారు. యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలపై వస్తున్న స్పందనలు.. రకరకాలుగా ఉన్నాయ్. ప్రభుత్వ మద్దతుదారులు దీనినొక పవిత్ర యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. తాము తుది విజయం సాధించేదాకా పోరాటం కొనసాగించాలని పట్టుబడుతున్నారు.

ప్రజలపై పెరుగుతున్న ఒత్తిడి

ఇంతటి గందరగోళ పరిస్థితుల మధ్య కూడా.. దాడుల్లో మరణించిన అధికారుల అంత్యక్రియలకు హాజరవుతూనే ఉన్నారు. నగర వీధుల్లోకి వచ్చి యుద్ధానికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. లౌడ్ స్పీకర్ల ద్వారా నినాదాలు వినిపిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ మతపరమైన సంతాప గీతాలు ప్లే చేస్తున్నారు. దీని వల్ల.. ఇప్పటికే నిద్రలేని రాత్రులు గడుపుతున్న చాలా మందికి మరింత ప్రెజర్ పెరుగుతోంది. దాడులు కొనసాగడం, ప్రభుత్వ అధికారులను చంపడం లాంటివి.. ప్రస్తుత వ్యవస్థ పతనానికి దారితీయొచ్చని కొందరు ఇరానియన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ మద్దతుదారులతో ఏకీభవించని, యుద్ధం రాజకీయ మార్పును తెస్తుందని ఆశించని.. మూడో వర్గం కూడా ఇరాన్‌లో ఉంది. వీళ్లంతా.. వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నారు.

భయంతో విసిగిపోయిన ప్రజలు

యుద్ధం ముగియాలి.. దాంతో పాటు మతపరమైన పాలన కూడా ముగియాలి! ఎస్.. ఇరాన్ ప్రజల మదిలో ఉన్న విషయం ఇదేననే వార్తలు.. మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయ్. బాంబు దాడుల మధ్య ఇరాన్ పౌరుల ఆవేదనని మాటల్లో చెప్పలేం. యుద్ధం చేస్తున్న గాయాలని అక్కడి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అందుకోసమే, మతపరమైన పాలన వెళ్లిపోవాలి, యుద్ధం కూడా అంతమైపోవాలని అని కోరుకుంటున్నారు. అనుక్షణం, భయంభయంగా బతికే జీవితం ఎవరికీ దక్కొద్దంటున్నారు.

యుద్ధ భయాన్ని ప్రశ్నిస్తున్న ఇరాన్ ప్రజలు

యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లంతా.. రాత్రి పడుకునే ముందే మీ మెడలోనూ, మీ బిడ్డ మెడలోనూ విజిల్ వేలాడదీస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలియకపోతే, యుద్ధం మంచిదని చెప్పొద్దంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తామంతా, ఓ సాధారణ జీవితాన్ని తప్ప ఇంకే కోరుకోవడం లేదని చెబుతున్నారు. యుద్ధం ముగించకపోతే.. అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అసమ్మతిపై అణిచివేత తీవ్రమవడం, ఆంక్షలు కొనసాగడం, విస్తృతమైన నిరుద్యోగం, వ్యాపారాల పతనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యవసర సరుకుల ధరల్లో పెరుగుదల, విద్యుత్, నీరు, మందుల లాంటి వస్తువుల్లో కొరత ఏర్పడే అవకాశాలన్నీ ప్రజల్ని భయపెడుతున్నాయ్.

ఇరాన్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైమానిక దాడులు

ఆర్థిక ఆంక్షలు ఓ వైపు, వైమానిక దాడులు మరోవైపు.. ఈ రెండూ ఇరాన్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. ముఖ్యంగా ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఆ దేశ రక్షణ వ్యవస్థను ప్రశ్నార్థకంగా మార్చేశాయ్. ఈ పరిస్థితులతో.. ఇరాన్‌లోని పిల్లలు, వృద్ధులు తీవ్రమైన పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్‌కి గురవుతున్నాయ్. విద్యా సంస్థలు సరిగా నడవకపోవడంతో.. విద్యార్థుల భవిష్యత్ క్వశ్చన్ మార్క్‌గా మారింది.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, పొరుగు దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవుతోంది. యుద్ధ అంటే కేవలం విధ్వంసం మాత్రమే కాదు, ఓ దేశ వెన్నెముకను విరిచేస్తుంది. ఇప్పటికే, ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకాయ్. పరిశ్రమలు మూతపడటం, ఆంక్షల వల్ల ఉపాధి కరువై.. యువత దిక్కుతోచని స్థితిలో ఉంది.

దేశాన్ని కాపాడాలి… పాలన మారాలి

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులన్నీ సంక్లిష్టంగా ఉన్నాయ్. బయటకు కనిపిస్తున్న దేశభక్తి, ఐక్యత వెనుక దశాబ్దాల అసంతృప్తి, ఆర్థిక సంక్షోభం, మతపరమైన పాలనపై తీవ్ర వ్యతిరేకత దాగి ఉన్నాయ్. యుద్ధం మొదలైనప్పుడు సహజంగానే, ఏ దేశ ప్రజలైనా విదేశీ దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవాలని భావిస్తారు. ఇరాన్ విషయంలోనూ అదే జరిగింది. కానీ, జనం మదిలో అసలు విషయం వేరే ఉంది. ఇరాన్ ప్రజలకు తమ దేశం పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉంది. అందుకే, ఇజ్రాయెల్, అణెరికా దాడులను.. తమ దేశ సార్వభౌమాధికారంపై దాడిగానే చూస్తున్నారు. దేశం కోసం ఏకమవడం అంటే.. మతపరమైన పాలనని సమర్థించడం కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సామన్యులు యుద్ధం పట్ల భయంతో ఉన్నారే తప్ప, ఇప్పుడున్న పాలనపై ప్రేమతో కాదనే రిపోర్టులు వస్తున్నాయ్. యుద్ధం వల్ల జనజీవం అస్తవ్యస్తం అయ్యిందే తప్ప, వారి మనసుల్లో ఉన్న విప్లవ జ్వాల ఆరిపోలేదనే విషయం తెలుస్తోంది. ఇరాన్ యువత ఇస్లామిక్ రూల్స్ కంటే, స్వేచ్ఛా జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు.

ఇరాన్‌ను కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభం

ఈ యుద్ధం వల్ల ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆర్థిక సంక్షోభం. ఇరాన్ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యవసర ధరలు సామాన్యులకు అందకుండా పోయాయి. యుద్ధం వల్ల జరుగుతున్న విధ్వంసాన్ని, వినాశనాన్ని చూసి వణికిపోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతింటే, జీవనం అస్తవ్యస్తం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. యుద్ధం కంటే శాంతి, ఆర్థిక స్థిరత్వం, నియంతృత్వం నుంచి విముక్తి కావాలని బలంగా కోరుకుంటున్నారు.

యుద్ధం గెలిచినా… మానవత్వం ఓడిపోతుంది

ఇజ్రాయెల్-అమెరికా దాడులు.. ఇరాన్ ప్రజల్ని ఓ తాటిపైకి తెచ్చినట్లు కనిపించినా, అదంతా తాత్కాలికమే. ఇరాన్ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను, స్వేచ్ఛని విస్మరించి, ప్రతీకారం కోసం యుద్ధం వైపు అడుగులు వేస్తే.. ఈ అంతర్గత అసంతృప్తి మరో భారీ పబ్లిక్ రెవల్యూషన్‌కి దారితీసే అవకాశం ఉంది. ఇరాన్ ప్రజలు ఇప్పుడు యుద్ధం, మరోవైపు అంతర్గత అణిచివేత మధ్య నలిగిపోతున్నారు. యుద్ధం గెలుపోటములను నిర్ణయించొచ్చు. కానీ, మానవత్వాన్ని మాత్రం ఓడిస్తుంది. ఇరాన్ ప్రజల కళ్లలో మళ్లీ వెలుగులు నిండాలంటే.. యుద్ధం ఆగాల్సిందే!

Also Read:అమరావతి సాక్షిగా పొలిటికల్ రీ-ఎంట్రీ.. విజయసాయిరెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×