Nalgonda MLC; స్వేచ్చ బ్యూరో: నల్లగొండ ఎమ్మెల్సీ టికెట్ చుట్టూ గులాబీ పార్టీలో రాజకీయ సందడి మొదలైంది. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. ఈసారి బీసీ నాయకుడికి అవకాశం కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో బీసీ ప్రాతినిధ్యంపై చర్చ ఊపందుకున్న నేపథ్యంలో.. ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీసీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి ఉన్న రాజకీయ బలం, ప్రజల్లో బీసీ నినాదానికి లభిస్తున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ తమకు టికెట్ కేటాయించాలని గులాబీ అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తే గెలుపు అవకాశాలు మెరుగవుతాయని ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన సిట్టింగ్ స్ధానాన్ని తిరిగి కైవసం చేసుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న చర్చ బలంగా సాగుతున్నది. కేంద్రం సైతం బీసీ జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ ను సైతం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కేవలంలో బీసీ మంత్రిత్వశాఖ కేటాయించడంతో పాటు జనాభాప్రతిపాదికన సీట్లు కేటాయించాలని, రాష్ట్రంలోనూ మంత్రి పదవులతోపాటు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బీసీలు ఉద్యమానికి సన్నద్ధ మవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీలోని బీసీ నేతలు కోరుతున్నారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు కల్పించాలన్న డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. బీసీలకు టికెట్ కేటాయిస్తే సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినట్లవుతుందని, అదే సమయంలో అన్నివర్గాల మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. పార్టీ ఇప్పటికే బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో.. ఆ నినాదాన్ని కార్యరూపంలో చూపించేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఓ అవకాశమని ఆశావహులు భావిస్తున్నారు. బీసీ అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పడంతోపాటు, సామాజిక వర్గాల మధ్య పార్టీ పట్టు పెంచుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధి విస్తృతంగా ఉండటంతో అభ్యర్థి ఎంపికలో మూడు జిల్లాల రాజకీయ పరిస్థితులు కీలకం కానున్నాయి. నల్లగొండలో పార్టీకి ఉన్న పునాది, వరంగల్‌లోని రాజకీయ సమీకరణాలు, ఖమ్మం జిల్లాలోని సామాజిక వర్గాల మద్దతు.. ఇలా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థిని ఎంపిక చేస్తే మూడు జిల్లాల్లోని ఆయా వర్గాల ఓట్లను సమీకరించుకోవచ్చని ఆశావహులు లెక్కలు వేస్తున్నారు. స్థానికంగా పరిచయాలు, పార్టీ శ్రేణులతో సంబంధాలు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడికి అవకాశం కల్పిస్తే ఫలితం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుల సమీకరణాలతోపాటు ఓటర్ల నమోదు, విద్యావంతులతో అభ్యర్థికి ఉన్న అనుబంధం, ప్రచార వ్యూహం, వ్యక్తిగత విశ్వసనీయత కూడా ప్రభావం చూపనున్నాయి.
Also read: చిరంజీవి కాకా మూవీ నుండి సీన్ లీక్.. ఊరమాస్ గెటప్ లో అదుర్స్!
పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకులు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనవారు, దీర్ఘకాలంగా పార్టీ కోసం కృషి చేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అభిప్రాయాలు కూడా అభ్యర్థి ఎంపిక చర్చలో ప్రస్తావనకు వస్తున్నాయి. ఇదే అంశాన్ని పార్టీ అధిష్టానం వద్ద సైతం కొంతమంది నేతలు ప్రస్తావించినట్లు సమాచారం. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతల వద్దకూడా బీసీ టికెట్ పై చర్చకు వచ్చినట్లు తెలిసింది. బీసీ వర్గానికి చెందిన అర్హుడైన నాయకుడికి అవకాశం కల్పిస్తే సామాజిక న్యాయంతోపాటు పార్టీకి నిబద్ధతతో పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చినట్లవుతుందని ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. మూడు జిల్లాల్లోని సీనియర్ నాయకులు, ఉద్యమ నేపథ్యం ఉన్నవారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే బీసీ అభ్యర్థిత్వానికి ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల నాయకులు సైతం మద్దతు ఇస్తామని పలువురు పేర్కొంటున్నట్లు సమాచారం. ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు మాత్రమే ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామనే ధోరణిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ మొదలవడంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలను కలిసి తమ రాజకీయ అనుభవం, సామాజిక పునాది, మూడు జిల్లాల్లో ఉన్న పరిచయాలు, ఎన్నికల్లో పోటీ చేయగల సామర్థ్యాన్ని వివరిస్తున్నారు. పార్టీకి విధేయంగా పనిచేసిన వారిని గుర్తించాలని, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారుడు, పీడీయాక్టు కేసు నమోదు అయిన డాక్టర్ చెరుకు సుధాకర్ ఆశిస్తున్నట్లు సమాచారం. మలిదశ ఉద్యమసమయంలో కీలకంగా పనిచేశారు. ఒకానొక సమయంలో ఉద్యమానికి ఊరిపోశారు. పల్లె రవికుమార్ సైతం టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. టీజేఎఫ్ స్థాపించి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఈ మూడు జిల్లాల్లో అనుచరులు సైతం ఉన్నారు. మరోవ్యక్తి, ఓయూ జేఏసీ నేత, షిప్ అండ్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు సైతం ఆశిస్తున్నట్లు సమాచారం. వీరు గాకఇంకా కొందరు పార్టీ టికెట్ ను ఆశిస్తున్నట్లు పార్టీలోనే చర్చజరుగుతుంది. అయితే ఒక్క స్థానం కోసం పలువురు ఆశావహులు ప్రయత్నిస్తుండటంతో ఎంపిక ప్రక్రియ సమయంలో పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారే అవకాశముంది. సామాజిక సమీకరణాలు ఒకవైపు.. నాయకుడి ప్రజాబలం, పార్టీతో అనుబంధం, ఎన్నికల నిర్వహణ సామర్థ్యం మరోవైపు ప్రభావం చూపనున్నాయి.
బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తే గెలుపు సులభమవుతుందన్నది ఆశావహుల ప్రధాన వాదన. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం సామాజిక వర్గాల సమీకరణాలే విజయాన్ని నిర్ణయించవు. పట్టభద్రుల ఓటర్ల నమోదు, యువతలో అభ్యర్థికి ఉన్న గుర్తింపు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతుల సమస్యలపై అవగాహన, క్షేత్రస్థాయి ప్రచారం కీలకం కానున్నాయి.ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఎంపిక, వారి వ్యక్తిగత ప్రభావం, స్థానిక రాజకీయ పరిస్థితులు కూడా ఫలితంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల బీసీ అభ్యర్థిత్వం పార్టీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందన్నది అభ్యర్థి ఎంపికతోపాటు ఎన్నికల కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది.
బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్, మూడు జిల్లాల సామాజిక సమీకరణాలు, సీనియర్ల అభిప్రాయాలు, ఆశావహుల రాజకీయ బలం.. వీటన్నింటినీ బేరీజు వేసుకుని పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బీసీ నేతలకు అవకాశం కల్పించాలన్న వాదన బలపడుతున్నప్పటికీ, తుది ఎంపికపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఉత్కంఠ కొనసాగనుంది.టికెట్ కోసం సాగుతున్న ప్రయత్నాల్లో ఎవరి వాదనకు అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తుంది? బీసీ నినాదానికి రాజకీయ అవకాశంగా రూపమిస్తుందా? లేక ఇతర సమీకరణాలకు పెద్దపీట వేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. బీసీకి టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయాలకోసమే బీసీ రాగం ఎత్తుకుంటుందని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందనే ప్రచారం జరిగే అవకాశం ఉంది. దీంతో గులాబీపార్టీకి ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉంది. మరోవైపు బీసీలకు పట్టున్న ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల టికెట్ ఇస్తేనే విజయం తధ్యమని పలువురు పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. పార్టీ నిర్ణయం ఏం తీసుకుంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also read: రోడ్లు ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఎమ్మెల్యేల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం