E-Paper
Advertisement

Anil Ambani: ఎప్‌స్టీన్ ‘బ్లాక్ బుక్’లో అనిల్ అంబానీ పేరు.. బయటపడ్డ షాకింగ్ వాట్సాప్ చాట్స్!

Anil Ambani: ఎప్‌స్టీన్ ‘బ్లాక్ బుక్’లో అనిల్ అంబానీ పేరు.. బయటపడ్డ షాకింగ్ వాట్సాప్ చాట్స్!
Advertisement

Anil Ambani: ఎప్‌స్టీన్ ఫైల్స్.. హాలీవుడ్ నుంచి వైట్ హౌజ్ దాకా, అమెరికా నుంచి ప్రపంచ దేశాల దాకా.. అన్ని చోట్లా ప్రకంపనలు సృష్టిస్తోంది, తీవ్ర కలకలం రేపుతోంది ఈ స్కాండల్. లైంగిక వేధింపులు, మైనర్ల అక్రమ రవాణా లాంటి ఘోరమైన ఆరోపణలు ఎదుర్కొన్న.. ఈ అమెరికన్ ఫైనాన్సర్ నెట్‌వర్క్ ఎంతటిదో, ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్ ద్వారా ప్రపంచానికి తెలుస్తోంది. రాజకుటుంబీకులు, ధనవంతులు, రాయబారులు, దౌత్యాధికారులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు.. ఇలా ఎంతో మంది ప్రముఖుల గౌరవ, మర్యాదలను మంటగలిపే విషయాలన్నీ బయటకొస్తున్నాయ్. కొందరు పదవులను వీడాల్సిన పరిస్థితీ తలెత్తుతోంది. అయితే, ఈ సంచలన జాబితాలో భారతీయ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా ఉండటం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు.. వీరిద్దరి మధ్య సంబంధమేంటి? ఆ మూడేళ్ల గ్యాప్‌లో ఏం జరిగింది?

ఎప్‌స్టీన్–అనిల్ అంబానీ కమ్యూనికేషన్‌పై సంచలన ఆరోపణలు

లైంగిక నేరాల నిందితుడు ఎప్‌స్టీన్, అనిల్‌ అంబానీ మధ్య 2017 నుంచి 2019 వరకు కొనసాగించిన సంభాషణలు, సందేశాలు ఇప్పుడు బయటపడ్డాయ్. అమెరికా అధికారులు.. ఎప్‌స్టీన్‌పై లైంగిక నేరాల అభియోగాలు మోపటానికి, కొన్ని నెలల ముందు వరకూ ఇవి కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యవహారాలు, వ్యాపారాలు, మహిళలు, పర్సనల్ మీటింగ్‌ల ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. ఓ సందర్భంలో స్వీడిష్ మహిళను అనిల్ అంబానీకి ఆఫర్ చేసిన విషయం, పారిస్ నగరంలో సమావేశం ప్రణాళికలు, 2018లో దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై.. ట్రంప్ కామెంట్స్‌కి రియాక్షన్, 2019లో న్యూయార్క్‌కు వస్తే.. ఎప్‌స్టీన్ నివాసంలో కలుసుకోవాలని నిర్ణయించడం లాంటి అనేక విషయాలు బహిర్గతం అయ్యాయ్. అంతేకాదు.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తీసిన సినిమాలకు హీరోయిన్లని సెలక్ట్ చేసే విషయాలు కూడా ఎప్‌స్టీన్‌తో చర్చించినట్లు ఫైల్స్‌లో తేలింది. అంతేకాదు.. సువిశాలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ధీరూభాయ్ అంబానీపై వచ్చిన పుస్తకాలను కూడా ఎప్‌స్టీన్ ప్రత్యేకంగా తెప్పించినట్లు తెలుస్తోంది.

ప్రపంచ శక్తివంతుల నెట్‌వర్క్‌లో అంబానీ పేరు?

Advertisement

జెఫ్రీ ఎప్‌స్టీన్ కేవలం ఓ నేరగాడు మాత్రమే కాదు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, రాజకీయ నేతలు, ఇన్‌ఫ్లుయెన్సర్లతో సంబంధాలున్న ఓ నెట్‌వర్కర్. రిపోర్ట్స్ ప్రకారం, 2017 ఫిబ్రవరిలో.. ఓ వ్యక్తి ద్వారా అనిల్ అంబానీకి ఎప్‌స్టీన్ పరిచయమైనట్లు తెలుస్తోంది. అమెరికాలోని వైట్ హౌస్ అధికారులతో, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, వ్యూహకర్త స్టీవ్ బానన్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అనిల్ అంబానీ ఎప్‌స్టీన్ సహాయం కోరినట్లు తెలుస్తోంది. కోర్టు పత్రాలు, బయటపడిన ఈ-మెయిల్స్ ఆధారంగా.. అనిల్ అంబానీ, ఎప్‌స్టీన్ మధ్య అనేకసార్లు సమాచార మార్పిడి జరిగినట్లు సమాచారం. ప్రపంచ వ్యవహారాలు, బిజినెస్, మహిళల గురించి, ఇద్దరూ మాట్లాడుకున్నారని, వ్యక్తిగతంగా కలిసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయ్. 2017 మార్చిలో.. ఎప్‌స్టీన్, అనిల్ అంబానీ మధ్య జరిగిన సందేశాల్లో.. మీరు ఎవరిని సూచిస్తారని అనిల్ అంబానీ అడిగారని, మీ టూర్‌ సరదాగా సాగేందుకు.. అందంగా, పొడుగ్గా ఉండే స్వీడన్ మహిళను ఏర్పాటు చేస్తానని ఎప్‌స్టీన్ రిప్లై ఇచ్చాడని, కొద్ది క్షణాల్లోనే ఏర్పాటు చేయండని అంబానీ స్పందించారని రిపోర్టుల్లో ఉంది.

ఎప్‌స్టీన్ ఇంట్లో అనిల్ అంబానీ భేటీ?

అనిల్ అంబానీ, ఎప్‌స్టీన్‌తో సంబంధం ఉన్న ఫోన్ నెంబర్ మధ్య జరిగిన టెక్ట్స్ మెసేజ్‌లని బట్టి.. 2018లో ఇద్దరూ పారిస్‌లో కలిసేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కానీ, ఇద్దరూ కలవలేకపోయారు. 2018 జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డొనాల్డ్ ట్రంప్ స్పందన గురించి కూడా మాట్లాడుకున్నట్లు ఎప్‌స్టీన్ ఫైల్స్ చెబుతున్నాయ్. ఆ తర్వాత.. 2019 మేలో, న్యూయార్క్ పర్యటనకు వస్తున్నట్లు అనిల్ అంబానీ చెప్పగా, ఎప్‌స్టీన్ ఆహ్వానం పలుకుతూ.. ఎలాంటి వ్యక్తులు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారో చెప్పండని రిప్లై ఇచ్చారని తెలుస్తోంది. మన్‌హట్టన్‌లోని ఎప్‌స్టీన్ ఇంట్లో సమావేశం జరిగినట్లు ఫైల్స్ చూపుతున్నాయ్. ఎప్‌స్టీన్ తన సహచరులకు పంపిన సందేశంలో.. అనిల్ అంబానీని కలిసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. తన పరపతి పెంచుకోడానికి, వ్యాపార, రాజకీయ ప్రముఖులకు మైనర్లను ఎరగా వేశారనే ఆరోపణలను.. ఎప్‌స్టీన్ 2008లో అంగీకరించారు. ఆ తర్వాత కూడా అతడి విస్తృత వ్యాపార, సామాజిక సంబంధాలు కొనసాగినట్లు.. తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాలు బట్టబయలు చేశాయ్.

ఎప్‌స్టీన్ సహాయం కోరిన అనిల్ అంబానీ

Advertisement

అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాల ప్రకారం.. అనిల్ అంబానీ, ఎప్‌స్టీన్ మధ్య 2017 నుంచి 2019 వరకు నిరంతర సంభాషణలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సంబంధం కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదని, ఇందులో అంతర్జాతీయ దౌత్యం, రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయని రిపోర్ట్ చెబుతున్నాయ్. 2017లో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు ముందే, ట్రంప్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో భేటీ కోసం అనిల్ అంబానీ.. ఎప్‌స్టీన్ సహాయం కోరినట్లు ఈ ఫైల్స్ ద్వారా తెలుస్తోంది. తన డిఫెన్స్ బిజినెస్‌ని విస్తరించుకునేందుకు ప్రముఖులతో సంబంధాలు కుదుర్చుకునేందుకు.. ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌ని అనిల్ వాడుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. 2019లో అనిల్ అంబానీ కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సుమారు 750 మిలియన్ డాలర్ల వ్యక్తిగత రుణం పొందేందుకు దివాలా-రహిత మార్గాలపై ఎప్‌స్టీన్ సలహాలు కోరినట్లు కూడా ఫైల్స్‌లో ఉంది.

అనిల్ అంబానీపై ఆరోపణలు

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో.. అనిల్ అంబానీ, జెఫ్రీ మధ్య జరిగిన సంభాషణలు, సందేశాల్లో.. లీడర్‌షిప్ ఇన్ ఢిల్లీ అనే పదం ఉండటం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. స్టీవ్ బానన్‌కు పంపిన మెసేజ్‌లలో, అనిల్ అంబానీని, ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడిగా ఎప్‌స్టీన్ పరిచయం చేసినట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీ ఎప్‌స్టీన్ ద్వారా కేవలం తన సొంత వ్యాపారాల కోసం కాకుండా, ప్రభుత్వ స్థాయి పనుల కోసం లైజనింగ్‌లా వ్యవహరించారా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ఎప్‌స్టీన్ అడ్రస్ బుక్‌లో అనిల్ పేరు ఉండటమే కాదు, భారత రాయబారిగా ఎవరిని నియమించాలనే విషయంలోనూ వీళ్లిద్దరూ చర్చించకున్నట్లు సమాచారం. అమెరికా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో యాక్సెస్ కోసం ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌ను వాడుకోవాలని అనిల్ అంబానీ భావించారు. తన రక్షణ రంగ వ్యాపారాన్ని విస్తరించడానికి, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు సమీకరించడానికి ఎప్‌స్టీన్ సలహాలు కోరినట్లు తెలుస్తోంది. ఎప్‌స్టీన్‌కు ఉన్న పొలిటికల్ కనెక్షన్స్ ద్వారా తన వ్యాపారాలను గట్టెక్కించుకోవాలని అనిల్ భావించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

ఎప్‌స్టీన్‌తో అనిల్ అంబానీ కనెక్షన్‌పై సందేహాలు

సాధారణంగా ఎప్‌స్టీన్ లాంటి వ్యక్తులతో.. బిజినెస్ టైకూన్లు చేతులు కలిపేందుకు ప్రధాన కారణం యాక్సెస్. ఎప్‌స్టీన్ దగ్గర ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల కాంటాక్ట్స్ ఉండేవి. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనిల్ అంబానీ, అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పట్టు సాధించడానికి.. ఈ నెట్‌వర్క్‌ని ఉపయోగించుకోవాలని చూసి ఉండొచ్చు. అయితే, వీరి మధ్య జరిగిన చర్చలు కేవలం వ్యాపారపరమైనవా? లేక వ్యక్తిగతమైనవా అనేది ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది. అయితే.. ఎప్‌స్టీన్ మీద ఉన్న చీకటి ఆరోపణలతో.. అతనితో చిన్న కనెక్షన్ ఉన్నా, అది ఇప్పుడు పెద్దదిగానే కనిపిస్తోంది. అదో నేరమనే భావనే వ్యక్తమవుతోంది. అయితే, అనిల్ అంబానీపై ఎలాంటి నేరారోపణలు రుజువు కాలేదు. కేవలం పరిచయం, వ్యాపార చర్చలు అనే ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. ఎప్‌స్టీన్ స్కాండల్ భారత్‌ను తాకడమనేది కేవలం ఓ వ్యాపారవేత్త వ్యక్తిగత విషయం కాదు. ఇది అంతర్జాతీయ సంబంధాల్లో కార్పొరేట్ శక్తుల జోక్యం ఎంతవరకు ఉందనే దానిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అనిల్ అంబానీ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Also Read: ఎప్స్టీన్‌ ఫైల్స్‌లో అనిల్ అంబానీ.. ఇంకా పెద్దపెద్దోళ్లు, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Story by: Anup, Big TV

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×