Tamil Nadu: విజయ్ కింగ్ మేకర్ అవుతారా ? రెండు కూటముల్లో ఎవరి ఓట్ బ్యాంక్ డ్యామేజ్ చేస్తారు ? తమిళనాడులో ఉన్న పొలిటికల్ వాక్యూమ్‌ను విజయ్ పార్టీ ఫిల్ చేయగలదా ? వరుస వివాదాలు వచ్చినా.. సినిమా రిలీజ్ ఆగినా.. విడాకుల ఇష్యూ రైజ్ చేసినా.. ఏ కూటమిలో చేరకుండా.. ఒంటరిగా పోటీ చేశాడు తనను చూడటానికి వచ్చిన ఫ్యాన్స్.. ఓట్ వేశారా, లేదా? అసలేం జరిగింది?
తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ఎంట్రీ ఒక సంచలనం. 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం- TVK చుట్టూ జరుగుతున్న రాజకీయ విశ్లేషణలు ఎలాంటివి? అని పరిశీలిస్తే.. ప్రస్తుత అంచనాల ప్రకారం, విజయ్ నేరుగా కింగ్ అయ్యే అవకాశాల కంటే, కింగ్ మేకర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న DMK, AIADMK రాజకీయాలను చీల్చి, విజయ్ కనీసం 20-25 శాతం ఓట్ షేర్ సాధించగలిగితే పరిస్థితి మరోలా ఉంటుంది.. ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో విజయ్ మద్దతు కీలకం అవుతుంది. అయితే, ఆయన ఒంటరి పోరు నిర్ణయం వల్ల ఓట్లు చీలి, అది పరోక్షంగా అధికార పక్షానికి లేదా ప్రతిపక్షానికి లాభం చేకూర్చవచ్చన్న అంచనాలున్నాయి. అలా విజయ్ కింగ్ మేకర్ అయ్యేలా కనిపిస్తోందని అంటారు కొందరు తమిళ విశ్లేషకులు.
ఏ కూటమి ఓట్ బ్యాంక్ దెబ్బతింటుంది? విజయ్ ఎంట్రీ వల్ల ప్రధానంగా రెండు కూటములకు ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది? అని పరిశీలిస్తే.. విజయ్ తనను తాను సెక్యులర్ నాయకుడిగా ప్రకటించుకున్నారు. దీనివల్ల DMK వైపు ఉండే యువత, మైనారిటీ ఓట్లు మొదటిసారి ఓటు వేసే వారు విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. జయలలిత మరణం తర్వాత AIADMKలో ఏర్పడిన గందరగోళం వల్ల.. ఆ పార్టీకి దూరమైన తటస్థ ఓటర్లను, ముఖ్యంగా మహిళా ఓటర్లను విజయ్ ఆకర్షించవచ్చు. విజయ్ పరోక్షంగా ప్రతిపక్ష ఓట్లను చీల్చడం వల్ల అది అధికార DMK కి బెనిఫిట్ అవుతుందని భావిస్తున్నారు కొందరు విశ్లేషకులు .
ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పొలిటికల్ వాక్యూమ్‌ను భర్తీ చేయగలరా? అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే. జయలలిత, కరుణానిధి వంటి సినీ దిగ్గజాల తర్వాత తమిళనాడులో ఒక బలమైన చరిష్మాటిక్ లీడర్ స్పేస్ అయితే కనిపిస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడం, కమల్ హాసన్ ప్రభావం బాగా పరిమితం కావడం, అజిత్ రాజకీయాల వైపే చూడక పోవడం.. వంటి కారణాలు విజయ్ కి బాగా ప్లస్. బేసిగ్గా జయలలిత అజిత్ ని తన తర్వాతి వారసుడిగా తీర్చిదిద్దే యత్నం చేశారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో ఆ లెగసి అలాగే మిగిలిపోయింది. ఇక రాజకీయాల్లోకి వస్తారన్న రజనీ అనారోగ్య కారణాలతో సైడ్ అయిపోయారు.
ఇప్పుడు చూస్తే స్టాలిన్ కే తన సపోర్ట్ అంటున్నారు. కమల్ సైతం తనదీ, స్టాలిన్ ది డార్విన్ గోత్రం అంటూ కొత్త నిర్వచనాలు చెబుతున్నారు. ఉదయ సూర్యుడికే జై కొడుతున్నారు. దానికి తోడు ఆయన్ను డీఎంకే రాజ్యసభకు సైతం పంపడంతో కమల్ కి సొంతంగా ఒక పార్టీ ఉన్నా ఆయన సెమీ డీఎంకే లీడర్ గానే పరిగణించాల్సి వస్తోంది. దీంతో తమిళనాట జయ, కరుణ స్థానాన్ని విజయ్ భర్తీ చేస్తారని విశ్వసిస్తున్నారు ఆయన అభిమానులు. అయితే, కేవలం సినిమా ఇమేజ్ సరిపోదని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేకపోవడం విజయ్‌కు పెద్ద మైనస్ అనీ అంటారు కొందరు పొలిటికల్ ఎనలిస్టులు.
సినిమా రిలీజ్ సమస్యలు, వ్యక్తిగత జీవితంలోని విడాకుల పుకార్లు వంటి వాటిని విజయ్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. ఏ కూటమితో పొత్తు పెట్టుకోకుండా.. 234 స్థానాల్లో పోటీ చేయడం ఆయన ధైర్యానికి నిదర్శనం. ఒకవేళ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటే బి-టీమ్ అనే ముద్ర పడుతుందనే భయంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ విచిత్రంగా ఆయన తనకు తెలీకుండా తాను అధికార పార్టీకి బీటీంగా మారే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
ఇక ఫ్యాన్స్ ఓటర్లుగా మారతారా? అని చూస్తే.. సినిమా స్టార్లు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఇదే. గతంలో DMDK స్థాపించిన విజయకాంత్ ఫ్యాన్స్ ఓటర్లుగా మారి మంచి ఫలితాలు సాధించారు. కానీ కమల్ హాసన్ విషయంలో అది జరగలేదు. అయితే విజయ్ కు మక్కల్ ఇయక్కం అనే అభిమాన సంఘానికి చెందిన భారీ నెట్‌వర్క్ ఉంది. వారు కేవలం ఈలలు వేయడానికే పరిమితం కాకుండా, బూత్ లెవల్‌లో ఓట్లు వేయించగలిగితేనే విజయ్ రాజకీయ భవిష్యత్తు మారుతుందన్న అంచనాలున్నాయి. విజయ్ రాకతో.. 2026 ఎన్నికలు మల్టీ-కార్నర్ ఫైట్‌గా మారబోతున్నాయి. ఆయన గెలిచినా ఓడినా, తమిళనాడు రాజకీయ సమీకరణాలను మాత్రం పూర్తిగా మార్చేస్తారనడంలో సందేహం లేదంటారు విశ్లేషకులు.
ఎవరి ఓట్లు ఎక్కువగా చీలుతాయి? అని పరిశీలిస్తే.. సర్వేల ప్రకారం విజయ్ ప్రధానంగా ప్రతిపక్షాల ఓట్లను తటస్థ ఓటర్లను ఎక్కువగా చీల్చే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇక యువత మొదటిసారి ఓటర్లు అంటే 18-35 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లలో విజయ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. వీరు సాధారణంగా మార్పును కోరుకునే వారు. ఈ ఓట్లు ఇదివరకు డీఎంకే లేదా నామ్ తమిళర్ కట్చి వైపు వెళ్లేవి. ఇప్పుడవి భారీగా విజయ్ వైపునకే ఎక్కువగా మళ్లేలా తెలుస్తోంది. ఇక జయలలిత లేని లోటును భర్తీ చేసే మాస్ లీడర్ కోసం చూస్తున్న AIADMK కేడర్, ఇతర మద్దతుదారుల్లో కొంత భాగం విజయ్ వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తోంది.
అసంఘటిత ఓటర్ల విషయానికి వస్తే.. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండి, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ఓటర్లు.. గతంలో AIADMK లేదా BJP కి ఓటు వేసేవారు. ఇప్పుడు విజయ్ ఒక బలమైన థర్డ్ ఆప్షన్‌గా కనిపించడంతో ఈ ఓట్లు అటు చీలిపోతున్నాయి. ఏ పార్టీకిది మేలు చేయబోతోంది? అని గమనిస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఓట్ల చీలిక అధికార DMK కూటమికే మేలు చేసేలా కనిపిస్తోందని అంటున్నారు పలువురు సెఫాలజిస్టులు. ప్రతిపక్ష ఓట్లు AIADMK, BJP, NTK, TVK మధ్య చీలేలా కనిపిస్తున్నాయి. DMK తన సొంత ఓట్ బ్యాంక్ సుమారు 30-35 శాతాన్ని కాపాడుకోగలిగితే.. తక్కువ మెజారిటీతోనైనా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.
అందుకే ప్రతిపక్షాలు విజయ్‌ను DMK కి లాభం చేకూర్చే బి-టీమ్ అని విమర్శిస్తున్నాయి. విచిత్రమైన విషయమేంటంటే, విజయ్ తాను డీఎంకేకి ప్రత్యామ్నయ రాజకీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఆయన స్వయంగా చెప్పిన మాట కూడా ఇదే. తమ సమీప ప్రత్యర్ధి పార్టీ డీఎంకే, సైద్ధాంతిక వ్యతిరేక పార్టీ బీజేపీ అని ఆయనే అన్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తే డీఎంకేకే ఆయన పార్టీ ఎక్కువ మేలు చేకూర్చిపెట్టేలా తెలుస్తోంది.
చెన్నై, మధురై, త్రిచీ వంటి పట్టణ ప్రాంతాల్లో విజయ్ ప్రభావం ఎక్కువగా ఉంది. దానికి తోడు విజయ్ తన మేనిఫెస్టోలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెళ్లిళ్లకు బంగారం వంటి పథకాలు ప్రకటించి మహిళా ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. విజయ్ రాక వల్ల తమిళనాడులో బహుముఖ పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి, పరోక్షంగా అధికార పక్షానికి లైఫ్ లైన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, విజయ్ తన ఓటు షేర్‌ను 25 శాతం దాటించగలిగితే మాత్రం ఆయన కింగ్ మేకర్‌గా చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. అది జరగాలంటే డీఎంకేకి బాగా తక్కువ సీట్లు రావాలి. అప్పుడు విజయ్ కున్న ఆ చిన్న పాటి సీట్లు సైతం అధికారంలోకి రావడానికి ఉపయోగ పడాలి.
బేసిగ్గా విజయ్ ఇక్కడ ఎలాంటి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశముందో చూస్తే ఆయన ఓట్ స్ప్లిటర్ గా మారి.. డీఎంకేకి అడ్వాంటేజీ కలిగేలా చేయడం ద్వారా. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కారణంగా ఆ పార్టీకి ఆయన మేలు చేసేలా కనిపిస్తున్నారు. ఇక్కడ ఆయన కింగ్ మేకర్ పాత్ర ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అచ్చం 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధికార కాంగ్రెస్ కి మేలు చేస్తున్నట్టుగా.. అంచనా వేస్తున్నారు పలువురు విశ్లేషకులు.
Also Read: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని పరిగెత్తించి కొట్టారు.. ఎక్కడో కాదు..!