GVMC Elections: బీచ్ సిటీ విశాఖ పట్నంలో ఒక ఆనవాయితీ కొనసాగుతోంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి ఓ చరిత్ర ఉంది. గ్రేటర్ విశాఖలో ఒకే ఒక్క సారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా విశాఖ మేయర్ పదవిని కూడా టిడిపియే కైవసం చేసుకుంది. అపుడు టిడిపి అధినేత ముఖ్యమంత్రి కూడా నందమూరి తారకరామారావు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు సార్లు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగితే రెండు సార్లూ కూడా టిడిపి అభ్యర్ధులు మేయర్ కాలేకపోయారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సారి జరగబోయే జివిఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవిని టిడిపి సొంతం చేసుకుంటుందా? లేక పాత సంప్రదాయమే కొనసాగి ప్రతిపక్షానికి చేజార్చుకుంటుందా? అన్నది చూడాలి.
ఈ సారి ఫలితం ఎలా ఉంటుంది?
విశాఖ కార్పొరేషన్ కు మొదటి సారి 1981లో ఎన్నికలు జరిగినపుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ ఎన్నికల్లో బిజెపికి చెందిన ఎన్.ఎస్.ఎన్.రెడ్డి మేయర్ అయ్యారు. 1987లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి డి.వి.సుబ్బారావు మేయర్ అయ్యారు. అపుడు ఎన్టీయార్ సిఎంగా ఉన్నారు. ఆ తర్వాతి ఎన్నికలు 1995లో జరిగాయి. అపుడు చంద్రబాబు సిఎం.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి సబ్బం హరి మేయర్ అయ్యారు.2000వ సంవత్సరంలో చంద్రబాబు సిఎంగా ఉండగానే మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు చెందిన రాజాన రమణి మేయర్ అయ్యారు.2007లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పి.జనార్ధన్ మేయర్ అయ్యారు. అపుడు దివంగత వై.ఎస్.ఆర్. సిఎంగా ఉన్నారు. ఆ తర్వాత 2021లో ఎన్నికలు జరిగాయి. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికారంలో ఉంది అపుడు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గొలగాని హరి వెంకట కుమారి మేయర్ గా విజయం సాధించారు.2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో వైసీపీ కార్పొరేటర్ల మద్దతుతో టిడిపి ఆ పదవిని చేజిక్కించుకుంది. అపుడు టిడిపికి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్ అయ్యారు. అయితే ఆయన దొడ్డిదారిన మేయర్ అయ్యారని వైసీపీ ఆరోపించింది. ఇక ఇపుడు మళ్లీ చంద్రబాబు సిఎంగా ఉండగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఫలితం ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
చరిత్ర తిరగరాస్తారా?
ఈ సారి వైసీపీ తరపున వరుదు కల్యాణి మేయర్ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. మేయర్ పదవితో పాటు మొత్తం 120 డివిజన్లకు అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించింది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకత్వం. సీట్ల సర్దుబాటు సమస్య ఉండడం వల్ల కూటమి కాస్త ఆలస్యంగా అభ్యర్ధులను ప్రకటించింది. టిడిపి తరపున ముక్కా శ్రావణి మేయర్ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు.రసవత్తరంగా జరగనున్న ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తారా? రిపీట్ అవుతుందా? అన్నది కాలమే చెప్పాలి.
Also Read: దక్షిణాది రాష్ట్రాల భద్రతకు బిగ్ ప్లాన్.. ఉమ్మడి సెక్రటేరియట్‌కు రేవంత్ పిలుపు!