Firecracker Explosions: ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలు.. డెత సెంటర్లుగా మారుతున్నాయ్. ఏపీ, తమిళనాడు, కేరళ.. ఇలా ప్రాంతమేదైనా పేలుడు కామనైపోయింది. బతుకులు బుగ్గిపాలవడం సాధారణంగా మారింది. ఆనందాల వెలుగులు విరజిమ్మాల్సిన బాణాసంచా.. ఇప్పుడు కాలిపోయిన కార్మికుల శవాలకు సాక్ష్యమవుతోంది. ఆ వెలుగుల్లోనే.. ఎందరో కార్మికుల జీవితాలు చీకటిమయమవుతున్నాయ్. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారుల్లో చలనం లేకపోవడం, యాజమాన్యాల నిర్లక్ష్యంతో.. అభాగ్యులైన కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్. కేరళలో 13 మంది, తమిళనాడులో 20 మంది, ఆంధ్రప్రదేశ్‌లో పదుల సంఖ్యలో కార్మికుల మరణాలు.. కేవలం అంకెలు మాత్రమే కాదు, చితికిపోయిన కుటుంబాల వేదనకు సాక్ష్యం.
ఇటీవలే కేరళంలోని త్రిస్సూర్ జిల్లాలోని బాణసంచా తయారీ యూనిట్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తీవ్రతకు వీరి శరీరాలు ఛిద్రమైపోయాయ్. పేలుడు శబ్దాలు కిలోమీటర్ల మేర వినిపించాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 70 శాతం కాలిన గాయాలతో త్రిస్సూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నెల 26న నిర్వహించనున్న త్రిస్సూర్ పూరమ్ పండుగ కోసం స్థానికంగా ఉన్న పొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో బాణసంచా తయారీ చేపట్టారు. ఈ క్రమంలోనే.. పేలుళ్లు సంభవించాయ్. పేలుళ్లు మొదలైనప్పుడు అక్కడ 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దాంతో.. భారీ ప్రాణ నష్టం తప్పింది.
తమిళనాడులోనూ కొద్ది రోజుల ముందు ఇలాంటి పెను విషాదం చోటు చేసుకుంది. విరుధునగర్ జిల్లా కట్టనార్‌పట్టి ప్రాంతంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర శభ్దాలు వినిపించాయ్. బాణసంచా తయారీ యూనిట్‌లోని నాలుగు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
బాణసంచా యూనిట్లలో చిన్న పొరపాటు జరిగినా, అది పెను ప్రమాదానికి దారితీస్త్తోంది. ఉష్ణోగ్రతలు పెరగడం, కెమికల్స్ మిక్సింగ్‌లో అజాగ్రత్తతో.. క్షణాల్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఇదే ఏడాది ఏపీలోని సామర్లకోట మండలంలో అత్యంత విషాదకరమైన బాణాసంచా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బాణాసంచా పేలుళ్లలో ఒకటిగా నిలిచింది. ఈ పేలుడులో.. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా మహిళా కార్మికులే ఉన్నారు. పది మందికి పైగా గాయపడ్డారు.
రాయవరం బాణాసంచా తయారీ కేంద్రలో పేలుడు
పేలుడు ధాటికి ఫ్యాక్టరీ షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కెమికల్ డ్రమ్స్‌లో ఏర్పడిన నిప్పు రవ్వ కారణంగా ఈ భారీ పేలుడు సంభవించినట్లు గుర్తించారు. ఫ్యాక్టరీలో కేవలం 8 మంది కార్మికులకు మాత్రమే అనుమతి ఉండగా, ప్రమాద సమయంలో సుమారు 35 మంది వరకు పని చేస్తున్నట్లు తేలింది. అంతకుముందు.. కోనసీమలోని రాయవరం మండలంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
భయం మధ్య బతుకుతున్న కార్మికులు
ఈ వరుస పేలుడు ఘటనలు చూశాక ఒక్క విషయం క్లియర్‌గా అర్థమైంది. బాణసంచా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు.. ఉదయం వెళ్తే, సాయంత్రం తిరిగి ఇంటికి వస్తారనే నమ్మకం లేదు. అడుగు తీసి అడుగు వేస్తే పేలుడు సంభవిస్తుందేమో అన్న భయం మధ్యే బతుకుతున్నారు. వ్యవస్థలో మార్పు రాకపోతే, అధికారుల బాధ్యతారాహిత్యం ఇలాగే కొనసాగితే.. మరిన్ని ప్రాణాలు బుగ్గి కావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
Also Read: తమిళనాడులో ‘దళపతి’ రాజకీయం.. ఓట్ల చీలిక ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?